బంగ్లాదేశ్ నుంచి భారత్ కు మరో తలనొప్పి
x
ఇటీవల మాల్దాలో పట్టుబడిన నకిలీ కరెన్సీ

బంగ్లాదేశ్ నుంచి భారత్ కు మరో తలనొప్పి

లక్షల సంఖ్యలో పట్టుబడుతున్న నకిలీ రూ.500 నోట్లు, అన్ని బంగ్లాదేశ్ నుంచే వస్తున్నట్లు గుర్తించిన దర్యాప్తు అధికారులు


గత ఏడాది ఆగష్టు లో బంగ్లాదేశ్ లో చెలరేగిన ఉద్యమం వల్ల షేక్ హసీనా తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. తరువాత తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ పగ్గాలు తీసుకున్నాక భారత వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నాడు.

ఈ మధ్య మన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు కూడా వేగంగా బంగ్లా నుంచి జరుగుతున్నాయి. నకిలీ భారత కరెన్సీ నోట్లు అక్రమ రవాణా వేగం ఫుంజుకున్నట్లు స్ఫష్టంగా తెలుస్తోంది. పోలీసులు, బీఎస్ఎఫ్ ఇటీవల స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీ కట్టలు వీటికి ఉదాహారణ.

50 లక్షలకు పైగా నకిలీ నోట్లు..
డిసెంబర్ లో బెంగాల్ లోని మాల్డా జిల్లా పోలీసులు సరిహద్దు ప్రాంతాలలో రూ. 50 లక్షల నకిలీ కరెన్సీని పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. ఇదే జిల్లాలో బక్రాబాద్ ప్రాంతంలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ లో మరో 8 లక్షల విలువైన 500 నోట్లను పోలీసులు పట్టుకున్నారు.
ముర్షిదాబాద్ జిల్లాలో బీఎస్ఎఫ్ మరో 16 లక్షల 500 నోట్లను స్వాధీనం చేసుకుంది. ఈ నకిలీ నోట్లు ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఢిల్లీకి సైతం భారీగా చేరుకున్నట్లు తెలుస్తోంది.
మాల్దా ఎస్పీ అభిజిత్ బందోపాధ్యాయ మాట్లాడుతూ.. నకిలీ కరెన్సీ స్మగ్లింగ్ భారీగా పెరిగిందని అంగీకరించారు. జూన్ ప్రారంభంలో ఢిల్లీ పోలీసులు నకిలీ కరెన్సీలోని ఎఫ్ఐసీన్ ను పరిశీలించినప్పుడూ అవి మొత్తం బంగ్లాదేశ్ నుంచి రవాణా అవుతున్నట్లు కనుగొన్నారు. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నకిలీ కరెన్సీ నెట్ వర్క్ లు తిరిగి క్రియాశీలమవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
టాస్క్ ఫోర్స్ నిర్వీర్యం..
పట్టబడుతున్న మొత్తం.. రవాణా అవుతున్న మొత్తంలో నాలుగో వంతే అని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఆగష్టు 2024 తరువాత దీనికి బంగ్లాదేశ్ నుంచి వ్యవస్థాగతంగా సహకారం అందుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
షేక్ హసీనా పాలనాకాలంలో భారత్, బంగ్లాదేశ్ రెండు కలిసి నకిలీ కరెన్సీ ,ఉగ్రవాద నిధులపై ఉమ్మడిగా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశాయి. ఇది రియల్ టైమ్ ఇంటలిజెన్స్ షేరింగ్ తో పాటు సరిహద్దు వద్ద కఠినమైన భద్రతా చర్యలను అమలు చేసేది.
ఢాకాలో ప్రభుత్వం మారిన తరువాత టాస్క్ ఫోర్స్ నిర్వీర్యమైంది. ఢాకాలో ప్రభుత్వం మారిన తరువాత ఉమ్మడి టాస్క్ ఫోర్స్ దాదాపుగా పనిచేయడం లేదు. క్రమం తప్పకుండా జరిగే సమన్వయ సమావేశాలు ఆగిపోయాయి. నిఘా సంబంధాలు లేవు. సరిహద్దు వెంబడి ఉమ్మడి కార్యలాపాలు మందగించాయి.
‘‘క్షేత్రస్థాయిలో తేడా కనిపిస్తోంది. సంవత్సరాలుగా నిర్మించిన సంస్థాగత శక్తి క్షీణిస్తోంది. వ్యక్తిగత సమన్వయం కోల్పోయాం’’ అని ఒక బీఎస్ఎఫ్ అధికారి వెల్లడించారు.
‘‘నకిలీ కరెన్సీ నెట్ వర్క్ లు ఇటువంటి అంతరాలను ఉపయోగించుకుంటున్నాయి. సహకారం చురుకుగా ఉన్నప్పుడూ పెద్ద పెద్ద కన్ సైన్ మెంట్లు సరిహద్దుదాటక ముందే అడ్డగించబడతాయి. ఇప్పుడు మళ్లీ స్థానిక హ్యండ్లర్లకు కరెన్సీ చేరుతోంది’’ అని బీఎస్ఎఫ్ అధికారి చెప్పారు. ఈ కరెన్సీ చారిత్రాత్మకంగా కేవలం ఆర్థిక నేరంగానే కాకుండా జాతీయ భద్రతా సమస్యగా కూడా చూస్తున్నాయి.
సంక్లిష్టమైన సందిగ్థత..
టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ముందు నాణ్యతతో కూడిన నకిలీ నోట్లు వ్యవస్థీకృత సిండికేట్ల ద్వారా దేశంలోని ప్రవహించేది. దేశంలో పనిచేస్తున్న ఉగ్రవాద నెట్ వర్క్ లు నిధులకు ప్రధాన వనరుగా ఉండేది.
తాజాగా పట్టుబడుతున్న నకిలీ కరెన్సీ ప్రవాహంలో ప్రత్యక్షంగా ఉగ్రవాద కోణం కనిపించనప్పటికీ వాటి ప్రభావం మాత్రం ఉంటుందని అంతా అంగీకరిస్తున్నారు. నకిలీ కరెన్సీ స్థానిక ఆర్థిక వ్యవస్థలను అస్థిరపరచడమే కాకుండా, చట్టవిరుద్దమైన కార్యకలాపాలకు నిధులు సమకూర్చే తక్కువ ధర సాధనంగా మారిపోయింది.
నోట్ల నాణ్యత కూడా అధికారులకు కలవరపాటు కలగజేస్తోంది. నకిలీ 500 నోట్లు సాధారణ పరిశీలనలో గుర్తించలేమని, అందుకే ఇవి సాధారణ గ్రామీణ, సెమీ అర్భన్ మార్కెట్లలో చాలా ప్రమాదకరంగా మారుతున్నాయని చెప్పారు.
బీఎస్ఎఫ్, ఎన్ఐఏ, రాష్ట్ర పోలీసుల మధ్య సమన్వయాన్ని తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితి న్యూఢిల్లీకి సంక్లిష్టమైన విధానపరమైన సందిగ్థతను తీసుకువచ్చింది.
సరిహద్దు వెంబడి దేశీయ వ్యవస్థను బలోపేతం చేస్తే కొంత ఫలితం ఉంటుంది. అయితే బంగ్లా సహకారం లేకుండా ఈ సమస్య పూర్తిగా అదుపులోకి రాదని వారు ప్రయివేట్ గా అంగీకరిస్తున్నారు.


Read More
Next Story