వ్యాపార దిగ్గజం విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్
x

వ్యాపార దిగ్గజం విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్

అప్పు ఎగవేత కారణంగా ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌కు రూ.180 కోట్ల నష్టం వాటిల్లిందని అని సీబీఐ తన చార్జిషీట్‌లో పేర్కొంది.


వ్యాపార దిగ్గజం విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ నుంచి గతంలో ఆయన రూ. 180 కోట్ల రుణం తీసుకున్నారు. దాన్ని తిరిగి చెల్లించకపోవడంతో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్పీ నాయక్ నింబాల్కర్ జూన్ 29న ఆయనపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. కింగ్‌ఫిషర్, ఎయిర్‌లైన్స్ ప్రమోటర్ అయిన విజయ్ మాల్యా "ఉద్దేశపూర్వకంగా" రుణం చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌కు రూ.180 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ పేర్కొంది.

‘ప్రస్తుతం విదేశాల్లో నివసిస్తున్న మాల్యా.. 2007 - 2012 మధ్యకాలంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరిట బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నారు. మాల్యా నిజాయితీ లేని వ్యక్తి. మోసం చేయాలనే ఉద్దేశ్యంతోనే రుణాన్ని తిరిగి చెల్లించడం లేదు. అప్పు ఎగవేత కారణంగా రూ. 141.91 కోట్ల నష్టం కలిగించాడు. రుణాలను షేర్లుగా మార్చుకోవడంతో రూ.38.30 కోట్ల అదనపు నష్టం వాటిల్లింది.’ అని సీబీఐ తన చార్జిషీట్‌లో పేర్కొంది.

సీబీఐ చార్జిషీట్‌పై ..‘పరారీలో ఉన్న మాల్యాపై నాన్ బెయిలబుల్ కేసులు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయి. అతనికి సమన్లు జారీ చేయడం వల్ల ప్రయోజనం ఉండదు’ అని కోర్టు అభిప్రాయపడింది.

పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న మాల్యాను విచారించేందుకు తమకు అప్పగించాలని లండన్ ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం కోరుతోంది.

Read More
Next Story