'గూండాగిరి చేస్తే ఊరుకోం'
దేశ్‌ముఖ్ హత్యపై స్పందించిన ఫడ్నవీస్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వార్నింగ్ ఇచ్చారు. గూండాగిరిని సహించేది లేదని హెచ్చరించారు. బీడ్‌లో సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్యపై ఆయన స్పందించారు. దేశ్‌ముఖ్ హత్య కేసులో ఎవరినీ వదిలిపెట్టమని తేల్చి చెప్పారు. ఇప్పటికే దేశ్‌ముఖ్ సోదరుడితో తాను ఫోన్లో మాట్లాడానని, ఈ కేసులో న్యాయం జరుగుతుందని కుటుంబసభ్యులకు హామీ ఇచ్చానని విలేఖరులతో అన్నారు.
"నేను సంతోష్ దేశ్‌ముఖ్ సోదరుడితో మాట్లాడాను. కేసుతో ప్రమేయం ఉన్న వ్యక్తులందరూ ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కొంటారు. ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) కేసు దర్యాప్తు చేస్తుంది. గూండాగిరి చేస్తే సహించం. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే ఉపేక్షించం. అలాంటి వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు.’’ అని హెచ్చరించారు.
కొందరు వ్యక్తులు బీడ్ జిల్లాలోని విండ్‌మిల్ కంపెనీ నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. దాన్ని వ్యతిరేకించిన మసాజోగ్ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ డిసెంబర్ 9న వారు కిడ్నాప్ చేసి హత్య చేశారు.
మంత్రి సన్నిహితుడు సరెండర్..
అంతకుముందు రోజు మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే సన్నిహితుడు వాల్మిక్ కరాద్ సర్పంచ్ హత్యతో ముడిపడి ఉన్న దోపిడీ కేసులో పూణే పోలీసుల ముందు లొంగిపోయాడు. హత్య కేసులో నలుగురిని గతంలో అరెస్టు చేయగా.. దోపిడీ కేసులో కరద్‌ను నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఈ కేసులో బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు.