ఏపీలో డ్రగ్స్ మత్తు: ప్రజా ప్రతినిధుల కుటుంబాలపై ఆరోపణలు
x

ఏపీలో డ్రగ్స్ మత్తు: ప్రజా ప్రతినిధుల కుటుంబాలపై ఆరోపణలు

పోలీసు చర్యలు, రిహాబ్ సెంటర్లు ఎంతవరకు ప్రభావితం చేస్తాయి?


ఆంధ్రప్రదేశ్‌లో యువత, ముఖ్యంగా రాజకీయ కుటుంబాల సంతానం డ్రగ్స్‌కు బలి అవుతున్నారనే ఆరోపణలు ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రెండు సంచలన ఘటనలతో మరోసారి బయటకొచ్చాయి. తెలంగాణ పోలీసుల ‘‘ఈగల్ టీమ్’’ రైడ్లలో ఏపీ ఎమ్మెల్యే, ఎంపీ కుటుంబాలు చిక్కుకోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. గంజాయి, మెథాంఫెటమిన్ వంటి మాదకద్రవ్యాల వాడకం, సాగు ఆరోపణలు గిరిజన ప్రాంతాల నుంచి హైదరాబాద్ ఫామ్‌హౌస్‌ల వరకు వ్యాపించాయి. అయితే పూర్తి జాబితా బహిర్గతం కాలేదు. పోలీసు నిఘా, తల్లిదండ్రులకు సమాచారం, డీ-అడిక్షన్ సెంటర్ల చర్యలు ఎలా ఉన్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

‘జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి కేసు’

జనవరి 3, 2026న హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ (నార్సింగి)లో ఈగల్ టీమ్ తనిఖీల్లో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి కుమారుడు సి సుధీర్ రెడ్డి గంజాయి తాగుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. యూరిన్ టెస్ట్‌లో పాజిటివ్‌ రావడంతో నార్సింగి పోలీసులు ‘‘మాదకద్రవ్యాల నిరోధక చట్టం’’ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. గతంలో రెండుసార్లు ఇలాంటి కేసుల్లో చిక్కినట్లు పోలీసులు తెలిపారు. సుధీర్‌ను వెంటనే డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.


కొకయిన్

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు

మార్చి 2026లో హైదరాబాద్ మొయినాబాద్‌లోని మాజీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ రైడ్‌లో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. రక్త పరీక్షలో మెథాంఫెటమిన్ పాజిటివ్‌ వచ్చింది. బిజినెస్‌మ్యాన్ తిరువీధుల అర్జున్ రెడ్డి, అడ్వకేట్ కౌశిక్ రవి వంటి వారు కూడా పాజిటివ్ అయ్యారు. పోలీసులు ‘‘ఎన్‌డీపీఎస్’’ కింద కేసు నమోదు చేశారు. మొత్తం 11 మంది నిందితులుగా ఉండగా వారిలో రోహిత్ రెడ్డి, రితేష్, నమిత్ శర్మలకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించి జైలుకు తరలించారు.

డీ-అడిక్షన్ సెంటర్‌కు వెళ్లి కౌన్సెలింగ్ తీసుకోవాలని సూచించగా వారు “తాము డ్రగ్స్ తీసుకోలేదు, కోర్టులో నిరూపిస్తాం” అని నిరాకరించారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తనను డిన్నర్ ఆహ్వానితుడిగా చెప్పుకుంటూ నిర్దోషిగా బయటపడతానని ప్రకటన ఇచ్చారు. టీడీపీ అతనికి షోకాజ్ నోటీసు ఇచ్చి పార్టీ కార్యకలాపాల నుంచి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఆయన షోకాజ్ కు సమాధానం ఇటీవల ఇచ్చారు.

తెలంగాణ పోలీసులు SIT (Special Investigation Team) ఏర్పాటు చేశారు. (చెవెళ్ల DCP హెడ్‌గా, 9 మంది సభ్యులు). దర్యాప్తు 3 నెలల్లో పూర్తి చేసి చార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఆదేశాలు.

డ్రగ్స్ సప్లై చైన్ షిమ్లా వరకు విస్తరించినట్లు సమాచారం. అభిషేక్ సింగ్ (డ్రగ్స్ సప్లయర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్) అరెస్ట్ అయ్యాడు. ఇంటర్నేషనల్ లింకులు, మాఫియా కనెక్షన్లు బయటపడుతున్నాయి. రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌ను రెవెన్యూ అధికారులు అసైన్డ్ భూమిపై అక్రమ నిర్మాణం అని సీజ్ చేశారు.


