
ఉత్తరాఖండ్‌లో మేఘవిస్ఫోటనం-హిమాచల్‌లో భారీ వర్షాలకు ముగ్గురి మృతి
డెహ్రాడూన్‌ను సందర్శించిన ప్రధాని-బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50వేల చొప్పున పరిహారం ప్రకటించిన మోదీ
హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో రాత్రిపూట కురిసిన భారీ వర్షాలకు వరద ఉప్పొంగింది. కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మండిలోని బస్‌స్టాండ్ నీట మునిగింది. ఇక పొరుగున ఉన్న ఉత్తరాఖండ్(Uttarakhand)లో సోమవారం (సెప్టెంబర్ 15) రాత్రి కుండపోత వర్షం కురిసింది. ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. తపోవన్‌లో ఇళ్లు మునిగిపోయాయి. దుకాణాలు కొట్టుకుపోయాయి. సహస్త్రధార, ఐటీ పార్క్ ప్రాంతం జలమయమైంది.
ఈ సంవత్సరం వర్షాకాలంలో హిమాలయాలలో భారీ వర్షాలు కురిశాయి. రెండు దశాబ్దాలలో అత్యధిక వర్షపాతం నమోదైన మాసం కూడా ఆగస్టే. అధికారిక అంచనా ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఉత్తరాఖండ్‌లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇప్పటివరకు 85 మంది మరణించారు. 128 మంది గాయపడ్డారు. 94 మంది గల్లంతయ్యారు.
హిమాచల్..
హిమాచల్‌లోని మండి జిల్లాలోని సుందర్‌నగర్ సబ్‌డివిజన్‌లోని నెహ్రి ప్రాంతంలోని బోయి పంచాయతీలో కొండచరియలు విరిగిపడడంతో ఇల్లు కూలి ముగ్గురు మరణించారు. ముగ్గురు మృతదేహాలను వెలికితీశామని, ఇద్దరు వ్యక్తులను రక్షించామని మండి డిప్యూటీ కమిషనర్ అపూర్వ్ దేవగన్ తెలిపారు. వర్షాల కారణంగా మండి జిల్లాలోని ధరంపూర్‌లోని సోన్, భరంద్‌లో వరదలు సంభవించాయని, ఫలితంగా బస్టాండ్ నీట మునిగిందని, వర్క్‌షాప్, పంప్ హౌస్‌లు, దుకాణాలు, 20 కి పైగా బస్సులు దెబ్బతిన్నాయని అధికారులు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో.. "ధరంపూర్ బస్ స్టాండ్, రెండు డజన్లకు పైగా HRTC బస్సులు, దుకాణాలు, పంప్ హౌస్, వర్క్‌షాప్ దెబ్బతిన్నాయి" అని పేర్కొన్నారు.
ఇరుక్కుపోయిన వాహనాలు..
సిమ్లాలోని హిమ్లాండ్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రధాన రహదారి మూసుకుపోవడంతో పాఠశాలకు వెళ్లేందుకు పిల్లలు ఇబ్బంది పడ్డారు.
"భారీగా వర్షం పడుతోంది. తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో చెట్లు, కొండచెరియలు విరిగిపడుతున్న శబ్దం విన్నాం. వెంటనే మా వాహనాలను మరో చోటికి తరలించాము" అని కొండచరియలు విరిగిపడినప్పుడు హిమ్లాండ్ సమీపంలో ఆపి ఉన్న వాహనంలో నిద్రిస్తున్న గౌతమ్, రాహుల్ శుక్లా చెప్పారు.
ఉత్తరాఖండ్..
సోమవారం రాత్రి సంభవించిన వరదల కారణంగా కార్లిగాడ్ వాగు పొంగిపొర్లింది. వరద నీరు చుట్టుపక్కల మండలాలు, గ్రామాల్లోకి ప్రవేశించడతో నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. మాల్దేవ్తాలో రోడ్డులో కొంత భాగం కొట్టుకుపోయింది. డెహ్రాడూన్-ముస్సోరీ రహదారి దెబ్బతిన్న మార్గాల్లో ఒకటి. నగరం అంతటా నీటి మట్టాలు పెరుగుతున్నట్లు నివేదికలు వచ్చాయి.
సహస్త్రధారలోని అనేక దుకాణాలు దెబ్బతిన్నాయని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి X (గతంలో ట్విట్టర్)లో ధృవీకరించారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని హామీ ఇచ్చారు.
"నిన్న రాత్రి డెహ్రాడూన్‌లోని సహస్రధారలో భారీ వర్షం కారణంగా కొన్ని దుకాణాలు దెబ్బతిన్నాయి. జిల్లా యంత్రాంగం, ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలలో నిమగ్నమై ఉన్నారు. స్థానిక అధికారుల నుంచి అడిగి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం" అని హిందీలో ట్వీట్ చేశారు.
రంగంలోకి రెస్క్యూ బృందాలు ..
డెహ్రాడూన్‌లో మేఘా విస్ఫోటనం(Cloudburst) తర్వాత రిషికేశ్‌లోని చంద్రభాగ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదిలో నీరు జాతీయ రహదారి మీదకు ఎక్కి ప్రవహించడంతో ముగ్గురు వ్యక్తులు నదిలో చిక్కుకున్నారు. వారిని SDRF బృందం రక్షించాయి. అంతకుముందు పిథోరగఢ్ జిల్లాలోని ఒక రహదారిపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా ఆ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.
డెహ్రాడూన్‌లోని 1 నుంచి 12వ తరగతి వరకు ఉన్న అన్ని పాఠశాలలను మూసివేయాలని జిల్లా మేజిస్ట్రేట్ సవిన్ బన్సాల్ ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, ప్రజా పనుల శాఖ (పిడబ్ల్యుడి) బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయని జిల్లా మేజిస్ట్రేట్ సవిన్ బన్సాల్ మీడియాకు తెలిపారు. “కొన్ని దుకాణాలు కొట్టుకుపోయాయి, ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. శోధన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి” అని చెప్పారు.
అంతకుముందు ఆగస్టులో కూడా ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా దేవాల్ తహసీల్ పరిధిలోని మోపాటా గ్రామంలో మేఘావృతం సంభవించడంతో ఇద్దరు వ్యక్తులు తప్పిపోయారు. అయితే భారత వాతావరణ శాఖ (IMD) ఈ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. అప్పుడప్పుడు మేఘావృతాలు, బురదజల్లులు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అధికారులను సిద్ధంగా ఉండాలని ఆదేశించింది.
రుతుపవనాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాలలో భారీ వర్షాలు, మేఘావృతాలు కొండచరియలు విరిగిపడ్డాయి. గత నెలలో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లలో భారీ విధ్వంసం సంభవించిన నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రమాధ హెచ్చరికలు జారీ చేస్తుంది. గత నెలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, రోడ్లు గుంతలు పడటం, మౌలిక సదుపాయాలు కూలిపోవడం వంటివి సంభవించాయి. ఈ విపత్తులలో (ఉత్తరాఖండ్) ధరాలి గ్రామ వరద, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో మేఘావృతాలు, వరదలు సంభవించాయి.
ప్రధాని పర్యటన..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 11న వరద పరిస్థితిని అంచనా వేయడానికి డెహ్రాడూన్‌ను సందర్శించారు. విపత్తుపై చర్చించడానికి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశానికి కూడా మోదీ అధ్యక్షత వహించారు. ప్రకృతి వైపరీత్య బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు మోదీ ప్రకటించారు. అనాథలైన పిల్లలకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద సహాయాన్ని ప్రకటించారు.