
గుజరాత్‌లో మళ్లీ పెరుగుతున్న బాల్య వివాహాలు..
పేదరికంతో కన్నకూతుర్లనే అమ్మేస్తున్న తల్లిదండ్రులు.. మైనర్ కారణంగా వర్తించని సంక్షేమ పథకాలు..
కఠిన చట్టాలు అమలులో ఉన్నా.. గుజరాత్(Gujarat) రాష్ట్రంలో బాల్య వివాహాలు (Child marriages) భారీగా జరుగుతున్నాయి. మాచియేల్ గ్రామానికి చెందిన టెన్త్ డ్రాప్ అవుట్ విద్యార్థినికి 2024లో 17 ఏళ్ల వయసున్న ఆనంద్ చునారాకు ఇచ్చి పెళ్లి జరిపించారు ఆమె తల్లిదండ్రులు. పెళ్లికి ముందు బాగా చదివిస్తాని అత్తింటి వారు హామీ ఇచ్చారు. ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. వేధిపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవడంతో ఖేడా పోలీసులు గత వారం బాలిక తల్లిదండ్రులు, అత్తమామలను అరెస్టు చేశారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రం ఖేడా జిల్లాలో జరిగింది.
మైనర్లను కాపాడుతున్న మహిళా, శిశు సంక్షేమ శాఖ..
గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో మే 2023- డిసెంబర్ 2024 మధ్యకాలంలో భారీగా సామూహిక వివాహాలు జరిగాయి. ఈ విషయం తెలిసి మహిళా, శిశు సంక్షేమ శాఖ పెళ్లిళ్లను అడ్డుకుని సుమారు 200 మంది బాలికలను కాపాడగలిగింది. 2024 ఫిబ్రవరి లో గుజరాత్ పోలీసులు ఒక ముఠాను అరెస్టు చేసి 'బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్న పాటిదార్ (పటేల్) సమాజానికి చెందిన ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు. 2023 - 2024 మధ్యకాలంలో గుజరాత్ పోలీసులు 1,600 మందికి పైగా మైనర్ బాలికలను రక్షించారు.
పెంచి పోషించలేక..
"బాల్య వివాహాలు కేవలం కుటుంబాల మధ్య ఆర్థిక ఒప్పందం మాత్రమే కాదు. ఆధిపత్య కులాలలో లోతుగా పాతుకుపోయిన సాంస్కృతిక ఆచారం. అణగారిన వర్గాలు తమ కూతుర్లను పెంచి పోషించలేక అమ్ముకునే దుస్థితికి దిగజారాయి. కాని ఈ ఆచారాన్ని ప్రోత్సహిస్తున్నది మాత్రం ఆధిపత్య కులాలే. చాలామంది బాల్య వధువులను గుజరాత్‌లో పటీదార్ వర్గాలకు అమ్ముతున్నారు. రాజకీయ నాయకులు ఈ విషయంలో జోక్యం చేసుకోడానికి ఇష్టపడడం లేదు," అని మహిళా కాంగ్రెస్ మాజీ సభ్యురాలు నీతా మాల్ధారి ది ఫెడరల్‌తో అన్నారు.
"బాల్య వివాహాల గురించి మాకు సమాచారం అందినవెంటనే స్పందిస్తున్నాం. చర్యలు కూడా తీసుకుంటున్నాం. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలూ ర్వహిస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో కొంత మార్పు వచ్చినా.. గ్రామీణ ప్రాంతాల్లో మార్పు రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది.’’అని ఖేడా జిల్లా కలెక్టర్ అమిత్ యాదవ్ ది ఫెడరల్‌తో అన్నారు.
మదారి కమ్యూనిటీకి చెందిన 12 ఏళ్ల కూతురు మీరా (పేరు మార్చబడింది) అమె తల్లిదండ్రులు అమ్మేశారు. బాలల హక్కుల స్వచ్ఛంద సంస్థ ‘ప్రయాస్’ సహాయంతో గుజరాత్ పోలీసులు ఆమెను రక్షించగలిగారు.
