ఎంపీ మర్డర్ మిస్టరీ ఛేదించేందుకు భారత్‌కు బంగ్లాదేశ్ పోలీసులు..
x

ఎంపీ మర్డర్ మిస్టరీ ఛేదించేందుకు భారత్‌కు బంగ్లాదేశ్ పోలీసులు..

బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్‌ను ఎందుకు అతి కిరాతకంగా చంపారు? మర్డర్ చేసిందెవరు? చేయించిం దెవరు? మర్డన్ ప్లాన్ ఎక్కడ జరిగింది? కిరాయి హంతుకులెవరు?


బంగ్లాదేశ్ అధికార పార్టీకి చెందిన ఎంపి అన్వరుల్ అజీమ్ అనార్ హత్య కేసును విచారించేందుకు బంగ్లాదేశ్ పోలీసు బృందం ఆదివారం మధ్యాహ్నం కోల్‌కతా చేరుకుంది. సమగ్ర విచారణకు పశ్చిమ బెంగాల్ సిఐడి సహకారం తీసుకోనున్నారు. ఈ కేసులో అరెస్టు చేసిన నిందితులతో పాటు అనార్ బసచేసిన ఇంటి యజమానిని విచారించనున్నారు. కాగా బంగ్లాదేశ్ పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తామని కోల్‌కతాలోని ఒక సీనియర్ CID అధికారి చెప్పారు. కేసు పూర్వాపరాలను వారితో పంచుకుంటామని చెప్పారు.

అనార్ మే 12న వైద్యం కోసం కోల్‌కతా వచ్చారు. బరానగర్‌లోని తన స్నేహితుడు ఇంట్లో బసచేశారు. 13వ తేదీ డాక్టర్ అపాయింట్‌మెంట్ ఉందని ఇంటి నుంచి వెళ్లారు. తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో గోపాల్ బిశ్వాస్ మే 17వ తేదీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మే 18న అనార్ కోసం అన్వేషణ మొదలుపెట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఎంపీని చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు తెలుసుకున్న పోలీసులు వాటి కోసం వెతకడం ప్రారంభించారు.

‘‘ఎంపీని మొదట గొంతుకోసి చంపేశారు. చర్మం వలిచేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా ముక్కలుగా నరికారు. గుర్తించడానికి వీల్లేనంతగా శరీరాన్ని ఛిద్రం చేశారు. ఈ నేరాన్ని చేయడానికి ఒక వ్యక్తిని కూడా బంగ్లాదేశ్ నుంచే రప్పించారు.’’ అని కేసును విచారిస్తున్న పోలీసు అధికారి చెప్పారు.

హత్యకు రూ.5 కోట్లు చెల్లించారు..

అమెరికాలో ఉంటున్న ఈ ఎంపీ మిత్రుడే ఈ మర్డర్ సూత్రధారిగా భావిస్తున్నారు. అమెరికా పౌరసత్వం ఉన్న ఆ మిత్రుడే ఈ మర్డర్ కి ముందు ఒకటి రెండుసార్లు ఢాకాకు వచ్చి ఈ ప్లాన్ చేశారని అనుమానిస్తున్నారు. అనార్‌ను చంపడానికి కిరాయి మనుషుల్ని మాట్లాడింది కూడా ఆ స్నేహితుడేనని భావిస్తున్నారు. ఈ హత్యకు అమెరికా పౌరుడైన ఎంపీ సన్నిహితుడు రూ. 5 కోట్లు చెల్లించినట్లు విచారణలో తేలింది. శరీరాన్ని ముక్కలు చేయడానికి మాంసాన్ని నరికే కత్తుల్ని, రంపాల్ని వాడారు. పుర్రె, ఎముకలను చాపర్‌తో కత్తిరించినట్లు అధికారులు తెలిపారు. ఎంపీ అనార్‌ను ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందన్న విషయం తేలాల్సి ఉంది.

Read More
Next Story