Farmers Agitation | శంభు సరిహద్దు నుంచి ఢిల్లీకి రైతుల పాదయాత్ర
x

Farmers Agitation | శంభు సరిహద్దు నుంచి ఢిల్లీకి రైతుల పాదయాత్ర

రైతుల పోరాటాన్ని "అరాచకం" అని అభివర్ణించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది.


తమ డిమాండ్ల సాధన కోసం రైతులు ఢిల్లీబాట పట్టనున్నారు. పంజాబ్, హర్యానాలను కలిపే శంభు సరిహద్దు నుంచి 101 మంది రైతుల ‘‘జాతా’’ బృందం శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీకి పాదయాత్రగా బయలుదేరుతుందని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. రైతుల తొలి జాతాకు సత్నామ్ సింగ్ పన్ను, సురీందర్ సింగ్ చౌతాలా, సుర్జిత్ సింగ్ ఫుల్, బల్జీందర్ సింగ్ నాయకత్వం వహిస్తారని తెలిపారు. ఇదిలా ఉండగా SKM నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ గురువారం ఖానౌరీ సరిహద్దు పాయింట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

సెక్షన్ 163 అమలు..

హర్యానాలోని అంబాలా జిల్లా పోలీసు యంత్రాంగం శంభు సరిహద్దు వద్ద ఇప్పటికే సెక్షన్ 163 అమలు చేసింది. ఈ చట్టం ప్రకారం ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒక చోట సమావేశం కాకూడదు. డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. కాలినడకన, వాహనాలు లేదా ఇతర మార్గాల్లో ఊరేగింపు నిషేధం. ఢిల్లీ పోలీసుల నుంచి అనుమతి వచ్చిన తర్వాత మాత్రమే పాదయాత్ర గురించి ఆలోచించాలని అంబాలా జిల్లా యంత్రాంగం ఇప్పటికే రైతులను కోరింది. కాని రైతులు పాదయాత్ర చేయాలని గట్టిగా నిర్ణయించుకోవడంతో అంబాలా పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. కేంద్ర ప్యారామిలిటరీ బలగాలను హర్యానా సరిహద్దుకు పంపారు. శంభు సరిహద్దు వద్ద వాటర్ ఫిరంగులను మోహరించారు. అంబాలా జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

ఢిల్లీ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం..

ఇటు ఢిల్లీ పోలీసులు కూడా సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నోయిడా సరిహద్దులో జరుగుతున్న పరిణామాలపై కూడా పోలీసులు నిఘా ఉంచారు.

మధ్యాహ్నం 1 గంటలకు మార్చ్..

శంభు సరిహద్దులో గురువారం రైతు నాయకులు పంధేర్ మాట్లాడుతూ..“శంభు సరిహద్దు నుంచి మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీ వైపు కవాతును ప్రారంభిస్తాము. ప్రభుత్వం ఏం చేస్తుందో వారే నిర్ణయించుకోవాలి. తమ పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకుంటే అది రైతుల నైతిక విజయంగా భావిస్తాం. ట్రాక్టర్ ట్రాలీలతో ఢిల్లీకి రావొద్దని కేంద్ర, రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. అందుకే మేం కాలినడకన ఢిల్లీకి బయల్దేరుతాం. రైతులను అడ్డుకోవడం సబబు కాదు.’’ అని పేర్కొన్నారు పంధేర్.

అంతర్జాతీయ సరిహద్దులా కనిపిస్తోంది..

“ఇది పంజాబ్-హర్యానా సరిహద్దులా కనిపించడం లేదు. పోలీసులు మమ్మల్ని వేరే దేశం నుంచి వచ్చిన శత్రువుల్లా చూస్తున్నారు. మేం ఈ దేశ పౌరులం. మా డిమాండ్లను కేంద్రానికి చెప్పడానికి శాంతియుతంగా దేశ రాజధానికి బయలుదేరుతున్నారు. మొదటి జాతా తర్వాత, తరువాతి రోజుల్లో ఇతర జాతాలు కూడా దేశ రాజధాని వైపు కదులుతాయి.’’అని చెప్పారు పంధేర్.

రైతుల డిమాండ్లేమిటి?

పంటలకు కనీస మద్దతు ధర, పంటల రుణమాఫీ, రైతులు, రైతు కూలీలకు పెన్షన్, విద్యుత్ ఛార్జీల పెంపు ఉపసంహరణ, రైతులపై పోలీసు కేసుల ఉపసంహరణ, 2021 లఖింపూర్ ఖేరీ హింసాకాండ బాధితులకు న్యాయం, 2013 భూసేకరణ చట్టం పునరుద్ధరణ, 2020-21 ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపు.

సీఎం యోగీ క్షమాపణ చెప్పాలి..

రైతుల పోరాటాన్ని "అరాచకం" అని అభివర్ణించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని సంయుక్త కిసాన్ మోర్చా (SKM) డిమాండ్ చేసింది. నిరసన తెలిపే హక్కు దేశంలోని పౌరులందరికీ రాజ్యాంగ కల్పించిన హక్కు అని పేర్కొంది.

గృహ నిర్బంధాలు అప్రజాస్వామికం..

‘‘రైతులు నేరస్థులు కాదు తీవ్రవాదులూ కాదు. ఉత్తరప్రదేశ్ పోలీసులు రైతు నాయకుల ఇళ్లలోకి చొరబడి వారికి గృహ నిర్భంధం చేస్తున్నారు. లఖింపూర్ ఖేరీ ఊచకోతలో తీవ్రంగా గాయపడిన SKM నాయకుడు తజిందర్ సింగ్ విర్క్‌ను కట్ఘర్ పోలీస్ స్టేషన్‌లో మూడు గంటలకు పైగా నిర్బంధించారు. యమునా నదిలో జరిగే కిసాన్ మహాపంచాయత్‌కు హాజరుకాకుండా రాకేష్ టికైత్‌ను అలీఘర్ పోలీసులు నిర్బంధించారు.’’ అని సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది.

Read More
Next Story