శశి థరూర్‌ పార్టీ మారుతున్నారా?
x

శశి థరూర్‌ పార్టీ మారుతున్నారా?

సీపీఐ(ఎం)లో చేరుతారా? పార్టీ వర్గాలేమంటున్నాయి.


Click the Play button to hear this message in audio format

కాంగ్రెస్(Congress) ఎంపీ శశిథరూర్(Shashi Tharoor) పార్టీ మారతారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఆయన సీపీఐ(ఎం)లో చేరుతున్నారని సోషల్ మీడియాలోనూ కొన్ని పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. అయితే ఈ వార్తలను పార్టీ సీనియర్లు ఖండిస్తున్నారు. అవన్నీ పుకార్లేనని కొట్టిపడేస్తున్నారు.

"అవన్నీ నిరాధారం. మాకున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం శశి థరూర్ అంత సాహసం చేయరు. CPI(M)) ఆయనను సంప్రదిస్తున్నట్లు నాకు తెలీదు. నేను ఇప్పుడే టీవీ ఛానెళ్లలో చూశాను. కాంగ్రెస్‌ పార్టీ ఆయనను బీజేపీ(BJP) తొత్తుగా చిత్రీకరిస్తున్నప్పుడు సీపీఎం ఆయనను ఎలా సంప్రదిస్తుంది?" అని కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఒకరు ది ఫెడరల్‌తో అన్నారు.

శశిథరూర్ సీపీఐ(ఎం)లో చేరేందుకు దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సమాచారం. ఆయన సీపీఐ(ఎం)తో చర్చించినట్లు సోషల్ మీడియా ప్రచారం జరుగుతోంది. అయితే ఎక్కడా కూడా ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు.


‘దుబాయ్‌కి వెళ్లడంతోనే..’

కేరళ ఎన్నికలకు సంబంధించి ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్‌ ఏర్పాటు చేసిన సమావేశానికి థరూర్ గైర్హాజరయిన విషయం తెలిసిందే. ఆయన కేరళ లిటరేచర్ ఫెస్టివల్ (కెఎల్‌ఎఫ్)కు హాజరయ్యారు. ఆ తర్వాత దుబాయ్‌కు వెళ్లి పోయారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మార్పుపై ఊహాగానాలు బయటకు వచ్చాయి. మంగళవారం జరగనున్న రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశానికి కూడా ఆయన హాజరు కాకపోవచ్చు.


మీడియా పుకార్లను ఖండించిన థరూర్..

గత నాలుగు రోజులుగా KLFలో చురుగ్గా పాల్గొన్న థరూర్.. పార్టీ ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉంటానని చెప్పారు. "KLFకు ముందుగా అనుకున్నట్లు హాజరుకావాల్సి ఉండడంతో హైకమాండ్ సమావేశానికి హాజరు కాలేకపోయాయని వివరణ ఇచ్చుకున్నారు. ఈ విషయాన్ని కూడా పార్టీ నాయకత్వానికి ముందుగానే తెలియజేసానని చెప్పారు. నేను ఏం చెప్పాలనుకున్నా నేరుగా అధిష్టానంతోనే మాట్లాడతానని, నేను మీడియా ముందు నా అభిప్రాయాలను వ్యక్తం చేయను" అని థరూర్ ఇప్పటికే చెప్పారు.


‘అంతర్గతంగా పరిష్కారమవుతాయి.’

‘‘ఊహాగానాలకు హద్దు లేదు. అంతర్గతంగా ఏవైనా సమస్యలుంటే పరిష్కారమవుతాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. "రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా శశి థరూర్‌కు ఫోన్ చేస్తారు. విషయాలు సామరస్యంగా పరిష్కారమవుతాయి. పార్టీ ఫిరాయింపు ప్రశ్నే లేదు" అని కాంగ్రెస్ సీనియర్ నాయకత్వంలోని ఒక వర్గం ది ఫెడరల్‌తో అంది.


రాహుల్‌తో థరూర్‌కు విభేదాలున్నాయా?

కేరళలో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ వ్యూహాలు, పొత్తులపై చర్చించేందుకు నిన్న (జనవరి 23)న పార్టీ ఢిల్లీలో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి థరూర్ హాజరుకాలేదు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పట్ల ఉన్న అసంతృప్తి కారణంగానే ఆయన సమావేశానికి హాజరుకాలేదని వార్తలొచ్చాయి. కొచ్చిలో జరిగిన కార్యక్రమంలో థరూర్ పేరును రాహుల్ ప్రస్తావించలేదని అందుకు మీటింగ్‌కు థరూర్ హాజరకాలేదని పార్టీ కార్యకర్త ఒకరు ది ఫెడరల్‌తో అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విజేతలను సత్కరించడానికి జరిగిన 'మహా పంచాయతీ' కార్యక్రమానికి మాత్రం థరూర్ హాజరయ్యారు.

Read More
Next Story