
బీఎంసీ ఎన్నికలు: 11.30 గంటల వరకు 17.7 శాతం పోలింగ్
3.48 కోట్ల మంది ఓటర్లు - 2,869 స్థానాలు - 15,931 మంది అభ్యర్థులు..
మహారాష్ట్ర(Maharashtra) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల (Maharashtra civic polls)కు గురువారం ఓటింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 29 మున్సిపల్ కార్పొరేషన్లలోని 2869 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7:30 గంటలకు ప్రారంభమయిన పోలింగ్ సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతోంది. మొత్తం 3.48 కోట్ల మంది ఓటర్లు 15,931 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు గట్టి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ముంబై అంతటా 25 వేల మందికి పైగా సిబ్బందిని మోహరించారు. జనవరి 16వ తేదీ శుక్రవారం ఓట్ల లెక్కింపు జరగనుంది.
17.73 శాతం పోలింగ్..
ఉదయం 11.30 గంటల వరకు పోలింగ్ శాతం 17.73గా నమోదయ్యింది. తాజా సమాచారం ప్రకారం.. తూర్పు శివారు ప్రాంతాల్లోని వార్డు నంబర్ 114లో అత్యధికంగా 26.31 శాతం, దక్షిణ ముంబైలోని వార్డు నంబర్ 227లో అత్యల్పంగా 6.23 శాతం పోలింగ్ నమోదైంది. ఇతర వార్డులలో 23 శాతం కంటే ఎక్కువ మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ శాతం సింగిల్ డిజిట్‌లోనే ఉంది. ఓట్ల లెక్కింపు జనవరి 16న జరుగుతుంది.
రూ. 74,400 కోట్లకు పైగా వార్షిక బడ్జెట్ ఉన్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికలు తొమ్మిది సంవత్సరాల తర్వాత జరుగుతున్నాయి.
తిరిగి కలిసిన సోదరులు..
బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమితో ఓడించాలని థాకరే సోదరులు ఏకమయ్యారు. మరాఠా ఓటర్లను ఏకం చేసేందుకు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత శివసేన (UBT), MNSకి నాయకత్వం వహిస్తున్న సోదరులయిన ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే ఇటీవల చేతులు కలిపారు. 2022లో శివసేన రెండుగా విడిపోయిన తర్వాత జరుగుతున్న మొదటి BMC ఎన్నికలు ఇవి. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ షిండే, ఆ పార్టీ ఎమ్మెల్యేలలో ఎక్కువ మందితో శివసేన నుంచి విడిపోయి BJPతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ రాష్ట్ర రాజధానిలో ప్రకాష్ అంబేద్కర్ వంచిత్ బహుజన్ అఘాడి (VBA), రాష్ట్రీయ సమాజ్ పక్ష్‌తో చేతులు కలిపి తమ అభ్యర్థులను రంగంలోకి దింపింది.

