CWC | నేడు ‘నవ సత్యాగ్రహ భైఠక్’ .. రేపు ‘జై భీమ్ సంవిధాన్ ర్యాలీ’
AICC అధ్యక్షులుగా మహాత్మాగాంధీ బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా.. కర్ణాటకలోని బెళగావిలో కాంగ్రెస్ ప్రత్యేక సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహిస్తోంది.
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షులుగా మహాత్మాగాంధీ బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా..డిసెంబర్ 26, 27 తేదీల్లో ప్రత్యేక సీడబ్ల్యూసీ (CWC) సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. గాంధీజీ బెలగావిలోనే బాధ్యతలు చేపట్టడంతో ఇక్కడే సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించి..సమావేశాలకు "నవ సత్యాగ్రహ భైఠక్" అని నామకరణం చేశారు. రెండు రోజుల పాటు జరిగే సమావేశాలకు సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు, సీఎంలు, మాజీ సీఎంలు సహా కీలక నేతలు హాజరుకానున్నారు.
ఈ రోజు నవ సత్యాగ్రహ బైఠక్'..
డిసెంబరు 26న మధ్యాహ్నం 2.30 గంటలకు మహాత్మాగాంధీ నగర్‌లో 'నవ సత్యాగ్రహ బైఠక్' ప్రారంభమవుతుంది. సమావేశంలో రాబోయే సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళికను వివరిస్తారు. మహాత్మాగాంధీ నగర్‌లో నిర్వహించే ర్యాలీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు, ఏఐసీసీ కార్యకర్తలు, లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొననున్నారు.
రేపు సంవిధాన్ ర్యాలీ..
27వ తేదీ ఉదయం 11.30 గంటలకు బెలగావిలో 'జై బాపు, జై భీమ్, జై సంవిధాన్' ర్యాలీ నిర్వహించనున్నట్లు జైరాం రమేష్ తెలిపారు. CWC సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, రాష్ట్ర CLP నాయకులు, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు, పార్టీ మాజీ ముఖ్యమంత్రులు సహా దాదాపు 200 మంది నాయకులు ఈ "చారిత్రక సమావేశానికి" హాజరుకానున్నారు.
సమావేశంలో ఏం చర్చించబోతున్నారు?
ఈ సమావేశాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా గురించి కూడా చర్చించనున్నారు. దీంతో పాటు ఆర్థిక అసమానతలు ఏర్పడటం, ప్రజాస్వామ్యం ఖూనీ, రాజ్యాంగ సంస్థలపై దాడి, బీజేపీ పాలనలో దేశం క్లిష్టమైన సవాళ్లు ఎదుర్కోవడం లాంటి అంశాలపై చర్చిస్తారు. 1924లో బెలగావిలో తన తొలి ప్రసంగంలో మహాత్మాగాంధీ అహింస, సహాయ నిరాకరణ, అంటరానితనం నిర్మూలన, సామాజిక–ఆర్ధిక సమతుల్యత, సామాజిక న్యాయం లాంటి అంశాలపై మాట్లాడారు.
షా వ్యాఖ్యలపై దుమారం..
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా కేంద్ర మంత్రి అమిత్‌షా డిసెంబర్ 18న రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంబేద్కర్ పేరును జపం చేయడం కాంగ్రెస్‌కు ఒక ఫ్యాషన్‌గా మారిందని..ఆ జపం ఏదో దేవుడ్ని తలుచుకుంటే స్వర్గమన్నా వచ్చేదంటూ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంబేద్కర్‌ను అమమానించినందుకు అమిత్‌షా క్షమాపణ చెప్పాలని, తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పార్లమెంటు వెలుపల వినూత్న రీతిలో రోజువారీ నిరసనలకు దిగింది. ఈ క్రమంలోనే పార్లమెంటు ఆవరణలో ఎంపీల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్‌పుత్‌లు గాయపడ్డారు. పార్లమెంటుకు వెళ్తుండగా తనను కూడా గెంటినట్టు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఇరువర్గాలు పార్లమెంటు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నాయి.
Mahatma Gandhi took over as President of @INCIndia on Dec 26th, 1924 - a 100 years ago at what was then called Belgaum, now Belgavi. It was a historic session.
— Jairam Ramesh (@Jairam_Ramesh) December 26, 2024
Today the Extended Working Committee is holding its Nava Satyagraha Baithak at that very same place. It will rededicate… pic.twitter.com/o0G4K2Aquw
Jay Bapu 🇮🇳 Jay Bhim 🇮🇳 Jay Samvidhan pic.twitter.com/09OvWK2mkM
— Congress (@INCIndia) December 25, 2024