
ఒరిజనల్స్ ఏవి? సమాజ్‌వాదీని ప్రశ్నించిన ఈసీ
తప్పుడు ఆధారాలు సమర్పించడం నేరం - ఎన్నికల కమిషన్
ఉత్తరప్రదేశ్‌లో ఓటరు లిస్టు నుంచి కొంతమంది పేర్లను తొలగించారని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం స్పందించింది.
ఒరిజనల్స్ ఎక్కడ?
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) "ఓట్ల దొంగతనం" ఆరోపణల నేపథ్యంలో.. యూపీలో అఫిడవిట్ల వివాదం రాజుకుంటోంది. మిస్ అయిన 18వేల మంది ఓటర్ల గురించి అఫిడవిట్లు సమర్పించినా..ఈసీ నుంచి సమాధానం లేదని అఖిలేష్ యాదవ్ ఇటీవల పదేపదే ఆరోపిస్తున్నారు. ఆయన ఆరోపణలపై సీఈవో స్పందించింది. స్కాన్ చేసిన అఫిడవిట్లు మాత్రమే ఈమెయిల్ చేశారని, వెరిఫికేషన్ కోసం వాటి ఒరిజినల్స్ పంపాలని ఎస్పీ కార్యాలయానికి ఎన్నికల అధికారులు సమాచారం ఇచ్చారు.
‘‘ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తుల పేర్లతో సమాజ్‌వాదీ పార్టీ అఫిడవిట్లను సమర్పించింది. ఈ ఓటర్లలో కొందరు 2022 కంటే ముందే మరణించారని మా దర్యాప్తులో తేలింది. అయినప్పటికీ నవంబర్ 2022 తేదీలతో కూడిన అఫిడవిట్లను పంపారు. తప్పుడు ఆధారాలు సమర్పించడం కూడా నేరమే.’’ అని కూడా పేర్కొంది ఈసీ.