
హస్తినలో అధికార బీజేపీని ఆప్ ఢీ కొట్టగలదా?
ఢిల్లీ అసెంబ్లీలో అధికార బీజేపీతో ప్రతిపక్ష ఆప్ పోరాడగలదా? ప్రభుత్వాన్ని ఇరుకున్న పెట్టేందుకు చీపురు పార్టీ ఎమ్మెల్యేల వద్ద ఉన్న అస్త్రాలేంటి?
ఢిల్లీ (Delhi) అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)ని పూర్తిగా కనుమరుగు చేయాలన్న యోచనతో ఉన్న బీజేపీ.. లెప్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి రేఖా గుప్తా CAG నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకొచ్చిన మద్యం పాలసీ వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 2వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్నది నివేదిక సారాంశం. ప్రజల ముందు ఆప్‌ను దోషిగా నిలపడమే బీజేపీ ముందున్న లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే తాము కూడా తక్కువేం కాదన్నట్లుగా.. అధికార పక్షానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఆప్ నేతలు సన్నద్ధమవుతున్నారు.
ఆప్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌తో మొదలు..
ముఖ్యమంత్రి రేఖా(Delhi CM Rekha Gupta) గుప్తా కార్యాలయంలో అంబ్కేదర్, భగత్ సింగ్ చిత్రపటాలను తొలగించి ప్రధాని మోదీ చిత్రపటాన్ని ఉంచడంపై ఆప్ నేతలు అసెంబ్లీ ప్రశ్నించారు. అంబేద్కర్ కంటే మోదీ గొప్పవ్యక్తా అని నిలదీసిన ప్రతిపక్ష నేత అతిశీ సహా 15 మంది ఆప్ ఎమ్మెల్యేలను ఫిబ్రవరి 25 (మంగళవారం) అసెంబ్లీ సమావేశాల నుంచి స్పీకర్ విజేందర్ గుప్తా సస్పెండ్ చేశారు.
"ఇదేనా ప్రజాస్వామ్యం?"
"అసెంబ్లీ ప్రారంభ సమావేశాల్లో ఇంతమంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం మీరు ఎప్పుడైనా చూశారా? మేం ఒక ప్రశ్న మాత్రమే అడిగాం - ముఖ్యమంత్రి కార్యాలయం సహా ఇతర కార్యాలయాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్ చిత్రాలను తీసేసి, ప్రధాని మోదీ ఫోటో పెట్టడాన్ని ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది? సభ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేయడమే ఈ ప్రశ్నకు సమాధానామా?," అని సస్పెండ్ అయిన 15 మంది ఎమ్మెల్యేలలో ఒకరైన ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా ప్రశ్నించారు.
"పార్లమెంట్‌లో చేసిందే అసెంబ్లీలో చేస్తున్నారు"
"బీజేపీ గతంలో పార్లమెంట్‌లో 150 మంది ఎంపీలను సస్పెండ్ చేసి విపక్ష గళాన్ని అణచివేయాలని చూసింది. ఇప్పుడు అదేతీరును అసెంబ్లీలో అనుసరిస్తున్నారు. విపక్షం నోరుమూయించి, సభను తాము కోరుకున్నట్లుగా నడిపించాలనుకుంటున్నారు," అని సంజీవ్ ఝా ఆరోపించారు.
ఆప్ మరో వ్యూహం..
అసెంబ్లీలో తమ గళాన్ని వినిపించేందుకు బీజేపీ అనుమతించదని భావించిన ఆప్ ఎమ్మెల్యేలు.. మరో వ్యూహానికి సిద్ధమయ్యారు. రైతు ఉద్యమాల మాదిరిగా ప్రభుత్వ పాలన విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు చేపట్టడం ద్వారా తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఒక సీనియర్ ఆప్ నేత చెప్పారు.
అక్కడ కుదరకపోతే ఇక్కడ నిలదీస్తాం..
