భారతీయ అక్రమ వలసదారుల విమానం..అమెరికా టు అమృత్‌సర్‌..
x

భారతీయ అక్రమ వలసదారుల విమానం..అమెరికా టు అమృత్‌సర్‌..

అమెరికాలో భారతీయ అక్రమవలసదారుల సంఖ్య సుమారు 7.25 లక్షలు. వీరిలో 18 వేల మందిని గుర్తించిన అగ్రరాజ్యం.. ఇండియాకు తొలివిడతలో 205 మంది.


డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) ఎన్నికల ప్రచారంలో అమెరికన్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. అక్రమ వలసదారులను (Illegal Indian immigrants) దేశం నుంచి పంపిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రెండోసారి అధికారంలోకి రాగానే ఆ వాగ్ధానాన్ని అమల్లోకి తెచ్చారు.

7.25 లక్షల మంది భారతీయులు సరైన పత్రాలు లేకుండా ఉంటున్నట్లు సమాచారం. వీరిలో ఇప్పటికి 18 వేల మందిని గుర్తించి జాబితా సిద్ధం చేశారు. మొదటి విడతలో 205 మందితో టెక్సాస్ నుంచి బయలుదేరిన విమానం.. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని శ్రీ గురు రాందాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు మధ్యాహ్నం దిగనుంది. ఈ విమానంలో పంజాబ్‌తో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. అయితే వారి వివరాలు స్పష్టంగా తెలియాల్సి ఉంది.

ఇటు విమానం దిగగానే వలసదారులను రిసీవ్ చేసుకునేందుకు వీలుగా ఎయిర్‌పోర్టులో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. అయితే పంజాబ్ NRI వ్యవహారాల మంత్రి కుల్దీప్ సింగ్ ధలీవాల్ మాత్రం ఈ తరలింపుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు సహకరించిన ఈ వలసదారులకు పర్మనెంట్ రెసిడెన్సీ ఇవ్వాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకపై విదేశాలకు అక్రమ మార్గాల్లో వెళ్లొద్దని సూచించారు. చదువు, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాల్సి వస్తే చట్టబద్ధ మార్గాన్ని ఎన్నుకోవాలని కోరారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శుక్లా ఎక్స్ వేదికగా స్పందించారు. "అమెరికా (America) 7.25 లక్షల మంది భారతీయులను అక్రమ వలసదారులుగా గుర్తించి తిరిగి పంపించనుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్లు ఏమి చేస్తారు?, " అని ప్రశ్నించారు.

"అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం తమ విధానం" అని అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) స్పష్టం చేసింది. అమెరికా నిర్ణయాన్ని భారత విదేశాంగ శాఖ సమర్థించింది. సరైన ప్రతాలు లేకుండా ఉంటున్న వారిని స్వదేశానికి రప్పించేందుకు సహకరిస్తామని ఇప్పటికే ప్రకటించింది.

Read More
Next Story