Delhi Polls Update: మధ్యాహ్నం 3 గంటల వరకు 46.5 శాతం పోలింగ్..
మధ్యాహ్నం 1 గంట వరకు 33% గా నమోదయిన పోలింగ్.. 3 గంటల సమయానికి 46.5 శాతానికి పెరిగింది.
ఢిల్లీ(Delhi)లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే..మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ శాతం 33 కాగా.. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 46.5 శాతంగా నమోదయ్యింది. ఇక ఉదయం 9 గంటల వరకు ఓటింగ్ శాతం 8.10 కాగా.. 11 గంటల సమయానికి 19.95 శాతంగా నమోదయ్యింది.
జంగ్‌పురాలో ఉద్రిక్తత..
ఉదయం ఢిల్లీలోని జంగ్‌పురా అసెంబ్లీ నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.బీజేపీ కార్యకర్తలు ఓటర్లను ఒక భవనానికి తీసుకెళ్లి డబ్బులు పంపిణీ చేస్తున్నారని AAP నేత మనీష్ సిసోడియా (Manish Sisodia) ఆరోపించారు. దీంతో AAP, BJP కార్యకర్తల మధ్య మాటల యుద్ధం.. తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. అయితే డబ్బు పంపిణీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
డబ్బు, మద్యం స్వాధీనం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రెండు రోజులు ముందే పోలీసులు గత ఎన్నికల కంటే రెట్టింపు డబ్బు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈసారి 10.67 కోట్లు నగదు పట్టుబడగా, గత ఎన్నికల్లో 4.5 కోట్లే స్వాధీనం చేసుకున్నారు. మద్యం స్వాధీనం 1.3 లక్షల లీటర్లకు చేరుకోగా, గత ఎన్నికల్లో ఇది 69,000 లీటర్లుగా ఉంది. కోడ్ ఉల్లంఘన కింద 406 కేసులు (FIRs) నమోదుకాగా.. గత ఎన్నికల్లో 314 కేసులే నమోదయ్యాయి.
8న ఓట్ల లెక్కింపు..
70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 699 మంది అభ్యర్థుల భవితవ్యం ఓట్ల లెక్కింపు రోజున (ఫిబ్రవరి 8న) తేలిపోనుంది. కాగా 1.56 కోట్ల మంది ఓటర్ల కోసం ఎలక్షన్ కమిషన్ మొత్తం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు 220 పారామిలిటరీ బలగాలు, 35,626 ఢిల్లీ పోలీసులు, 19,000 హోంగార్డులను పోలింగ్ డ్యూటీలో ఉంటారు. 3 వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో డ్రోన్ల ద్వారా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.