
2027 ఎన్నికల్లో ఒంటరిగానే..
BSP చీఫ్ మాయవతి వెల్లడి..
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయవతి (Mayawati) సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో 2027 జరిగే అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. అంతేకాదు, పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం (జనవరి 15) తన 70వ పుట్టినరోజు సందర్భంగా లక్నోలో ఆమె విలేఖరులతో మాట్లాడారు.
వచ్చే ఎన్నికలలో ఏ కూటమితోనూ జతకట్టకుండా, ఒంటరిగా వెళ్లడమే మంచిదని పార్టీ నిర్ణయించిందని చెప్పారు. గతంలో నాలుగుసార్లు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ..2027 ఎన్నికలలో ప్రజలు మరోసారి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారని, ఐదోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పారు.
గత ప్రభుత్వాలు బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌ను నిర్లక్ష్యం చేశాయని, కనీసం ఆయన మరణించిన రోజును సంతాపం దినంగా ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకులు ముస్లింలు, ఇతర వర్గాలను చిన్నచూపు చూశారని, అదే బీఎస్పీ పాలనలో ఎలాంటి మతపర అల్లర్లు జరగలేదని, యాదవులతో సహా అన్ని వర్గాలను జాగ్రత్తగా చూసుకున్నామని గుర్తుచేశారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు.
అంతకుముందు రోజు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మాయావతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మాయవతి ఆయురారోగ్యాలతో జీవించాలని ఆదిత్యనాథ్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