ఇతర ఆరోపణలు, ప్రచారాలు

భీమవరం ఎమ్మెల్యే పి రామాంజనేయులు కుమారుడు గత ఏడాది హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసులో చిక్కినట్లు నివేదికలు వచ్చాయి. ఈ నివేదికలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు మత్తుకు అలవాటు పడ్డాడని, మాజీ మంత్రి నారాయణ కుమారుడు నిషీత్ (2017లో హైదరాబాద్ కారు ప్రమాదంలో మరణం) డ్రగ్స్ ప్రభావంతో చనిపోయాడని ప్రచారాలు ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో, ముఖ్యంగా జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఎంపీ పుట్టా మహేష్ ఆధ్వర్యంలో గంజాయి సాగు జరుగుతోందని, కొందరు గిరిజన ఎమ్మెల్యేల వ్యాపారాల వెనుక గంజాయి ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇవి ఇంకా నిరూపితం కాలేదు. డ్రగ్స్ వంటి నేరాలకు పాల్పడే వారిపై ఏపీ కూడా ఈగల్ టీమును ఏర్పాటు చేసి రంగంలోకి దిగింది.


గంజాయి

పోలీసు నిఘా, తల్లిదండ్రులకు సమాచారం

తెలంగాణ ఈగల్ టీమ్ హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లు, పార్టీలపై నిరంతరం దాడులు చేస్తోంది. స్పాట్ డ్రగ్ టెస్టులు (యూరిన్, రక్తం), పాజిటివ్ అయితే అరెస్టు లేదా డీ-అడిక్షన్ సెంటర్‌కు రెఫరల్ చేస్తున్నారు. ఏపీలో కూడా ఎన్‌టీఆర్, విశాఖ వంటి జిల్లాల్లో డ్రగ్స్ వ్యతిరేక దండయాత్రలు, అవగాహన కార్యక్రమాలు నడుస్తున్నాయి. సుధీర్ రెడ్డి వంటి కేసుల్లో తల్లిదండ్రులను సంప్రదించి రిహాబ్‌లో సహకరించాలని సూచిస్తున్నారు. అయితే ప్రత్యేక నిఘా ఎలా ఉంది? తల్లిదండ్రులకు ఖచ్చితమైన సమాచారం ఏమిటి అనేది పోలీసు వర్గాలు బహిర్గతం చేయడం లేదు. గోప్యత, దర్యాప్తు కారణాలతో పూర్తి వివరాలు రహస్యంగా ఉంచుతున్నారు. కొందరి కేసుల్లో కేసు నమోదు చేయకుండా రిహాబ్‌కు పంపినట్లు కూడా నివేదికలు ఉన్నాయి.

సిపిఐ నారాయణ కామెంట్స్

టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సీపీఐ సీనియర్ నాయకుడు డాక్టర్ కె. నారాయణ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో కలిసి డ్రగ్స్ కేసులో పుట్టా మహేష్ దొరకడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏలూరు ఎంపీకి మొయినాబాద్ ఫామ్‌హౌస్‌తో ఏం సంబంధం? అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులు ప్రజా ప్రతినిధులుగా ఉంటే చాలా నష్టం కలుగుతుంది. డ్రగ్స్ మూలాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. అసలు డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఎవరు తయారు చేస్తున్నారు? ఎవరు సరఫరా చేస్తున్నారు? అని ప్రశ్నలు విసిరారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కామెంట్స్

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పాజిటివ్ రావడంపై శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు.

ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌ను వెంటనే ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం ద్వారా ఆయన తన పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులు ప్రజా ప్రతినిధులుగా ఉండటం సమాజానికి, యువతకు చాలా ప్రమాదకరం అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, పార్టీలు డ్రగ్స్ వ్యాపారం, వాడకంపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇది రాజకీయాల్లోనూ వ్యాపించిందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయంలో సీరియస్‌గా వ్యవహరించి, పుట్టా మహేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, రాజీనామా చేయించాలని సూచించారు.

సమస్య సామాజికం, చర్యలు కఠినం కావాలి

డ్రగ్స్ వాడకం వ్యక్తిగతం మాత్రమే కాదు, సమాజానికి, రాజకీయాలకు ముప్పు. ప్రజా ప్రతినిధుల కుటుంబాల్లోనూ అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు డీ-అడిక్షన్ సెంటర్లను మరింత బలోపేతం చేసి, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు నిర్మూలన, యువతలో అవగాహన కార్యక్రమాలు తీవ్రం చేయాలి. ఇప్పటికి వెలుగులోకి వచ్చిన కేసులు మాత్రమే ఉన్నాయి. మరిన్ని దాచిన సంఘటనలు ఉండవచ్చు. పోలీసు నిఘా, కుటుంబాల బాధ్యతలు పెంచి ఈ చీకటి వ్యాపారాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం, సమాజం మీద ఉంది.

Read More
Next Story