Delhi Polls Update: 11 గంటల వరకు 19.95 శాతం పోలింగ్..
ఢిల్లీలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు పోలింగ్ శాతం 8.10 కాగా..11 గంటల వరకు పోలింగ్ శాతం 19.95గా నమోదయ్యింది.
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి ఎస్. జైశంకర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, లెఫ్టినెంట్ గవర్నర్ వీ.కే. సక్సేనా, ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్, AAP నేత మనీష్ సిసోడియా, ఢిల్లీ భాజపా అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా, రాష్ట్ర ఎన్నికల అధికారి ఆలీస్ వాజ్ సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో ఉన్నారు. 9 గంటల వరకు ఓటింగ్ శాతం 8.10 కాగా.. 11 గంటల సమయానికి 19.95శాతంగా నమోదయ్యింది.
699 మంది అభ్యర్థులు.. 13,766 పోలింగ్ కేంద్రాలు..
ఎలక్షన్ కమిషన్ మొత్తం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 699 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు 220 పారామిలిటరీ బలగాలు, 35,626 ఢిల్లీ పోలీసులు, 19,000 హోంగార్డులను పోలింగ్ డ్యూటీలో ఉంటారు. 3 వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో డ్రోన్ల ద్వారా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తుండగా, బీజేపీ (BJP), కాంగ్రెస్ తిరిగి పుంజుకోవాలని చూస్తున్నాయి. బీజేపీ 25 ఏళ్ల తర్వాత తిరిగి ఢిల్లీలో అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అలాగే కాంగ్రెస్ (Congress) 2013 తర్వాత పూర్తిగా చతికిలపడిపోయింది.
ఇక ఫలితాలు ఫిబ్రవరి 8న వెల్లడించనున్నారు.
ఏరోడ్, మిల్కీపూర్ ఉపఎన్నికలు..
తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లో ఒక్కో నియోజకవర్గానికి ఈ రోజు పోలింగ్ జరుగుతుంది.
తమిళనాడు ఏరోడ్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి బుధవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. 237 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 46 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధానంగా ద్రవిడ మున్నేట్ర కజగం (DMK), నటుడు-రాజకీయ నేత సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కచ్చి (NTK) మధ్య పోటీ నెలకొంది.
ఇక ఉత్తర ప్రదేశ్‌లోని మిల్కీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికకు కూడా ఓటింగ్ ప్రారంభమైంది. షెడ్యూల్డ్ కాస్ట్ (SC) నియోజకవర్గంలో 3,70,829 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధాన పోటీ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అజిత్ ప్రసాద్, బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాస్వాన్ మధ్య ఉండే అవకాశముంది.