
మజుందార్-షా చొరవను ప్రశంసించిన చిందంబరం..
బెంగళూరులో రోడ్ల మరమ్మతు కోసం నిధులు సమకూరుస్తామని ముందుకొచ్చిన బయోకాన్ చీఫ్‌ను అభినందించిన కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి..
బెంగళూరు(Bengaluru)లో రోడ్లు దుస్థితి, ట్రాఫిక్ సమస్యపై పారిశ్రామికవేత్తలు ఇన్ఫోసిస్ మాజీ CFO మోహన్‌దాస్ పాయ్, బయోకాన్(Biocon) చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా(Kiran Mazumdar shaw) సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, వాటికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar), హోం మంత్రి పరమేశ్వర్ కౌంటర్ ఇవ్వడం జరిగిపోయాయి. ఒక సందర్భంలో అవసరమయితే రోడ్లు మరమ్మతుకు నిధులు సమకూర్చేందుకు సిద్ధమని మజుందార్-షా ప్రతిపాదనను కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం(P Chidambaram) స్పందించారు. ఆమెకు అభినందనలు తెలిపారు.
ఎక్స్ వేదికగా అభినందనలు..
"బెంగళూరులోని కొన్ని రోడ్ల మరమ్మతుకు నిధులు సమకూర్చడానికి శ్రీమతి కిరణ్ మజుందార్ షా ముందుకు రావడం గురించి చదివాను. నిజంగా గొప్ప ఆఫర్! ఆమెకు అభినందనలు!" అని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు చిదంబరం.
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామం పనుల్లో జవాబుదారీతనాన్ని పెంచుతుందని పేర్కొన్న కేంద్ర మాజీ అర్థిక శాఖ మంత్రి.. వాస్తవంగా రోడ్ల మరమ్మతుకు అసలు సమస్య నిధుల కొరత కాదని, పనులు అమలే అసలు సమస్య అని పేర్కొన్నారు.
‘‘కాంట్రాక్టర్ పని మాత్రమే చేస్తాడు. నాణ్యత, సకాలంలో పనులు పూర్తి చేయడం, ఖర్చు పెరుగుదలను భరించడం పారిశ్రామికవేత్త బాధ్యత. ఈ మోడల్ బెంగళూరు లేదా చెన్నై నగరాలకు ఒక పైలట్ ప్రాజెక్టుగా ఉపయోగపడొచ్చు కూడా’’ అని అభిప్రాయపడ్డారు.
ఇంతకు వివాదం ఏమిటి?
మజుందార్-షా బెంగళూరులో దెబ్బతిన్న రోడ్లు, చెత్త నిర్వహణ సరిగా లేకపోవడం, ట్రాఫిక్ సమస్య గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ.. కర్ణాటక ప్రభుత్వంతో, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో విభేదిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ పనితీరును విమర్శిస్తూ ఆమె సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు. ఇది అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. బీజేపీ పాలనలో ఈ సమస్యలపై ఎందుకు ప్రశ్నించలేదని డీకే కౌంటర్ ఇచ్చారు. "వ్యక్తిగత ఎజెండా" తోనే పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. ‘‘ఇక్కడ వ్యాపారాలు ప్రారంభించి బాగా ఎదిగారు. ఏ దశ నుంచి ఏ దశకు ఎదిగారో మర్చిపోయి పోస్టులు పెడుతున్నారు. విమర్శలను స్వాగతిస్తున్నా. అవి ప్రజాస్వామ్య విలువను పెంచుతాయి. కానీ కొంతమంది అతిగా స్పందిస్తున్నారు’’ అని డీకే పేర్కొన్నారు. దీనికి మజుందార్ స్పందించారు. ‘‘మా ఎజెండా ఒక్కటే. రోడ్లను బాగు చేయండి’’ అని ఆమె తిరిగి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
‘బాగుచేస్తామంటే కాదంటామా?’
బయోకాన్ వ్యవస్థాపకురాలు మజుందార్ షా నగరంలోని 10 నుంచి15 రోడ్ల మరమ్మతు, అభివృద్ధికి నిధులు సమకూర్చడానికి ముందుకొచ్చారు. ఆమె ఆఫర్‌ను శివకుమార్ కూడా స్వాగతించారు. ‘‘మజుందార్ అధికారికంగా ప్రభుత్వ అధికారులను సంప్రదిస్తే..ఆమె ఎంచుకున్న రోడ్లను అభివృద్ధి చేయడంలో అధికారులు ఆమెకు సహకరిస్తారు’’ అని అక్టోబర్ 18న నగరంలోని కేఆర్ పురంలో జరిగిన 'బెంగళూరు నదిగే (బెంగళూరు కోసం నడక)' కార్యక్రమంలో శివకుమార్ చెప్పారు.