
తదుపరి ముంబై మేయర్ 'మరాఠీ హిందువు'
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్..
ముంబై(Mumbai) తదుపరి మేయర్ మరాఠీ హిందువు అవుతారని మహారాష్ట్ర(Maharashtra) ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(C. M. Devendra Fadnavis) అన్నారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జనవరి 15న జరగనున్న విషయం తెలిసిందే మేయర్ ఎవరవుతారన్న దానిపై విస్త్రత చర్చ జరుగుతోంది. శివసేన (UBT), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) తమ కూటమి నుంచి మరాఠీ వ్యక్తి ఆ పదవిని చేపడతారని ఇటీవల ప్రకటించగా.. AIMIM నాయకుడు వారిస్ పఠాన్ ముంబై తదుపరి మేయర్ ముస్లిం మహిళ కావచ్చు అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫడ్నీవీస్ స్పందించారు. ముంబై మంథన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. దేశానికి ప్రాధాన్యత ఇవ్వాలనే బీజేపీ సిద్ధాంతాన్ని పునరుద్ఘాటించారు. ఓటర్లను పార్టీ భాషాపరంగా విభజించడానికి ప్రయత్నిస్తుందనే ఆరోపణలను తోసిపుచ్చారు. మేయర్ పదవి మరాఠీ హిందువులకు రిజర్వ్ చేశారా అని నేరుగా అడిగినప్పుడు.. స్థానిక నాయకత్వం సహజంగానే ప్రాంతీయ గుర్తింపును ప్రతిబింబిస్తుందని సమాధానమిచ్చారు. చెన్నైలో ప్రజలు తమిళ మేయర్‌ను ఆశిస్తున్నట్లే.. ముంబై మేయర్ మరాఠీ అవుతారని పేర్కొంటూ.. పరిస్థితిని ఇతర నగరాలతో పోల్చారు.
‘‘బీజేపీ ఓటర్లలో మరాఠీలు, మరాఠీయేతరులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ మాకు ఓటు వేస్తారు. ఇద్దరు సోదరులు (దాయాదులు ఉద్ధవ్,రాజ్ ఠాక్రే) కలిసి వచ్చినా..మా ఓటు వాటా తగ్గదు" అని ఆయన అన్నారు.

