
‘పాక్ సైనిక పరికరాలలో ఎక్కువ భాగం చైనావే’
లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్
ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) సమయంలో పాకిస్తాన్(Pakistan)కు చైనా(China) మద్దతు ఇచ్చిందని డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ అన్నారు. పాక్ సైనిక పరికరాల్లో 81 శాతం చైనావే కావడం అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. 'న్యూ ఏజ్ మిలిటరీ టెక్నాలజీస్' పేరిట FICCI ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
భారతదేశానికి "ఒక సరిహద్దు", ముగ్గురు శత్రువులు ఉన్నారని, అందులో ముందు వరుసలో పాక్‌కు అన్ని విధాల సహకరిస్తున్నది చైనానేనని చెప్పారు. పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడంలో టర్కీ కూడా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా.. భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతం చేసింది.
ఉగ్ర స్థావరాలపై ఖచ్చితమైన దాడులను చేయడంలో భారత వైమానిక దళం (IAF) కీలక పాత్ర పోషించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత..పాకిస్తాన్ కీలక భారత వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ల సాయంతో ప్రతీకార దాడులను పాల్పడింది. అయితే ఆ ప్రయత్నాలను భారత్ సమర్థవంతంగా తిప్పి కొట్టింది.