ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు డేట్ ఫిక్స్..
ఫిబ్రవరి 5న పోలింగ్, 8న కౌంటింగ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు తేదీ ఖరారైంది. ఎన్నికల కమిషన్ (ఈసీ) మంగళవారం (జనవరి 7) మధ్యాహ్నం 2 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించింది. ఫిబ్రవరి 5న పోలింగ్, 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొంది. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీ పదవీ కాలం ఫిబ్రవరి 23న ముగుస్తుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సాధారణంగా ఒక్క దశలోనే జరుగుతాయి.
ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పార్టీలు..
ప్రముఖంగా ఆప్(AAP), బీజేపీ(BJP), కాంగ్రెస్ (Congress) పార్టీల మధ్య ప్రధాన పోరు ఉండబోతుంది. విడతల వారీగా తమ అభ్యర్థులను ప్రకటించారు. ప్రముఖ అభ్యర్థులను పరిశీలిస్తే..న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పోటీచేస్తున్నారు. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ తరుఫున ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ (Sandeep Dikshit) బరిలోకి దిగుతున్నారు. ఇక బీజేపీ నుంచి మాజీ ఎంపీ పర్వేష్ వర్మను పోటీ చేస్తున్నారు. ఇక ఢిల్లీ సీఎం అతిశీ (Atishi) కల్కాజీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఈమెకు పోటీగా బీజేపీ నుంచి మాజీ ఎంపీ రమేష్ బిధూరి, కాంగ్రెస్ నుంచి ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లంబా (Alka Lamba) బరిలో నిలిచారు.