"ప్లాస్టిక్ సంచులతో కప్పేసిన మట్టి ఇల్లు మాది. మా తల్లిదండ్రులు చెత్తకుప్పలో ప్లాస్టిక్ బాటిళ్లు సేకరిస్తారు. ఓ రోజు ఒక జంట మా ఇంటికి వచ్చారు. నన్ను దత్తత తీసుకుంటామని మా అమ్మానాన్నకు చెప్పారు. బాగా చవిస్తామని కూడా చెప్పడంతో నా తల్లిదండ్రులు అంగీకరించారు. తర్వాత వాళ్లు మా అమ్మనాన్నకు రూ. 2వేలు ఇచ్చారు’’ అని గుర్తు చేసుకుంది నలుగురు తొబుట్టువుల్లో పెద్దదయిన మీరా.
మీరాను తీసుకెళ్లిన వారు ఆమెను సూరత్‌లో కొన్ని వారాలపాటు ఓ గదిలో బంధించి ఉంచారు. ఆ తర్వాత ఆమెను సబర్కాంతలోని 28 ఏళ్ల వ్యక్తికి వధువుగా అమ్మేశారు.
గర్భవతి అయింది. కానీ ఆరోగ్య సమస్యల కారణంగా బిడ్డను కోల్పోయింది. ఆమెను కొన్న కుటుంబం మీరాకు చికిత్స చేయించడానికి ఇష్టపడలేదు. పైగా మీరాను తిరిగి ఆ ముఠా సభ్యులకు అప్పగించారు. వాళ్లు మీరాను మరొకరికి అమ్మేయకముందే గుజరాత్ పోలీసులు మీరాను రక్షించారు. అప్పటి నుంచి ఆమె మాతోనే ఉంది." అని వివరించారు అహ్మదాబాద్‌లోని నారీ సంరక్షణ్ కేంద్ర సంరక్షకురాలు అపర్ణ మోదీ.
మరో బాల్యవధువు వాస్తవ గాథ..
గుజరాత్‌లోని ఆరావళి జిల్లాలోని దేవిపూజక్ కమ్యూనిటీకి చెందిన మరో బాల్య వధువు పేరు రింకి (పేరు మార్చారు). ఆరేళ్ల క్రితం పటాన్‌లోని పటేల్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తితో పెళైంది. ఇప్పుడు ఈమెకు ఇద్దరు కుమారులు.
పోషించలేకే అమ్మేశారు..
"మా గ్రామంలో డబ్బు కోసం చిన్న వయసులోనే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసేయడం సర్వసాధారణం. నా తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. మేం మొత్తం ఏడుగురు పిల్లలం. మమ్మల్ని పోషించేంత డబ్బు మా అమ్మానాన్న దగ్గర లేదు. మా అత్తింటి వారు మా నాన్నకు రూ. 3వేలు ఆఫర్ చేశారు. మా కుటుంబ పరిస్థితిని చూసి నేను 32 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించా," అని చెప్పింది డ్రాప్ అవుట్ స్టూడెంట్ రింకి.
పెళ్లయిన తర్వాత రింకికి కష్టాలు మొదలయ్యాయి. ‘‘పెళ్లి సమయంలో మా అబ్బాయికి కాంక్రీట్ ఇల్లు, వ్యవసాయ భూమి ఉన్నాయని అత్తింటివారు చెప్పారు. నా భర్త, ఆయన ముగ్గురు సోదరులకు ఆస్తి పంపకాలు జరగ్గా మా ఆయనకు రెండు గదుల ఇల్లు వచ్చిందని, అది కూడా తనఖా పెట్టారని తెలిసింది. చాలా ఏళ్లు ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. పొలం ఉన్నా దిగుబడి అంతంత మాత్రమే. నాలుగేళ్ల క్రితం.. నేను గర్భం దాల్చినపుడు నా భర్త వజ్రాలు కట్టే పని కోసం సూరత్ వెళ్లాడు. కానీ ఆయనకు వచ్చే జీతం అక్కడ ఉండటానికే సరిపోయేది. ఇంటికి డబ్బు పంపడం సాధ్యమయ్యేది కాదు ”అని 19 ఏళ్ల రింకి చెప్పారు.
