ఢిల్లీ తరువాతి సీఎం ఎవరు? బీజేపీ అధినాయకత్వం ఎవరి వైపు?
x

ఢిల్లీ తరువాతి సీఎం ఎవరు? బీజేపీ అధినాయకత్వం ఎవరి వైపు?

వీరేంద్ర సచ్‌దేవా, పర్వేశ్ వర్మ, దుష్యంత్ గౌతమ్, స్మృతి ఇరానీ, మీనాక్షీ లేఖి.. సీఎం రేసులో ఉన్న అభ్యర్థులు..


బీజేపీ 27 ఏళ్ల తరువాత ఢిల్లీలో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ విజయ పరంపర ఇలాగే కొనసాగాలంటే బలమైన నాయకత్వం అవసరం. అందుకే ముఖ్యమంత్రి ఎంపికలో కేంద్ర అధిష్టానం ఆచూతుచి వ్యవహరిస్తుంది. కొత్త సీఎం ఎంపిక అంత తేలిక కాదని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఈ హోదాకు ఇప్పటికే చాలా మంది పోటీపడుతున్నారు. పార్టీని విజయతీరాలకు చేర్చిన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా(Virendra Sachdeva) కూడా ఒకరు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ ఓడించిన పర్వేశ్ వర్మ పేరు కూడా వినపడుతోంది.

షాతో పర్వేశ్ భేటీ..

ఆమ్ ఆద్మీ పార్టీపై ఘన విజయం సాధించిన అనంతరం.. నూతన ఢిల్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన వర్మ(Parvesh Verma) కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో వర్మకు టికెట్ నిరాకరించినా.. బీజేపీ ప్రత్యేకంగా ఎంపిక చేసి కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా బరిలోకి దింపింది.

కేంద్రం నాయకత్వానిదే తుది నిర్ణయం..

బీజేపీ అధికార ప్రతినిధి, ఢిల్లీ మాజీ శాసనసభ్యుడు RP సింగ్ మాట్లాడుతూ.. "బీజేపీ స్పష్టమైన విధానంతో ముందుకు సాగుతుంది. ముఖ్యమంత్రి ఎంపిక విషయంతో కేంద్ర నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. త్వరలోనే శాసనసభ సభ్యులతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలను తెలుసుకుంటుంది," అని చెప్పారు.

అదే ఎన్నికల వ్యూహం..

ప్రముఖ లోక్‌సభ నేతలను అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపడం బీజేపీకి కొత్త కాదు. ఇదే వ్యూహాన్ని రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో అమలు చేసినట్టుగానే, ఢిల్లీలో కూడా పర్వేశ్ వర్మ, రమేశ్ బిధూరిలకు లోక్‌సభ టికెట్లు నిరాకరించి అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపారు.

స్మృతి ఇరానీ లేదా మీనాక్షీ లేఖికి అవకాశం?

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా మహిళా నేతను ఎంపిక చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ లెక్కన బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్న కేంద్ర మాజీ మంత్రులు స్మృతి ఇరానీ(Smriti Irani) మీనాక్షీ లేఖి( Meenakshi Lekhi) పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా పార్టీ కోసం మౌనంగా పనిచేస్తూ, వీరు ఎన్నికలకు ముందు అనేక సమావేశాలను నిర్వహించారు.

ఒక బీజేపీ నాయకుడు మాట్లాడుతూ.. "స్మృతి ఇరానీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆమె ఢిల్లీలో నివసించి, చదువుకుని, పని చేసిన వ్యక్తి. ఒక మహిళా నేత, మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. జాతీయ స్థాయిలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఇక మీనాక్షీ లేఖి కూడా జాతీయ నాయకత్వంతో కలిసి పనిచేసింది," అని పేర్కొన్నారు.

దుష్యంత్ గౌతమ్ కూడా..

సీఎం రేసులో ఉన్న మరో వ్యక్తి దుష్యంత్ గౌతమ్(Dushyant Gautam). షెడ్యూల్డ్ కులానికి చెందిన గౌతమ్.. కరోల్ బాగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆప్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. "గెలవకపోయినా.. బీజేపీ నేతృత్వం ఆయనకు అవకాశం ఇచ్చే అవకాశముంది. ఢిల్లీలో ఆయనకు మంచి అనుభవం ఉంది," అని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.

సమర్థ నాయకత్వం కోసం..

బీజేపీ చాలా ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. పార్టీకి బలమైన నాయకత్వం అవసరమని విశ్లేషకులు చెబుతున్నారు. "కేజ్రీవాల్, శీలా దీక్షిత్ వంటి కీలక ముఖ్యమంత్రులు ఢిల్లీని శాసించారు. గతంలో బీజేపీ నుంచి మదన్ లాల్ ఖురానా, సహిబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్ వంటి శక్తివంతమైన నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా సమర్థుడైన నాయకుడిని ఎంపిక చేయాల్సి ఉంటుంది," అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

తుది నిర్ణయం పార్లమెంటరీ బోర్డు తీసుకుంటుంది. ఢిల్లీ శాసనసభా పక్ష సమావేశం తరువాత ముఖ్యమంత్రి పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రధాన మోదీకి ఎప్పుడూ ఊహించని నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా పేరుంది. మరీ ఆయన ఎవరి పేరును ప్రతిపాదిస్తారో చూడాలి మరి.

Read More
Next Story