ఛత్తీస్‌గఢ్‌  రైలు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య..
x

ఛత్తీస్‌గఢ్‌ రైలు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య..

మొత్తం మృతులు 11 మంది. గాయపడ్డ మరో 20 మంది. మృతుల్లో ఆరుగురిని ఇంకా గుర్తించాల్సి ఉందని రైల్లే అధికారులు..


Click the Play button to hear this message in audio format

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) లోని బిలాస్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును ఢీకొట్టిన (Train collision) ప్రమాదంలో మృతుల సంఖ్య 11కి పెరిగిందని అధికారులు బుధవారం (నవంబర్ 5) తెలిపారు.ప్యాసింజర్ బోగీల్లో చిక్కుకుపోయిన మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది అతికష్టం మీద బయటకు తీస్తున్నారు.

మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో MEMU (మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) ప్యాసింజర్ రైలు.. గెవ్రా నుంచి బిలాస్‌పూర్‌కు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. కాగా దెబ్బతిన్న లైన్‌ను బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకల్లా పునరుద్ధరించామని రైల్వే అధికారులు తెలిపారు.


మృతుల్లో ఆరుగురు మహిళలు..

"ప్రమాదంలో ఆరుగురు మహిళలు సహా పదకొండు మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది గాయపడ్డారు" అని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఘటన జరిగిన వెంటనే రైల్వే యంత్రాంగం సహాయ చర్యలు ప్రారంభించింది. క్షతగాత్రులను బిలాస్‌పూర్‌లోని అపోలో ఆసుపత్రి, ఛత్తీస్‌గఢ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (CIMS) కు తరలించారు.


‘ఆరుగురికి గుర్తించాల్సి ఉంది.’

మరణించిన 11 మందిలో ఐదుగురి ఇప్పటికే గుర్తించారు. మృతులను ప్యాసింజర్ రైలు పైలట్ విద్యా సాగర్ (53), లవ్‌కుష్ శుక్లా (41), రంజీత్ ప్రభాకర్ (40), శిలా యాదవ్ (25), ప్రియా చంద్ర (21) గా గుర్తించారు. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులను ఇంకా గుర్తించాల్సి ఉంది.

గాయపడ్డ 20 మందిలో తొమ్మిది మంది మహిళలు, రెండేళ్ల బాలుడు ఉన్నారు. ప్యాసింజర్ రైలు అసిస్టెంట్ లోకో పైలట్ రష్మి రాజ్ (34), రైలు మేనేజర్ (గార్డ్) అశోక్ కుమార్ దీక్షిత్ (54), గూడ్స్ రైలు గార్డు శైలేష్ చంద్ర (49) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ. 50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇటు రైల్వే యంత్రాంగం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, వారి కుటుంబసభ్యులను అడిగి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు.


ఘటన ఎలా జరిగిందింటే..

దుర్ఘటన జరిగిన తీరును రైల్వే సీనియర్ అధికారి వివరించారు. "రెడ్ సిగ్నల్ దాటాక 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఆగి ఉన్న గూడ్స్ రైలును వెనుక నుంచి ఢీకొట్టింది. కనిపించేంత దూరంలో గూడ్స్ రైలు ఆగి ఉన్నా..లోకో పైలట్ ఎందుకు అత్యవసర బ్రేక్‌ వేయలేకపోయాడన్న దానిపై దర్యాప్తు జరుగుతోంది. ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును ఎంత బలంగా ఢీకొట్టిందంటే ప్యాసింజర్ ట్రయిన్ మోటారు కోచ్.. గూడ్స్ ట్రయిన్‌ బ్రేక్ వ్యాన్ పైకి ఎక్కింది. గూడ్స్ రైలు మేనేజర్ (గార్డు) చివరి క్షణంలో బ్రేక్ వ్యాన్ నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. ’’ అని చెప్పారు.


మృతుల కుటుంబాలకు పరిహారం..

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. లక్ష చొప్పున పరిహారం అందజేయనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రమాదంపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.

Read More
Next Story