వంతెన కూలిన ఘటనలో 19కి పెరిగిన మృతుల సంఖ్య..
x

వంతెన కూలిన ఘటనలో 19కి పెరిగిన మృతుల సంఖ్య..

ఇప్పటివరకు 18 మృతదేహాలు లభ్యం..ఆసుపత్రిలో ఒకరు మృతి


గుజరాత్‌(Gujarat) రాష్ట్రం వడోదర జిల్లాలో మహిసాగర్ నదిపై నిర్మించిన వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. గాయపడ్డ వారిలో ఒకరు చనిపోవడంతో మృతుల సంఖ్య 19కి చేరింది. ఇంకా ఇద్దరి జాడ తెలియాల్సి ఉంది. వారి కోసం NDRF, SDRF బృందాలు గాలిస్తున్నాయి.

పాద్రా ప్రాంతంలోని మహిసాగర్‌ నదిపై నిర్మించిన గంభీర వంతెన రెండు పిల్లర్ల మధ్య స్లాబ్‌ కూలిపోయింది. వడోదరా-ఆణంద్‌ పట్టణాలను కలిపే ఈ వంతెన 1985లో నిర్మించినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో స్లాబ్ కూలిపోవడంతో వంతెనపై వెళ్తున్న రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు, ఓ ఆటో నదిలో పడిపోయాయి.

‘గాలింపు కొనసాగుతుంది’..

‘‘గురువారం రాత్రి వరకు 18 మృతదేహాలను వెలికితీశాం. మూడో రోజు (జూలై 7) సెర్చ్ ఆపరేషన్ తిరిగి ప్రారంభమైంది. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి,’’ అని వడోదర కలెక్టర్ అనిల్ ధమేలియా తెలిపారు. "SSG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురిలో ఒకరైన దహేవన్ నరేంద్రసింగ్ పర్మార్ (45) శుక్రవారం చనిపోయాడు" అని తెలిపారు.

ఇంజనీర్ల సస్పెన్షన్..

వంతెన కూలిన ఘటనకు సంబంధించి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గురువారం రాష్ట్ర రోడ్లు, భవనాల విభాగానికి చెందిన నలుగురు ఇంజనీర్లను సస్పెండ్ చేశారు. రాష్ట్ర మంత్రి రుషికేష్ పటేల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్ర రోడ్లు, భవనాల విభాగానికి చెందిన ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీ 30 రోజుల్లో నివేదిక సమర్పిస్తుందని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

గతంలో కూలిపోయిన వంతెనలు..

2021 నుంచి గుజరాత్‌లో ఆరు భారీ వంతెనలు కూలిపోయాయి. డిసెంబర్ 2021లో అహ్మదాబాద్ నగర శివార్లలో ముమత్పురా ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలో కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అక్టోబర్ 2022లో మోర్బి పట్టణంలోని మచ్చు నదిపై బ్రిటిష్ కాలం నాటి వంతెన కూలిపోవడంతో 135 మంది మరణించారు. ఆ సమయంలో వంతెనపై 200 మందికి పైగా పర్యాటకులు ఉన్నారు. జూన్ 2023లో తాపి జిల్లాలోని మింధోలా నదిపై కొత్తగా నిర్మించిన వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. సెప్టెంబర్ 2023లో సురేంద్రనగర్ జిల్లాలోని భోగావో నదిపై ఉన్న పాత వంతెనలోని ఒక భాగం వాధ్వన్ నగరానికి సమీపంలో 40 టన్నుల బరువున్న డంపర్ ప్రయాణిస్తున్నప్పుడు కూలిపోవడంతో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. అక్టోబర్ 2023లో బనస్కాంతలోని పాలన్‌పూర్ పట్టణంలోని RTO సర్కిల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్‌లపై ఏర్పాటు చేసిన ఆరు కాంక్రీట్ గిర్డర్‌లు లేదా స్లాబ్‌లు కూలిపోవడంతో ఆటోరిక్షాలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఆగస్టు 2024లో సురేంద్రనగర్ జిల్లాలోని చోటిలా పట్టణంతో హబియాసర్ గ్రామాన్ని కలిపే భోగావో నదిపై ఉన్న ఒక చిన్న వంతెన, పొంగిపొర్లుతున్న ఆనకట్ట నుండి నీటిని విడుదల చేసిన తర్వాత అకస్మాత్తుగా నీటి మట్టం పెరగడంతో కూలిపోయింది. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

Read More
Next Story