Sanatana Dharma | కేరళ సీఎం విజయన్ సంఘ్ పరివార్‌కు మద్దతిస్తుస్తారా?
సనాతన ధర్మానికి మతపర దృక్కోణం లేదని, సీఎం విజయన్ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని కాంగ్రెస్ నేత సతీశన్ అభిప్రాయపడ్డారు.
సనాతన ధర్మంపై కేరళ (Kerala) ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్(Congress) నేత వీడీ సతీశన్ (VD Satheesan) తప్పుబట్టారు. సనాతన ధర్మాన్ని సంఘ్ పరివార్‌కి మాత్రమే పరిమితం చేయడానికి చేసిన ప్రయత్నంగా ఉందన్నారు. సనాతన ధర్మం (Sanatana Dharma) ఒక సాంస్కృతిక వారసత్వమని, అద్వైతం, వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని కలిగిన ధర్మాన్ని సంఘ్ పరివార్‌కు చెందినదని చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనన్నారు.
శివగిరి యాత్రలో భాగంగా మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్యమంత్రి విజయన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ..సనాతన ధర్మం అనేది వర్ణాశ్రమ ధర్మం (వర్ణ ఆధారిత సామాజిక వ్యవస్థ) తప్ప మరేమీ కాదని, దీనిని నారాయణ గురువు అధిగమించారని చెప్పారు.
సతీశన్ కౌంటర్..
సీఎం వ్యాఖ్యలకు సతీశన్ స్పందిస్తూ..‘‘దేవాలయానికి వెళ్లేవారంతా, చందనం రాసుకునేవారందరూ, కాషాయ వస్త్రాలు ధరించే వాళ్లంతా ఆర్‌ఎస్‌ఎస్‌లో భాగమని చెప్పడం సరికాదు,’’ అని సతీశన్ అన్నారు. సనాతన ధర్మం, దాని వారసత్వాన్ని సంఘ్ పరివార్‌కు అప్పగించడం సరికాదని, ముఖ్యమంత్రి చెప్పింది తప్పని పేర్కొన్నారు. ఇతర మతాల్లోలాగా.. హిందూ మతంలో కూడా పురోహితత్వం, రాజరికం, పాలన వ్యవస్థలు దుర్వినియోగమయ్యాయని అన్నారు. వర్ణాశ్రమ లేదా చతుర్వర్ణ వ్యవస్థకు మద్దతు ఇవ్వమని స్పష్టం చేశారు. శ్రీ నారాయణ గురువు సనాతన ధర్మ సారాన్ని స్పష్టంగా వివరించారని, సనాతన ధర్మాన్ని పూర్తిగా నిరాకరించడం లేదా అది సంఘ్ పరివార్‌కు మాత్రమే చెందుతుందని చెప్పడం సరికాదన్నారు.
శివగిరి యాత్రలో పాల్గొన్న కేపీసీసీ అధినేత కే సుధాకరణ్ కూడా ముఖ్యమంత్రి విజయన్ వ్యాఖ్యలను సమర్థించారు. ఒక జాతి, ఒక మతం, ఒక దేవుడు అని ప్రకటించిన విశ్వమానవతావాది శ్రీ నారాయణ గురువును వర్ణాశ్రమ వ్యవస్థల చట్రంలో బంధించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.