
బీజేపీ వెనుకబాటుకు బుల్డోజర్ రాజకీయాలే కారణమా?
గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ద్వారక, పోర్‌బందర్, చోటా ఉదేపూర్ జిల్లాల్లో బీజేపీ వెనకబాటుకు ఇళ్లు, జీవనోపాధి కోల్పోయిన ముస్లిం మత్స్యకారులే కారణమా?
బుల్డోజర్ రాజకీయాల(Bulldozer Politics) కారణంగా గుజరాత్(Gujarat)లో బీజేపీ(BJP)కి ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు కనిపిస్తోంది. గత వారంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ పార్టీ భారీ విజయం సాధించింది. 2,178 స్థానాలకు 1,600 స్థానాలు గెలుచుకున్నా.. కంచుకోటగా భావించే ద్వారక జిల్లాలో ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. ఈ జిల్లాలో మొత్తం 28 స్థానాల్లో కాంగ్రెస్ 15, ఆప్ 13 స్థానాలు గెలుచుకున్నాయి. ఈ ఫలితాలకు ప్రధాన కారణం బీజేపీ చేపట్టిన బుల్డోజర్ రాజకీయాలు. గతంలో బీజేపీ కమ్యూనల్ విధానాన్ని తేలికగా తీసుకున్నా.. ఈసారి మాత్రం తాము బలికావడాన్ని మత్స్యకార ముస్లిం సమాజం (Muslim fishermen) జీర్ణించుకోలేకపోయింది.
తిరగబడ్డ ద్వారక..
సౌరాష్ట్ర ప్రాంతంలోని తీరప్రాంత జిల్లా ద్వారక. ముఖ్యమైన హిందూ మతపరమైన కేంద్రం కూడా. ఈ జిల్లాలో అరేబియా సముద్ర తీరంలోని చిన్న పట్టణం సాలాయాలో ముస్లింల జనాభా 45%. OBC కులానికి చెందిన కోళి పటేళ్లు 10% ఉండగా, అదే సామాజిక వర్గానికి చెందిన ఖర్వాలదే మెజార్టీ. ఈ ప్రాంతంలో కాంగ్రెస్, ఆప్ పార్టీల బలమైన ముస్లిం అభ్యర్థులు గెలుపొందగా.. బీజేపీ తరఫున బరిలో దిగిన ఖర్వా వర్గానికి చెందిన అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు.
పోర్‌బందర్‌లోనూ ఎదురుదెబ్బ..
ద్వారకతో పాటు పోర్‌బందర్, చోటా ఉదేపూర్ జిల్లాల్లో కూడా బీజేపీ వెనకబడి పోయింది. పోర్‌బందర్‌లో 24 స్థానాలకుగాను బీజేపీ కేవలం 10 గెలుచుకోగా, సమాజ్‌వాదీ పార్టీ (SP) 14 స్థానాలు గెలుచుకోవడం గమనార్హం. SP ఈ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేయగా.. చోటా ఉదేపూర్‌లో ఆశ్చర్యకరంగా 6 స్థానాలు గెలుచుకుంది. ఈ జిల్లాలో మొత్తం 28 స్థానాల్లో బీజేపీ 8, కాంగ్రెస్ 1, బీఎస్పీ 4, స్వతంత్రులు మిగిలిన స్థానాలు గెలుచుకున్నారు.
భారీ విధ్వంసమే కారణం..
బీజేపీ 2022 ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టోలో.. "ఒక నిర్దిష్ట సమాజం అక్రమ ఆక్రమణలను తొలగించేందుకు పని చేస్తున్నాం" అని పేర్కొంది. రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంగవి 2023 జనవరిలో గుజరాత్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. "మేము ఇచ్చిన హామీ మర్చిపోలేదు. ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ బుల్డోజర్ మీ కోసం వస్తోంది" అని ప్రకటించారు.
ముస్లింలే లక్ష్యంగా?..
ద్వారక జిల్లాలో 2025 జనవరిలో ముగిసిన భారీ విధ్వంసం కారణంగా దాదాపుగా 1,200 ఇళ్లు, మత్స్యకారుల పడవలు ధ్వంసమయ్యాయి. 2022 నుంచి 36 మతపరమైన స్థలాలు, 9 దర్గాలు, 3 మసీదులు, ముస్లిం మత్స్యకారుల దుకాణాలను నేలమట్టం చేశారు. ఈ విధ్వంసంలో ప్రాచీన చారిత్రక వారసత్వ సంపదగా భావించే 1,200 ఏళ్ల నాటి హజ్రత్ పీర్ గుంజ్ దర్గాను ధ్వంసం చేశారు.
ఇంకెందుకు బీజేపీకు ఓటు వేయాలి?
