
ఒక్కో సిగరెట్టు రూ.72, ముట్టుకుంటే మూతికాలినట్టే!
కోవిడ్ సమయంలో రాష్ట్రాలకు జరిగిన ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకేనని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి..
ఫిబ్రవరి నుంచి సిగరెట్ ముట్టుకుంటే మూతి కాలాల్సిందే. 18 నుంచి 20 రూపాయల లోపుండే సిగరెట్లు అమాంతం ఒక్కొక్కటి 72 రూపాయలు కానున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కొత్త సంవత్సరపు నిర్ణయంగా చెబుతున్నారు. మొత్తం మీద ఇది ధూమపాన ప్రియులకు పెద్ద షాక్ అనవచ్చు. పెరగనున్న ధరల వివరాలు చూస్తే ధూమపాన ప్రియులకి గుండె ఆగినంత పనవుతోంది. ప్రస్తుతం రూ. 18 పలుకుతున్న ఒక్క సిగరెట్ ధర ఏకంగా రూ. 72కు చేరుకోనుందని అధికారిక అంచనాలు వెలువడుతున్నాయి. ఈ లెక్కన గోల్డ్ ఫ్లేక్ కింగ్ సైజు సిగరెట్ ప్యాకెట్ 720 రూపాయలవుతుంది.
ధరల పెరుగుదల వెనుక అసలు కారణం
డిసెంబర్‌లో ప్రవేశపెట్టిన సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు - 2025'కు పార్లమెంటు తాజాగా ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. అయితే ఇది కేవలం పన్ను పెంపు మాత్రమే కాదని, గతంలో కోవిడ్ సమయంలో రాష్ట్రాలకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు చేసిన రూ. 2.69 లక్షల కోట్ల అప్పును తీర్చేందుకే ఈ 'సెస్' విధిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
కొత్త పన్నుల భారం ఇలా ...
సిగరెట్లు: పొడవు, ఫిల్టర్ రకాన్ని బట్టి ప్రతి 1,000 సిగరెట్ స్టిక్స్‌పై రూ. 2,700 నుంచి రూ. 11,000 వరకు భారీ ఎక్సైజ్ సుంకం పడనుంది.
నమిలే పొగాకు (జర్దా): కేజీ పొగాకుపై రూ. 100 వరకు పన్ను భారం పడుతుంది.
ముడి పొగాకు: దీనిపై ఏకంగా 60-70% వరకు సుంకం విధించే అవకాశం ఉంది.
ఈ భారీ సుంకాల పెంపు వల్ల ఐటీసీ (ITC), గాడ్‌ఫ్రే ఫిలిప్స్ వంటి దిగ్గజ పొగాకు తయారీ కంపెనీల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అటు బీడీలు, ఇతర పొగాకు ఉత్పత్తుల ధరలు కూడా సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరనున్నాయి. మొత్తానికి 2026 పొగాకు వినియోగదారులకు చేదు కాబోతోంది.

