
పిల్లలు పుట్టించాలని ప్రజల ముందుకు సీఎం!
ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ, జనాభా తగ్గుదలకు చెక్ పెట్టే కొత్త వ్యూహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా తగ్గుదల సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటించిన పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ఇప్పుడు రాష్ట్రవ్యాప్త చర్చకు దారితీసింది. గతంలో ఫ్యామిలీ ప్లానింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వాలు ఇప్పుడు జనాభా సంరక్షణ (పాపులేషన్ కేర్) వైపు దృష్టి సారించడం వెనుక ఆర్థిక, సామాజిక కారణాలు ఎన్నో ఉన్నాయి. ఈ పాలసీ డ్రాఫ్ట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి నెలరోజుల పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించి, దాన్ని అమలు చేయాలని ప్రతిపాదించారు. ఈ వ్యవహారం ప్రజల్లో ఎన్నో సందేహాలకు దారితీస్తోంది.
పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ఏమిటి?
ఈ పాలసీ జనాభా తగ్గుదలను నియంత్రించి, యువత సమతుల్యతను కాపాడుకునేందుకు రూపొందించారు. ముఖ్యమంత్రి ప్రకారం చెబుతున్న ప్రకారం ఇది ఐదు అంచెల లైఫ్ సైకిల్ విధానంపై ఆధారపడి ఉంటుంది. మాతృత్వం, శక్తి, క్షేమం, నైపుణ్యం, సంజీవని. మహిళల గర్భధారణ నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి దశలో ప్రభుత్వ సహకారం అందించడమే లక్ష్యం. ఉదాహరణకు పిల్లలు లేక ఫెర్టిలిటీ సమస్యలతో బాధపడుతున్న దంపతులను ప్రభుత్వం ఆదుకోవాలని, మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేసి సబ్సిడీపై ఐవీఎఫ్ సేవలు అందించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే సిజేరియన్ ఆపరేషన్లను తగ్గించి, టీనేజ్ గర్భధారణలను 3 శాతం కంటే తక్కువకు చేర్చే చర్యలు చేపట్టనున్నారు. ఇంకా ఎక్కువ మంది పిల్లలు కలిగిన కుటుంబాలకు ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్స్) ఇవ్వాలని, ఉదాహరణకు పీడీఎస్ రేషన్‌లో 5 కేజీల బియ్యం ఒక్కో వ్యక్తికి అందించాలని సూచనలు ఉన్నాయి.
నెలరోజుల చర్చ ఎందుకు?
పాలసీ డ్రాఫ్ట్‌ను ప్రజల ముందు ఉంచి, విస్తృత చర్చ జరపాలని ముఖ్యమంత్రి కోరారు. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం. జనాభా విధానం రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసేది కాబట్టి, వివిధ వర్గాలు, మహిళలు, యువత, వృద్ధులు, నిపుణుల అభిప్రాయాలు స్వీకరించి, సవరణలు చేసి అమలు చేయాలనేది ఉద్దేశం. ఇది పాలసీని మరింత సమగ్రంగా చేస్తుంది. ప్రజల్లో ఆమోదం పెంచుతుంది. ఉగాది నాటికి పాలసీని అమలు చేయాలని ప్రణాళికలు ఉన్నాయి.
పాపులేషన్ కేర్ పై దృష్టి ఎందుకు?
గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ ద్వారా జనాభా నియంత్రణకు ప్రాధాన్యత ఇచ్చాం. కానీ ఇప్పుడు జనాభా సంరక్షణ (కేర్) అవసరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ వంటి దేశాల్లో ఫెర్టిలిటీ రేట్ తగ్గుతోంది. ఏపీలోనూ టోటల్ ఫెర్టిలిటీ రేట్ (టీఎఫ్ఆర్) 1.5కు పడిపోయింది (1993లో 3.0 ఉండేది). 2023లో 6.70 లక్షల జననాలు మాత్రమే నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితి కొనసాగితే 2047 నాటికి రాష్ట్ర జనాభాలో 23 శాతం వృద్ధులు ఉంటారు. దీని వల్ల పని చేసే యువత సంఖ్య తగ్గి, ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. అందుకే ప్రభుత్వం జోక్యం చేసుకుని జనాభా సమతుల్యతను కాపాడాలి. ఇది డెమోగ్రాఫిక్ డివిడెండ్‌ను ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది.