స్థానిక మత్స్యకారుడు ఇబ్రాహీం పటేలియా మాట్లాడుతూ.. “ఇన్నేళ్లుగా బీజేపీకి ఓటు వేసిన మా ఇళ్లనే చివరికి తొలగించారు. మా పడవలు, వలలను నాశనం చేశారు. 2023 ఎన్నికల్లో మా పేర్లు ఓటర్ లిస్టులోనే లేకుండా చేశారు. ఏడాది పాటు పోరాడి మా డాక్యుమెంట్లు తిరిగి పొందాం. ఇలా చేసిన బీజేపీ ఎందుకు మద్దతు ఇవ్వాలి?” అని ప్రశ్నించారు.
పోర్‌బందర్‌లో నిరాశ్రయత్వం..
2022 మార్చిలో బీజేపీ ప్రభుత్వం పోర్‌బందర్‌లో రెండో దశ విధ్వంసాన్ని ప్రారంభించింది. గోసాబ్రా గ్రామాన్ని రాత్రికి రాత్రి నేలమట్టం చేసింది. ఈ ఊరికి చెందిన 300 ముస్లిం మత్స్యకార కుటుంబాలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి సామూహిక మరణానికి అనుమతి కోరారు. కానీ కోర్టు వారి పిటీషన్‌ను విచారణకు తిరస్కరించి.. “అసంబద్ధ పిటిషన్ వేశారని” వారికి జరిమానా విధించింది.
పెరుగుతున్న వ్యతిరేకత..
గుజరాత్ మత్స్యకార సంఘం మాజీ అధ్యక్షుడు జీవన్ జుంగి మాట్లాడుతూ.. "2022లో విధ్వంసం ప్రారంభమైనప్పటి నుంచి మా ముస్లిం కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. గుజరాత్‌లో మత్స్యకార వ్యవస్థ పురాతన కాలం నుంచి ఒక ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తోంది. తరతరాలుగా ఖర్వాలు ఉత్తమ తాండేళ్లు (ట్రాలర్‌లో చేపలు పట్టే నిపుణులు)గా గుర్తింపు పొందారు. కోళీలు తాండేళ్లకు సహాయకులుగా పనిచేస్తారు. ఈ రంగంలో ఎక్కువ మంది సాంకేతిక నిపుణులు ముస్లిం సమాజానికి చెందినవారే,’’ అని చెప్పారు.
గుజరాత్‌లోని మత్స్యకారులను మూడు వర్గాలుగా విభజించారు – ఖర్వాలు, కోళీలు, ముస్లింలు.ఖర్వాలు ప్రధానంగా సముద్ర మత్స్యకారులుగా ఉంటారు. కోళీలు తక్కువ సంఖ్యలో ఉండి, చేపల వేటలో నిమగ్నమై ఉంటారు. ముస్లిం మత్స్యకారులు చిన్న పడవలతో లోతు తక్కువ ప్రాంతాల్లో చేపలు పట్టడంతో పాటు వల కట్టడం, చేపల శుభ్రపరచడం వంటి పనులు చేస్తారు.
జీవనోపాధి కోల్పోయిన ముస్లిం మత్స్యకారులు
"ముస్లింలను పంపించేయడంతో వారు తమ పనిముట్లతో వెళ్లిపోయారు. చేతిలో పరికరాలేని సాంకేతిక నిపుణుడిని ఎవరు ఉద్యోగంలోకి తీసుకుంటారు? నేను కొంతమంది సహాయకులతో పని నెట్టుకొస్తున్నా. కానీ సముద్రం మధ్యలో ఇంజిన్‌లో ఏదైనా సమస్య తలెత్తితే ఈ సహాయకులు ఎంత మాత్రమూ ఉపయోగపడరు. వాళ్లు తిరిగి వస్తారని ఎదురుచూశాం. ఇటు ఇల్లు లేక అటు ఆదాయ మార్గం లేక వాళ్లు తాత్కాలిక పనులు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి మొత్తం సౌరాష్ట్ర మత్స్యకార రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. బీజేపీపై తీవ్ర వ్యతిరేకతకు చూపింది." అని జుంగి పేర్కొన్నారు.
మొత్తంగా బీజేపీ చేపట్టిన బుల్డోజర్ రాజకీయాలు గుజరాత్‌లో భారీ ప్రభావం చూపాయి. ముస్లిం మత్స్యకారులు తమ ఇళ్లను, పడవలను కోల్పోయి బీజేపీకి వ్యతిరేకంగా మారిపోయారు. దీనివల్ల ద్వారక, పోర్‌బందర్, చోటా ఉదేపూర్ జిల్లాల్లో భాజపా ఘోర పరాజయం పాలైంది.