గర్భవతిగా ఉన్నప్పుడు రింకి మాతృశక్తి యోజన (MMY)లో తన పేరు నమోదు చేయించుకోడానికి స్థానిక అంగన్‌వాడీని సంప్రదించింది. అయితే తక్కువగా ఉందన్న కారణంగా ఆమె పేరును నమోదు చేసుకోలేదు. ఈ పథకం కింద అంగన్‌వాడీ కేంద్రాలలో ప్రతి నెలా గర్భిణులకు 2 కిలోల శనగలు, 1 కిలో కందిపప్పు, 1 కిలోల వంట నూనె ఉచితంగా ఇస్తారు.
మైనర్ గర్భిణులకు సాయం చేయడానికి పూర్ణ పథకం దోహదపడుతుంది. "గుజరాత్‌లోని యుక్తవయసు బాలికల కోసం మేం 2022లో పూర్ణ పథకాన్ని ప్రారంభించాం. మైనర్ గర్భిణుల్లో పోషకాహార లోపం, రక్తహీనత, బాల్య వివాహాలను నిరోధించడం ఈ పథకం ఉద్దేశ్యం" అని మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాకేష్ కుమార్ ది ఫెడరల్‌తో అన్నారు .
25 శాతం 18 ఏళ్ల కంటే తక్కువ వయసు వారే..
2024లో విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NHFS) నివేదిక - VI ప్రకారం.. గుజరాత్‌లో పెళ్లి చేసుకున్న బాలికలలో 25 శాతం కంటే ఎక్కువ మంది 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే. వీరిలో 5.2 శాతం మంది బాలికలు 13 నుంచి16 సంవత్సరాల వయస్సులో గర్భం దాల్చిన వారు ఉన్నారు.
"మదారి, సపేరా, దేవిపూజకులు, చునారస్, దాతానియా, రథ్వాస్ కమ్యూనిటీల్లో బాల్య వివాహాలు విపరీతంగా జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం పేదరికం, విద్య లేకపోవడం. ఈ వర్గాల ప్రజలు రోజువారీ కూలీలు. కాలానుగుణంగా పనుల కోసం వలస వెళతారు. కుటుంబ ఆర్థిక బాగోలేక ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలను రూ. వెయ్యి నుంచి రూ. 5వేల వరకు అమ్మేస్తున్నారు" అని ప్రయాస్ అధిపతి ఇంద్రజిత్ చౌహాన్ అన్నారు.
"అయితే ఈ ఆచారం అనేక వర్గాల సంస్కృతిలో లోతుగా పాతుకుపోయింది. గ్రామ పంచాయతీలు కూడా ఈ సంస్కృతికి మద్దతు ఇస్తుండడంతో జోక్యం చేసుకోవడం కష్టంగా మారింది." అని అన్నారు.
(ఆత్మహత్యలను నివారించవచ్చు. సహాయం కోసం దయచేసి ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్‌లకు కాల్ చేయండి: నేహా ఆత్మహత్య నివారణ కేంద్రం – 044-24640050; ఆత్మహత్య నివారణ, భావోద్వేగ మద్దతు & గాయం సహాయం కోసం ఆసరా హెల్ప్‌లైన్ +91-9820466726; కిరణ్, మానసిక ఆరోగ్య పునరావాసం 1800-599-0019, దిశ 0471- 2552056, మైత్రి 0484 2540530, మరియు స్నేహ ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్ 044-24640050.)