కొనసాగుతోన్న నిరసనలు..వైద్యుల భద్రతకు కేంద్రం అంగీకారం..
కోల్‌కతాలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి. జూనియర్ డాక్టర్లు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు.
కోల్‌కతాలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి. జూనియర్ డాక్టర్లు తమ నిరసనలు సోమవారం కూడా దేశవ్యాప్తంగా కొనసాగించారు. దీంతో ఆసుపత్రుల వద్ద భద్రతను 25 శాతం పెంచడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా నిర్ణయం తీసుకుంది.
సీనియర్ డాక్టర్లకు నోటీసులు..
కోల్‌కతా ఘటన గురించి సోషల్ మీడియాలో సీనియర్ వైద్యులు కునాల్ సర్కార్, సుబర్ణ గోస్వామి పోస్టులు పెట్టారు. తర్వాత వారు కలకత్తా మెడికల్ కాలేజీ నుండి కోల్‌కతా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు వందలాది మంది జూడాలతో చేపట్టిన మార్చ్‌కు నాయకత్వం వహించారు. దాంతో పోలీసుల ముందు హాజరు కావాలని నోటీసులందాయి. దీంతో నిరసనలు మరింత తీవ్రమయ్యాయి.
పశ్చిమ బెంగాల్‌లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. మందకొడిగా విచారణ జరుగుతుండడంపై ఒక వైద్యుడు ఇలా అన్నారు. “36 గంటల పాటు రోగులకు చికిత్స చేస్తూ క్రూరత్వాన్ని ఎదుర్కొన్న మహిళా డాక్టర్‌కు న్యాయం చేయాలి. ఆమెను అత్యంత పాశవికంగా హత్యచేసి నేటికి 11 రోజులైంది. న్యాయం ఎక్కడుంది? మా సోదరికి న్యాయం జరిగే వరకు మేం ఈ ఆందోళన కొనసాగిస్తాం. ”అని RG కర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ఆందోళన చేస్తున్న ఒక డాక్టర్ అన్నారు.
అసలు దోషులను శిక్షించాలి..
కలకత్తా హైకోర్టు వద్ద ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదుల బృందం కూడా ఈ కేసులో బాధితురాలికి న్యాయం జరగాలని "అసలు దోషులకు శిక్ష పడాలని" డిమాండ్ చేసింది.
ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యాలయం ముందు ఓపీ సేవలు..
కోల్‌కతా ఘటనతో ఢిల్లీలోనూ జూడాలు సమ్మెకు దిగారు. విధులను బహిష్కరించి నిరసనల్లో పాల్గొంటున్నారు. ఢిల్లీ నిర్మాణ్ భవన్‌లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యాలయం ముందు రోడ్డుపై డాక్టర్ల బృందం బైఠాయించింది. ఆర్థో OPD , న్యూరాలజీ OPD, సైకియాట్రీ OPD అని చిన్నపాటి బోర్డులు ప్రదర్శించి రోగులకు సేవలందించారు. ఈ సందర్భంగా రోడ్డుపై కూర్చుని రోగులను పరీక్షిస్తున్న వైద్యుడు ఇలా అన్నాడు..“ఆసుపత్రిలో భద్రత లేదా రక్షణ లేదు. కనీసం ఇక్కడ మా చుట్టూ పోలీసులు ఉన్నారు. కాబట్టి మేము ఇక్కడ రోగులకు చికిత్స చేస్తాం. మాకు మేం పోరాడటం తప్ప మరో మార్గం లేదు. మేము ఇక్కడ నిర్వహిస్తున్న OPD ఒక ప్రతీకాత్మక నిరసన.’’ అని పేర్కొన్నారు.
మహారాష్ట్రలో..
కోల్‌కతా ఘటనకు నిరసనగా మహారాష్ట్రలో జూడాలు, రెసిడెంట్ డాక్టర్లు సమ్మెకు దిగారు. దీంతో వైద్య సేవలు స్థంభించాయి. ఐదు పెద్ద ఆసుపత్రులలో మొత్తం 18 మేజర్ ఆపరేషన్లు, 61 మైనింగ్ ఆపరేషన్లు మాత్రమే చేశారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం కేంద్ర ఆరోగ్య కార్యదర్శితో రెసిడెంట్ డాక్టర్ల జాతీయ సంస్థ ప్రతినిధుల బృందం జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగిస్తున్నామని మహారాష్ట్ర స్టేట్ అసోసియేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ డాక్టర్స్ (సెంట్రల్-మార్డ్) అధ్యక్షుడు డాక్టర్ ప్రతీక్ దేబాజే తెలిపారు. కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు నుంచి తమకు అనుకూలంగా ఏదైనా ఆదేశాలు వస్తాయని ఎదురుచూస్తున్నామని చెప్పారు.
