సిద్ధరామయ్యకు లంచం కేసులో క్లీన్ చిట్..
నిన్న ముడా(MUDA) కేసులో, నేడు లంచం(Bribe) కేసులో కర్ణాటక (Karnataka) సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) కు కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చాయి.
సిద్ధరామయ్య గతంలో సీఎంగా ఉన్నప్పుడు..బెంగళూరు టర్ఫ్ క్లబ్(BTC)లో స్టీవర్డ్‌గా నియమించేందుకు తన స్నేహితుడు ఎల్. వివేకానంద నుంచి రూ.1.3 కోట్లు లంచం తీసుకున్నారని బీజేపీ(BJP) నేత ఎన్.ఆర్. రమేష్ 2022లో కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. అయితే ఈ ఆరోపణను సిద్ధరామయ్య అప్పట్లో ఖండించారు. ఆ మొత్తాన్ని అప్పుగా తీసుకున్నానని, దాన్ని తన ఎన్నికల అఫిడవిట్‌లో కూడా చూపానని ఆయన పేర్కొన్నారు.
2023లో సిద్ధరామయ్య (CM Siddaramaiah) మరోసారి సీఎం అయ్యాక లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన ముగింపు నివేదికను బీజేపీ నేత రమేష్ వ్యతిరేకించారు. దాంతో దర్యాప్తు పునఃప్రారంభించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. మరోమారు విచారణ అనంతరం ఈ నెల ప్రారంభంలో ప్రత్యేక న్యాయస్థానం లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన 'బి' నివేదికను అంగీకరించింది.
నిందితుడు వివేకానందకు 1998-99, 2003-04లో టర్ఫ్ క్లబ్‌లో స్టీవర్డ్‌గా పనిచేసిన అనుభవం ఉందని, ఆయన ఆ పోస్టుకు అర్హుడు కాబట్టే తిరిగి నామినేట్ చేశారని కోర్టు పేర్కొంది.
నిందితుడు వివేకానంద కూడా సిద్ధారామయ్యకు ఆ డబ్బును వడ్డీ లేకుండా ఇచ్చానని దాన్ని తన ఐటీ రిటర్నుల్లో కూడా చూపానని చెప్పారు. దీంతో లంచం తీసుకున్నట్లు నిర్ధారణ కాకపోవడంతో కోర్టు సిద్ధరామయ్యకు క్లీన్ చిట్ ఇచ్చింది.