జనాభా తగ్గితే ఆర్థిక పరిస్థితి దిగజారుతుందా?
జనాభా తగ్గుదల ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీఎఫ్ఆర్ వేగంగా తగ్గితే పని చేసే వారి సంఖ్య పడిపోతుంది. ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. ఏపీలో మహిళల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 31 శాతం మాత్రమే. ఇది 59 శాతానికి చేరితే రాష్ట్ర జీడీపీ 15 శాతం పెరుగుతుంది. వృద్ధుల సంఖ్య పెరిగితే సామాజిక భద్రతా వ్యవస్థలు భారమవుతాయి. సంపద సృష్టి తగ్గుతుంది. జపాన్, చైనా వంటి దేశాలు ఇప్పుడు ఈ సమస్యలతో పోరాడుతున్నాయి. అందుకే జనాభా మేనేజ్మెంట్ ద్వారా యువ శ్రామిక శక్తిని పెంచి, ఆర్థిక స్థిరత్వం సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యం.
ఒకప్పుడు జనాభాను నియంత్రించారు, ఇప్పుడు ఎందుకు పెంచాలనుకుంటున్నారు?
గతంలో భారత్‌లో జనాభా విస్ఫోటనం సమస్యగా ఉండేది. అందుకే ఇద్దరు పిల్లల నియమాన్ని ప్రోత్సహించారు. కానీ ఇప్పుడు ఫెర్టిలిటీ రేట్ 1.7కు (రీప్లేస్‌మెంట్ రేట్ 2.1 కంటే తక్కువ) పడిపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల నెమ్మదిగా ఉండటం వల్ల పార్లమెంట్ సీట్లు తగ్గే అవకాశం ఉంది. అందుకే ‘పాపులేషన్ కంట్రోల్’ నుంచి ‘పాపులేషన్ మేనేజ్మెంట్’కు మార్పు జరుగుతోంది. ముఖ్యమంత్రి ముగ్గరు పిల్లల నియమాన్ని ప్రోస్తహిస్తున్నారు. ఎక్కువ మంది పిల్లలు కలిగినవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచిస్తున్నారు.
వృద్ధులు చనిపోతే జనాభా తగ్గుతుంది...
వృద్ధులు చనిపోవడం సహజమే, కానీ సమస్య జననాలు తక్కువ అవడం. ఫెర్టిలిటీ రేట్ తగ్గితే, కొత్త తరం జనాభా పెరగదు. వృద్ధుల సంఖ్య పెరిగి మొత్తం జనాభా సమతుల్యత కుదేలవుతుంది. ఏపీలో 2047 నాటికి 23 శాతం వృద్ధులు ఉండవచ్చు. ఇది శ్రామిక శక్తిని తగ్గిస్తుంది. ప్రభుత్వం 60 ఏళ్లు దాటినా పని చేయగలరనే మనస్తత్వాన్ని మార్చాలని చెబుతోంది. యూరప్‌లో 20 దేశాలు ఇప్పుడు ఈ సమస్యతో బాధపడుతున్నాయి.
పిల్లలు పుట్టించడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు ఎందుకు?
పెరుగుతున్న జీవన వ్యయాలు, విద్య, ఉద్యోగాలు, మహిళల ఉద్యోగావకాశాలు పెరగడం వల్ల పిల్లల సంఖ్యను తగ్గించుకుంటున్నారు. ఒక సర్వే ప్రకారం 67 శాతం మంది ఇద్దరు పిల్లలకు మించి కోరుకోవడం లేదు. అయితే పిల్లలను ‘లయబిలిటీ’ కాకుండా ‘ఇన్వెస్ట్‌మెంట్’గా చూడాలని ముఖ్యమంత్రి సూచిస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహకాలు, సహాయాలు అందించడం ద్వారా ఈ మనస్తత్వాన్ని మార్చాలని భావిస్తోంది.
ఈ పాలసీ రాష్ట్ర భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది. కానీ చర్చల ద్వారా మరిన్ని సవరణలు జరగాలి. ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేసి, ఈ విధానాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకుపోవాలి.