"మేం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. కానీ మునిసిపల్ కార్పొరేషన్‌లో (MCD)లో మాకు మెజారిటీ ఉంది. ఎన్నికల హామీలను నెరవేర్చని బీజేపీ అసమర్థ పాలనను అక్కడ నిలదీస్తాం. మా హయంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ‘ఢిల్లీ మోడల్’ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు MCD మోడల్‌ను కూడా అందరూ మెచ్చుకునేలా చేస్తాం" అని MCD ఆప్ నేత ముఖేష్ గోయెల్ అన్నారు.
"బీజేపీ హామీలే ఖాళీ"
ఢిల్లీ ఖజానా ఖాళీగా ఉందని ఇటీవల ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేసిన వ్యాఖ్యలను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ కూడా ఢిల్లీ ఆర్థిక పరిస్థితిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఈ వాదనకు మరింత ఊతమిచ్చింది. రేఖా గుప్తా వ్యాఖ్యలపై ఆప్ మాజీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ స్పందించారు. "బీజేపీ గెలిచి నెల రోజులు కూడా కాలేదు. కానీ గవర్నర్, సీఎం ఎన్నికల హామీలను అమలు చేయకుండానే, తప్పించుకునేందుకు కారణాలను వెదుకుతున్నారు. ఆదాయపరంగా ఢిల్లీ ఎప్పుడూ నష్టాల్లో లేదని అందరికీ తెలుసు. మా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలన్నీ రికార్డుల రూపంలో ఉన్నాయి. వాటిని పరిశీలించుకోవచ్చు. మరి ఖజానా ఖాళీ అయ్యిందని సీఎం ఎలా చెప్పగలరు? నిజానికి ఖాళీగా ఉన్నవి వాళ్ల హామీలే. అధికారంలోకి రాగానే నెలకు రూ. 2,500 భత్యం అందజేస్తామని ప్రకటించారు. కాని నేటికీ అమలు చేయలేదు," అని పాఠక్ గుర్తుచేశారు.
"లెప్ట్‌నెంట్ గవర్నర్ తన అసెంబ్లీ ప్రసంగంలో బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నింటినీ పునరావృతం చేశారు – పెన్షన్ పెంపు, రూ.500కు LPG సిలిండర్ మొదలైనవి. కానీ వాటిని ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టత లేదు. బీజేపీ మోసపూరిత హామీలను ఢిల్లీ ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తాం. అమలు చేయించేందుకు నిరసనలకు పూనుకుంటాం," అని ఆప్ ప్రధాన కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన దుర్గేష్ పాఠక్ హెచ్చరించారు.
తొలినాళ్ల ఉద్యమ విధానాన్ని అనుసరించాల్సిందేనా?
బీజేపీని ధీటుగా ఎదుర్కోవాలంటే.. తొలినాళ్ల ఉద్యమ విధానాన్ని తిరిగి అనుసరించాల్సి ఉంటుందని ఆప్ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ భవిష్యత్ ప్రణాళిక గురించి ఓ కీలక ఆప్ నేత మాట్లాడుతూ.. "ఢిల్లీ ప్రజలు మాకు ప్రతిపక్షంలో కూర్చునే బాధ్యత అప్పగించారు. అయితే నిజమైన ప్రతిపక్షం ఎలా ఉంటుందో చూపిస్తాం. కాంగ్రెస్ పార్టీలా కేవలం ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టడం, నిరసన ర్యాలీలు నిర్వహించడం మాత్రమే ప్రతిపక్షం బాధ్యత కాదు. ఒక ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ మాది. మళ్లీ మా మూలాలకు వెళ్తాం. క్షేతస్థాయితో జనంతో ఉంటాం. అదే AAPను పునర్నిర్మించేందుకు సరైన మార్గం," అని చెప్పారు.
ప్రభుత్వానికి మద్దతివ్వాల్సిన అవసరం ఉన్నపుడు మద్దతు ఇస్తామని, కానీ ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తితే ప్రతిఘటిస్తామని ఆప్ స్పష్టం చేసింది.