
‘అందరూ కలిసి పోరాడాలి.. కాని నేను మాత్రం ఒంటరిగానే పోరాడతా..’
కలిసికట్టుగా పోటీచేస్తేనే బీజేపీని ఓడించగలమంటున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. తన రాష్ట్రం విషయంలో మాత్రం కాషాయ పార్టీతో ఒంటరిగానే పోరాడతానంటున్నారు.
గతేడాది హర్యానా ఎన్నికల ఎఫెక్టో లేక ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల ప్రభావమేమోగాని..వెస్ట్ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మాత్రం గట్టి నిర్ణయమే తీసుకున్నారు. 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్ లేదా ఏ ఇతర పార్టీలతో కలసి పనిచేసే అవకాశం లేదని స్పష్టంగా చెప్పారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశానికి ముందు పార్టీ ఎమ్మెల్యేలతో ఆమె సమావేశమయ్యారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ..మూడింట రెండొంతుల మెజార్టీ పక్కా అని నమ్మకంగా చెప్పారు.
‘మేం ఒక్కరమే ఢీ కొంటాం’
"ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ సాయం చేయలేదు. హర్యానాలో కేజ్రీవాల్ పార్టీ హస్తం పార్టీతో అలాగే వ్యవహరించింది. అందుకే ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. అందరూ కలిసి పోరాడాలి. బెంగాల్‌లో కాంగ్రెస్‌కు ఎలాంటి బలమూ లేదు. నేను ఒంటరిగానే పోటీ చేస్తా. బీజేపీని ఢీ కొట్టడానికి మనం సరిపోతాం. మరొకరి సాయం అక్కర్లేదు," అని ఆమె ఎమ్మెల్యేలకు స్పష్టంగా చెప్పినట్లు టీఎంసీల వర్గాల సమాచారం.
గెలుపుపై ధీమా..
తమ పార్టీ వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మమతా ధీమా (CM Mamata Banerjee) వ్యక్తం చేశారు. బీజేపీ(BJP) వ్యతిరేక ఓట్లు చీలకుండా ఒకే మనస్తత్వం కూడిన పార్టీలు ఒక అవగాహనకు రావాలని, లేదంటే జాతీయస్థాయిలో ఇండియా కూటమి బీజేపీని ఆపడం కష్టమని అభిప్రాయపడ్డారు.
‘అప్రమత్తంగా ఉండాలి’
బీజేపీ ఓటమికి కొత్త వ్యూహాలను రచించే క్రమంలో.. విదేశీయుల పేర్లను ఓటర్ లిస్టులో చేర్చే ప్రయత్నం చేస్తుందని, ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలని మమతా బెనర్జీ సూచించారు. మమతా బెనర్జీ పార్టీ యూనిట్లను రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయికి, అలాగే వివిధ విభాగాల్లో మార్పులు చేయనున్నట్టు సమాచారం. అందుకే
ఫిబ్రవరి 25లోగా ప్రతి పదవికి ముగ్గురు పేర్లను సీనియర్ నేత అరూప్ బిస్వాస్‌కు సూచించాలని ఎమ్మెల్యేలకు ఆదేశించారు.
ఆధారాల్లేవ్..
ఆహారశాఖ మాజీ మంత్రి జ్యోతిప్రియో మాలిక్ అరెస్టును అన్యాయమని అభివర్ణించారు. రేషన్ స్కామ్ కేసులో ఆయనపై ఎలాంటి ఆధారాలు లేవని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.