భద్రతా వలయంలో ఢిల్లీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం 30వేల మంది పోలీసులను, 220 పారామిలిటరీ (Paramilitary) బృందాలను మోహరించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రేపు(ఫిబ్రవరి 5) జరగనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 30వేల మందికి పైగా పోలీసులను, 220 పారామిలిటరీ బృందాలను రంగంలోకి దింపారు. స్పెషల్ పోలీసు కమిషనర్లు మధుప్ తివారి (జోన్-II) రవీంద్ర యాదవ్ (జోన్-I) బందోబస్తు ఏర్పాట్లను వివరించారు.
"ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. దాదాపు 3వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక భద్రతా బలగాలను ఉంచడంతో పాటు ఆ పరిసరాలను డ్రోన్లతో నిఘా ఉంచుతాం," అని సీపీ రవీంద్ర యాదవ్ చెప్పారు.
ఢిల్లీ పోలీసు విభాగం వివిధ రాష్ట్రాల నిఘా సంస్థలతో జనవరిలో అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశాన్ని నిర్వహించింది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, బీహార్, రాజస్థాన్, చండీగఢ్, జమ్ముకాశ్మీర్ నుంచి ఉన్నతస్థాయి పోలీసు అధికారులు హాజరయ్యారు.
తగ్గిన క్రైం రేటు..
గతంతో పోలిస్తే ప్రస్తుతం క్రైం రేటు తగ్గింది. ఢిల్లీలో 2025 జనవరితో పోలిస్తే 2023, 2024లో నేరాల సంఖ్య ఎక్కువగా ఉంది. 2025 జనవరిలో హత్యాయత్నం కేసులు 50 నమోదు కాగా, 2024లో 71, 2023లో 59 కేసులు నమోదయ్యాయి. దొంగతనాలు 2025లో 103కి తగ్గాయి. 2024లో 146, 2023లో నమోదయిన కేసులు 111. ఇక చిన్నపాటి దొంగతనాలు 2025లో 369కి తగ్గాయి. 2024లో 623, 2023లో 558గా నమోదయ్యాయి. 2025 జనవరిలో లైంగిక వేధింపుల కేసులు 110గా ఉండగా.. 2024లో 135, 2023లో 163గా రిజిస్టర్ అయ్యాయి. కిడ్నాపింగ్ కేసులు 2025లో 9కి తగ్గగా, 2024, 2023లో 18 నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాలు 2025లో 87కాగా, 2024లో 93, 2023లో 94," అని యాదవ్ వివరించారు.
1,049 కోడ్ ఉల్లంఘన కేసులు..
ఎన్నికల కోడ్ (MCC) ఉల్లంఘించిన సుమారు వెయ్యి మందిపై కేసులు నమోదయ్యాయని ప్రత్యేక సీపీ మధుప్ తివారి తెలిపారు. "జనవరి 7 నుంచి ఫిబ్రవరి 2 వరకు మొత్తం 1,049 కేసులు నమోదయ్యాయి. వివిధ చట్టాల కింద మొత్తం 33,434 మందిని అరెస్టు చేశాం. సరిహద్దుల్లో నిఘా పెంచి, అక్రమ కార్యకలాపాల నివారణకు కఠిన చర్యలు తీసుకున్నాం. 462 అక్రమ తుపాకులు, 510 కార్ట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నాం. ఆయుధ చట్టం ప్రకారం 482 మందిని అరెస్ట్ చేశాం. అదనంగా 1,08,258 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకుని 1,353 మందిని అరెస్ట్ చేశాం. రూ. 77.9 కోట్ల విలువచేసే 196.602 కిలోల మాదక ద్రవ్యాలను పట్టుకున్నాం," అని తివారి వివరించారు.