యూపీ, ఎంపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఉత్తర్వులపై మధ్యంతర స్టే పొడిగింపు
కన్వర్ యాత్ర నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాలయిన యూపీ, ఎంపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయమేంటి? దానిపై ప్రతిపక్షాలు ఎందుకు కోర్టుకెక్కాయి?
కన్వర్ యాత్ర మార్గంలో తినుబండారాలను అమ్మే యజమానులు తప్పనిసరిగా తమ దుకాణం ముందు యజమాని పేరుతో బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని బీజేపీ పాలిత రాష్ట్రాలయిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఈ ఆదేశాలపై స్టే విధిస్తూ జూలై 22న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఇదే సమయంలో తమ స్పందన తెలియజేయాలని మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలను సుప్రీం కోరుతూ కేసును ఆగస్టు 5కు వాయిదా వేసింది.
కన్వర్ యాత్ర గురించి క్లుప్తంగా..
ఉత్తర భారతంలో శ్రావణమాసంలో జరిగే కావడి యాత్ర లేదా కన్వర్ యాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏటా దాదాపు రెండు నుంచి మూడు కోట్ల మంది హిందువులు ఈ యాత్రలో పాల్గొంటారు. హరిద్వార్, ఇతర పవిత్ర క్షేత్రాల నుంచి గంగాజలాన్ని తీసుకొచ్చి శివుడికి పూజ చేస్తారు. ఈ యాత్ర జూలై 22న ప్రారంభమైంది. ఆగస్టు 6న ముగుస్తుంది.
బీజేపీ పాలిత రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయమేంటి?
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్య ప్రదేశ్ ప్రభుత్వాలు కన్వర్ యాత్రకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఒక నిర్ణయం తీసుకున్నాయి. యాత్రం మార్గం మధ్యలో ఆహారపదార్థాలను అమ్మేవారు తమ దుకాణాల ముందు యజమానుల పేర్లను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేశాయి. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే మొదటి తప్పుకు రూ. 2,000, రెండోసారి ఉత్తర్వులను ధిక్కరిస్తే రూ. 5,000 జరిమానా విధిస్తామని ఉజ్జయిని మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ ముఖేష్ తత్వాల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం భక్తుల భద్రత, పారదర్శకత కోసమేనని, ముస్లిం దుకాణాదారులను లక్ష్యంగా చేసుకుని తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేశారు.
తప్పుబట్టిన ప్రతిపక్షాలు..
బీజేపీ పాలిత రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. మూడు రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయం వర్గాల మధ్య వైషమ్యాలకు దారితీస్తాయని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, విద్యావేత్త అపూర్వానంద్ ఝా, కాలమిస్ట్ ఆకర్ పటేల్, ఎన్జీవో అసోసియేషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ పేర్కొంటూ ఈ ఉత్తర్వులపై స్టే విధించాలని కోరారు. దానిపై కోర్టులో విచారణ జరుగుతోంది.
ఉత్తర్వును సమర్థించుకున్న యూపీ సర్కారు..
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాము జారీ చేసిన ఉత్తర్వులపై కోర్టుకు వివరణ ఇచ్చుకుంది. కన్వర్ యాత్ర మార్గంలో తినుబండారాలు అమ్మే వారు తమ షాపుల ముందు యజమానుల పేరుతో బోర్డు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించిన మాట వాస్తవమేనని అయితే పారదర్శకత కోసమే ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చింది.
"భక్తులు ఎంతో నిష్టతో యాత్రకు వస్తారు. మతపర భావాలను దృష్టిలో యాత్ర సమయంలో భక్తులు తాము తీసుకునే ఆహారానికి సంబంధించి ఎంపిక చేసుకునేందుకు వీలుగా బోర్డులు ఉపయోగపడతాయని" అని కోర్టుకు తెలిపింది. అయితే తమ ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు మత వివక్షను ప్రోత్సహించేందుకు కుట్ర పన్నుతున్నాయని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని మతాలు, విశ్వాసాలను దృష్టిలో ఉంచుకుని వారివారి పండుగలకు సమాన ప్రాధాన్యం ఇస్తుందని సుప్రీంకోర్టుకు తెలిపింది.
'వ్యాపారాలపై ఎలాంటి నిషేధం లేదు'
ఆహారాన్ని విక్రయించే వారి పట్ల తమకు ఎలాంటి వివక్ష లేదని, వ్యాపారాలను యథేచ్చగా చేసుకోవచ్చని యూపీ ప్రభుత్వం తెలిపింది. మాంసాహారాన్ని విక్రయించడం మినహా అన్ని వ్యాపారాలు యథావిధిగా చేసుకోవచ్చని పేర్కొంది.
2008లో సుప్రీం ఆర్డర్..
2008లో భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని జైనుల పండుగ సందర్భంగా గుజరాత్‌లోని స్లాటర్ హౌస్‌లను తొమ్మిది రోజుల పాటు పూర్తిగా మూసివేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. శాంతియుతంగా పాదయాత్ర జరిగేందుకు ఇలాంటి చర్యలు తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది.