మీరు బీజేపీకి మద్ధతు ఇస్తారా? నవీన్ పట్నాయక్ సమాధానం ఏంటంటే..
x

మీరు బీజేపీకి మద్ధతు ఇస్తారా? నవీన్ పట్నాయక్ సమాధానం ఏంటంటే..

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీకి మీరు మద్ధతు ఇస్తారా? అనే ప్రశ్నకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. పాండియన్ పై కూడా..


సార్వత్రిక ఎన్నికలు నేటితో ముగియనున్నాయి. ప్రచార పర్వంలో రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకున్నఆరోపణలకు కాస్త విరామం ఇచ్చి రాజకీయ బలం పెంపొందించుకోవడానికి పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

సింగిల్ డిజిట్ స్థానాలు సాధించే పార్టీలతో సహ, రెండు పదుల స్థానాలు సాధించే వాటితో జట్టు కట్టేందుకు పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. తాజాగా ఇదే అంశంపై బీజేడీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్పందించారు. ఎన్నికల అనంతరం మీరు బీజీపీతో పొత్తు పెట్టుకుంటారా అన్న ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

లోక్‌సభ - అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో ఒడిశాలో పూర్తయ్యాయి. అయితే ఎన్నికల సందర్భంగా సీఎం నవీన్ పట్నాయక్, మాజీ బ్యూరో క్రాట్ వికె పాండియన్ పై బీజేపీ తీవ్ర ఆరోపణలకు దిగింది. బీజేడీ చీఫ్ అనారోగ్యంతో ఉన్నారని, ఇక నుంచి స్వతంత్ర్య నిర్ణయాలు తీసుకోలేరని, తమిళనాడు బ్యూరో క్రాట్ అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని కమలదళం విమర్శలు గుప్పించింది.
తగిన నిర్ణయం తీసుకుంటుంది
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమ పార్టీ మద్ధతు అవసరమైనప్పుడు తగిన నిర్ణయం తీసుకుంటామని నవీన్ పట్నాయక్ అన్నారు. బీజేపీ పైకి విమర్శలు తన నుంచి ప్రారంభం కాలేదని, వారే మొదట ప్రారంభించారని అన్నారు.
“నేను ప్రజా జీవితంలో ఎవరితోనూ క్రూరంగా ప్రవర్తించలేదు. పార్టీలకు మద్దతు అవసరమైనప్పుడు, మేము మా సరైన స్థానాన్ని నిర్ణయిస్తాము ” అని BJD చీఫ్ గురువారం జాతీయ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఒడిశాలో ఎన్నికల ర్యాలీల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ నేతలు సీఎం నవీన్ పట్నాయక్, ఆయన బ్యూరో క్రాట్ పాండియన్ పై విమర్శల వర్షం కురిపించారు. ఆయన బయటి రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని, ఒడియా సంస్కృతికి చెందిన వాడు కాదని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ప్రజలపై రుద్దుతున్నారని పేర్కొన్నారు. పాండియన్ ప్రభుత్వాన్ని హైజాక్ చేయడానికి పట్నాయక్ అనారోగ్యాన్ని ఉపయోగించుకున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు.
పాండియన్ నా వారసుడు కాదు: పట్నాయక్
పాండియన్‌తో తనకున్న అనుబంధంపై అన్ని ఊహాగానాలకు స్వస్తి పలికిన పట్నాయక్, తమిళ బ్యూరోక్రాట్ తన వారసుడు కాదని, ఒడిశా ప్రజలు మాత్రమే తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకోగలరని ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
“అతను నా వారసుడు కాదు. నేను ఈ అతిశయోక్తులు అర్థం చేసుకోలేను. ఆయన ఈ ఎన్నికల్లో నిలబడడం లేదు. నేను ఇవన్నీ అతిశయోక్తులు, అబద్ధాలుగా చూస్తున్నాను" అని పట్నాయక్ అన్నారు. “రాష్ట్ర ప్రజలు నా వారసత్వాన్ని నిర్ణయిస్తారని నేను చెప్పాను. ఇదే సహజ ఫలితం,” అన్నారాయన.
పాండియన్‌కు పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీ సీనియర్ నాయకుల కంటే ఎక్కువగా విషయాలను చక్కబెడుతున్నారనే ఆరోపణలను కూడా BJD నాయకుడు తోసిపుచ్చారు.
పార్టీ నిర్ణయాల కోసం తాను ఇతరులపై ఆధారపడతాననే ఊహాగానాలను కూడా నవీన్ పట్నాయక్ కొట్టిపారేశారు. పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క నిర్ణయం తానే తీసుకుంటూనే ఉన్నానని, ఇప్పటివరకు జరిగిన అన్ని క్యాబినెట్ సమావేశాలకు తాను అధ్యక్షత వహించానని చెప్పారు. తమ పార్టీ వరుసగా ఆరోసారి ఎన్నికల్లో విజయం సాధించి పార్లమెంట్‌లో మంచి మెజారిటీ సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
'మంచి స్నేహితుడు'..
పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడం వెనుక కారణాలపై దర్యాప్తు చేయడానికి తాను ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తానని మోదీ ఇటీవల చేసిన ప్రకటనపై విరుచుకుపడిన BJD చీఫ్, తన “మంచి స్నేహితుడు” అని చెప్పుకునే ప్రధాని కేవలం ప్రశ్న వేసి ఉండకుండా, నాకు డైరెక్ట్ గా కాల్ చేసి ఉండాల్సిందని అన్నారు. అలా చేయడం ద్వారా పుకార్లు వ్యాప్తికి అడ్డుకట్ట పడేదన్నారు.
Read More
Next Story