
పశ్చిమ బెంగాల్: SIR అమలుపై రాజకీయ పార్టీల తీవ్ర అభ్యంతరాలు
క్షేత్రస్థాయి సిబ్బందిపై పర్యవేక్షణ పెంచిన ఎన్నికల సంఘం
పశ్చిమ బెంగాల్‌లో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర పునరీక్షణ (S.I.R) ప్రక్రియపై విమర్శలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో.. ఎన్నికల సంఘం (ECI) తన అధికార యంత్రాంగంపై అంతర్గత పర్యవేక్షణను కఠినతరం చేసింది. SIR అమలులో చోటుచేసుకుంటున్న లోపాలు, ఫిర్యాదులు, రాజకీయ పార్టీల అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
SIR ప్రక్రియలో భాగంగా ఓటరు వివరాల ధృవీకరణ, పాత డేటాతో పోలిక, డాక్యుమెంట్ల పరిశీలన వంటి అంశాల్లో లోపాలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కొన్ని చోట్ల అర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపునకు గురువుతున్నాయని ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల సంఘం బూత్ లెవల్ అధికారులు (BLOలు), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (AEROలు) సహా క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరుపై నిఘాను పెంచింది. వెరిఫికేషన్‌లో నిర్లక్ష్యం, డాక్యుమెంటేషన్ లోపాలు, మార్గదర్శకాలను సరిగా అమలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా SIR ప్రక్రియపై తృణమూల్ కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ విధానం ప్రజల ఓటు హక్కును ప్రభావితం చేసే ప్రమాదం ఉందని, ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల సంఘం మాత్రం ఓటరు జాబితాలో తప్పుల నివారణ కోసమే SIR చేపట్టామని, అర్హులైన ఒక్క ఓటరు కూడా నష్టపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేస్తోంది.
మొత్తంగా పశ్చిమ బెంగాల్‌లో SIR ప్రక్రియ చుట్టూ రాజకీయ వివాదాలు, పరిపాలనా అప్రమత్తతలు పెరుగుతున్న తరుణంలో, ఎన్నికల సంఘం తీసుకున్న అంతర్గత మానిటరింగ్ చర్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