కోర్టు ఆదేశాలపైనే అందరి దృష్టి..
ఆగస్టు 13 నుంచి సమ్మెకు నాయకత్వం వహిస్తున్న మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ (MARD) మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు మంగళవారం ఈ కేసు విచారణ చేపట్టనుంది. కోర్టు ఆదేశాల మేరకు ఆందోళనపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ముంబైలో మౌనదీక్ష..
వైద్యలపై దాడులను అరికట్టడంతో పాటు పూర్తి రక్షణ కల్పించాలని.. ముంబైలో సియోన్ ఆసుపత్రి రెసిడెంట్ వైద్యులు సోమవారం మౌన ప్రదర్శన నిర్వహించారు. ఆదివారం ఓ మహిళా డాక్టర్‌పై రోగి బంధువులు మద్యం మత్తులో దాడి చేశారు. కోల్‌కతాలో జరిగిన ఘటన, అలాగే ఇక్కడ జరిగిన ఘటనకు నిరసనగా ఈ సైలెంట్ మార్చ్ నిర్వహించామని సియోన్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సుదీప్ ధాకనే తెలిపారు. గత వారంతో పోలిస్తే OPD, క్యాజువాలిటీ వార్డులలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య బాగా తగ్గిందని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) వర్గాలు తెలిపాయి.
సమ్మె కొనసాగుతుంది.. FAIMA
తమ డిమాండ్లకు కేంద్రం అంగీకరించకపోతే సమ్మె కొనసాగిస్తామని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (FAIMA ) తెలిపింది. అయితే సుప్రీం కోర్టు సూచనమేరకు ఆందోళనలు, నిరసనలపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కొంంతమంది వైద్యులు చెబుతున్నారు.
దేశంలోని ఇతర ప్రాంతాల్లో..
ఉత్తరప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులలో జూనియర్ వైద్యులు "కళా రక్షా బంధన్" పాటించారు. అయితే కొన్ని రకాల సేవలకు సోమవారం వరుసగా ఎనిమిదో రోజు కూడా అంతరాయం ఏర్పడింది. యుపి రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హర్దీప్ జోగి.. “జూనియర్ డాక్టర్ల సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది. అన్ని వైద్య కళాశాలల్లో OPD, ఇతర సేవలకు అంతరాయం ఏర్పడింది’’ అని చెప్పారు.
భద్రతకు కేంద్రం అంగీకారం..
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద భద్రతను 25 శాతం పెంచేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతించినట్లు అధికారులు తెలిపారు. స్టాండర్డ్ సెక్యూరిటీ ప్రోటోకాల్‌తో పాటు, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండ్ల సూచనమేరకు భద్రతను పెంచుతామని, అవసరమైతే మార్షల్స్ సేవలు కూడా వినియోగిస్తామని వారు చెప్పారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అమలు చేయాల్సిన భద్రతా చర్యల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఎంట్రెన్స్ , ఎగ్జిట్ పాయింట్ల దగ్గర పర్యవేక్షణ, రాత్రిపూట మహిళా ఆరోగ్య నిపుణులకు ఎస్కార్ట్ ఉండడం వంటివి ఉన్నాయి.
టీఎంసీ ఎంపీకి నోటీసు..
కోల్‌కతా ఘటనపై సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌కు సంబంధించి పోలీసులు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ నోటీసు పంపారు. దాన్ని సవాలు చేస్తూ ఆయన కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం విచారిస్తామని కోర్టు తెలిపింది.
విచారణను వేగవంతం చేయాలి.. టీఎంసీ
ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసును విచారిస్తున్న సీబీఐ విచారణ వేగవంతం చేయాలని పశ్చిమ బెంగాల్‌లోని అధికార టీఎంసీ డిమాండ్ చేస్తోంది. ఈ కేసులో కోల్‌కతా పోలీసుల విచారణ బాగానే జరుగుతున్న క్రమంలో.. హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ కేసు విచారణలో వేగం పెంచాలని టిఎంసి సీనియర్ నాయకుడు కునాల్ ఘోష్ విలేకరులతో అన్నారు.