ఢిల్లీ చలో | మళ్లీ నిలిచిపోయిన రైతుల పాదయాత్ర
x

ఢిల్లీ చలో | మళ్లీ నిలిచిపోయిన రైతుల పాదయాత్ర

కనీస మద్దతు ధర (MSP)కి చట్టపరమైన హామీతో సహా వివిధ డిమాండ్ల కోసం ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు శంభు సరిహద్దు నుంచి ఢిల్లీకి పాదయాత్రను పునఃప్రారంభించింది.


కనీస మద్దతు ధర (MSP)కి చట్టపరమైన హామీతో సహా వివిధ డిమాండ్ల కోసం కేంద్రాన్ని ఒత్తిడి చేసేందుకు 101 మంది రైతుల బృందం ఆదివారం (డిసెంబర్ 8) మధ్యాహ్నం 12 గంటలకు శంభు సరిహద్దు నుంచి ఢిల్లీకి పాదయాత్రను పునఃప్రారంభించారు. అయితే కొన్ని మీటర్ల దూరం నడిచిన వారిని హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. మార్చ్‌కు అనుమతి ఉందో లేదో చూపించాలని..అలాగే మార్చ్‌లో భాగమైన 101 మంది రైతులను చూపాలని పోలీసులు రైతు సంఘాలను కోరడం.. పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదానికి దారితీసింది. అనంతరం ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.

ఆ రైతులను చూపండి.. అనుమతిస్తాం..

“మొదట ఆ 101 మంది రైతులెవరో చూపమనండి. వాళ్లను ముందుకు వెళ్ళడానికి అనుమతిస్తాం. వాళ్లను చూపకుండానే గుంపుగా ముందుకు సాగుతున్నారు.” అని హర్యానా పోలీసు అధికారి ఒకరు వార్తా సంస్థ ANI కి తెలిపారు.

కాగా ‘‘మేము ఇప్పటికే మార్చ్‌లో పాల్గొనే రైతుల జాబితాను రిలీజ్ చేశాం. వారు (పోలీసులు) మమ్మల్ని అనుమతించడానికి ముందు ఐడీలను నిర్ణయించుకుంటే.. మేము దానికి సహకరిస్తాం. గాలి దిక్కు మా వైపు ఉండడంతో టియర్ గ్యాస్ ఎక్కువగా వాడుతున్నారు. ఎలాంటి త్యాగానికైనా మేం సిద్ధంగా ఉన్నాం.. మా సమస్యలకు పరిష్కారం ప్రధాని వద్ద ఉంది.’’ అని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పాండర్ అన్నారు.

ఫిబ్రవరిలోనూ మార్చ్..

రైతులు ఫిబ్రవరి 13 నుంచి 21 తేదీల మధ్య ఢిల్లీ వైపు మార్చ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే సరిహద్దు పాయింట్ల వద్ద భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయి.

రైతుల డిమాండ్లేమిటి?

MSPతో పాటు, వ్యవసాయ రుణమాఫీ, రైతులు, రైతు కూలీలకు పింఛన్, విద్యుత్ ఛార్జీల పెంపుదల, రైతులపై పోలీసు కేసుల ఉపసంహరణ, 2021 లఖింపూర్ ఖేరీ హింసాకాండ బాధితులకు న్యాయం, 2013 భూసేకరణ చట్టం పునరుద్ధరణ, గతంలో (2020-21) జరిగిన ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Read More
Next Story