
గుడ్లు తింటే ‘క్యాన్సర్’ రాదు..
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టీకరణ..
కోడిగుడ్డు గురించి కొన్ని రోజులుగా చెడుగా ప్రచారం జరుగుతోంది. తింటే క్యాన్సర్ వస్తుందన్న వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కొంతమంది వాటిని కొనేందుకు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) స్పందించింది. గుడ్డులో ఎలాంటి కాన్సర్ కారకాలు లేవని స్పష్టం చేసింది. గుడ్డు గురించి చెడుగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దని కోరింది.
భారత్‌లో విక్రయించే గుడ్లలో నైట్రోఫ్యూరాన్ మెటబాలైట్స్‌ను గుర్తించినట్లు కొన్నిరోజులుగా పలు పోస్టులు వెలుగులోకి వచ్చాయి. 2011లో తీసుకువచ్చిన ఆహార భద్రత నిబంధలన ప్రకారం.. పౌల్ట్రీ, ఎగ్ ప్రొడక్షన్ జరిగే అన్ని దశల్లో నైట్రోఫ్యూరాన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు వెల్లడించారు. భారతదేశంలో నియంత్రణా ప్రమాణాలు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు.

