అధికారిక నివాసానికి ఢిల్లీ సీఎం అతిశీ..
x

అధికారిక నివాసానికి ఢిల్లీ సీఎం అతిశీ..

ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ అధికారిక నివాసానికి మారారు. ఉత్తర ఢిల్లీ సివిల్ లైన్స్‌లోని ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని 6వ నంబర్ బంగ్లాలో అడుగుపెట్టారు.


ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ అధికారిక నివాసానికి మారారు. ఉత్తర ఢిల్లీ సివిల్ లైన్స్‌లోని ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని 6వ నంబర్ బంగ్లాలో అడుగుపెట్టారు. అంతకుముందు ఇదే బంగ్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఉండేవారు. ఆయన ముఖ్యమంత్రి పదవిని రాజీనామా చేసి మండి హౌస్ సమీపాన ఫిరోజ్‌షా రోడ్‌లోని ఆప్ సభ్యుడు అశోక్ మిట్టల్ ఇంటికి వెళ్లిపోవడంతో బంగ్లా అప్పటి నుంచి ఖాళీగా ఉంది. పంజాబ్ నుంచి ఎంపికయిన ఆప్ రాజ్యసభ ఎంపీ మిట్టల్‌కు ప్రభుత్వం సెంట్రల్ ఢిల్లీలో బంగ్లా కేటాయించిన విషయం తెలిసిందే.

సీఎం అతిశీ బంగ్లాకు చేరుకున్న కొన్ని గంటల తర్వాత, ఆ బంగ్లా పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్‌ అతిశీకి ఇంకా కేటాయించలేదని బీజేపీ పేర్కొంది. కేజ్రీవాల్ బంగ్లాను ఇంకా ఖాళీ చేయలేదని, ఆయన వస్తువులు చాలా వరకు ఇప్పటికీ 'షీష్ మహల్'లో ఉన్నాయని ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు విజేందర్ గుప్తా ఆరోపించారు. కేజ్రీవాల్ ఉన్న ఇంటికి BJP 'షీష్ మహల్'గా పేరుపెట్టింది. ఢిల్లీ మద్యం కుంభకోణంతో వచ్చిన అవినీతి సొమ్మును ఖరీదైన ఇంటీరియర్స్ డెకరేషన్‌కు ఖర్చుచేశారని బీజేపీ వాదన.

అయితే మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బంగ్లాకు సంబంధించిన వాటర్, ఎలక్రిసిటీ, టెలిఫోన్ బిల్లులను చెల్లించారని, కేజ్రీవాల్ ఇంటిని ఖాళీ చేసినప్పుడు పీడబ్ల్యూడీ జూనియర్ ఇంజనీర్ బంగ్లాను తనిఖీ చేసి వెకేషన్ రిపోర్టు కూడా ఇచ్చారని ఆప్ కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాతే బంగ్లా తాళాలు ప్రస్తుత ముఖ్యమంత్రి అతిశీకి పీడబ్ల్యూడీ అందజేసినట్లు ఆప్ తెలిపింది.

గత ఏడాది కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అతిశీకి గతంలో మధుర రోడ్డులోని ఏబీ-17 బంగ్లా కేటాయించారు. అంతకుముందు ఆమె తన తల్లిదండ్రులతో దక్షిణ ఢిల్లీలోని కల్కాజీలో ఉండేవారు.

Read More
Next Story