బీజేపీకి తొలి మహిళా జాతీయ అధ్యక్షురాలు? రేసులో ఉన్నదెవరు?
x
Nirmala Sitharaman, Vanathi Srinivasan, D Purandeswari

బీజేపీకి తొలి మహిళా జాతీయ అధ్యక్షురాలు? రేసులో ఉన్నదెవరు?

మహిళలను అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని సంకేతాలిస్తోన్న కాషాయ పార్టీ..


ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త చీఫ్‌ల నియామకం పూర్తవడంతో.. కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై పార్టీ అధిష్టానం దృష్టిపెట్టింది. ప్రస్తుతం అధ్యక్షుడిగా జేపీ నడ్డా(JP Nadda) కొనసాగుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి 2020 నుంచి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నడ్డా పదవీకాలం జనవరి 2023తోనే ముగిసిపోయింది. అయితే గతేడాది లోక్‌సభ ఎన్నికల ఉండడంతో పార్టీని మార్గనిర్దేశం చేయడానికి ఆయన పదవీకాలాన్ని పొడిగించింది. అయితే ఈ సారి అధ్యక్ష పదవి మహిళకు కేటాయిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తు్న్నాయి. ఆ లెక్కన రేస్‌లో నిర్మలా సీతారామన్, వానతి శ్రీనివాసన్, డి పురందేశ్వరి ఉన్నట్లు తెలుస్తోంది.


బీజేపీ (BJP) ప్లాన్ ఏంటి?

మహిళా ఓటర్లను ప్రభావితం చేయడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో కాషాయ పార్టీ విజయం వెనక వారే ప్రముఖ పాత్ర పోషించారు. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెచ్చిన మహిళా బిల్లును 2023లో పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి కూడా. పార్టీ అధ్యక్ష స్థానానికి ఈ సారి మహిళను నియమించడం ద్వారా తాము మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్న సంకేతాలను పంపుతోంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కూడా ఇందుకు ఆమోదించినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతానికి ముగ్గురు మహిళలు రేస్‌లో ఉన్నారు.


1. నిర్మలా సీతారామన్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) జాతీయ అధ్యక్ష పదవికి అన్ని విధాల సరైన వ్యక్తి అని భావిస్తున్నారు. 2019 నుంచి ఆర్థిక మంత్రిగా ఉన్న సీతారామన్‌కు గతంలో రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఆమెకు కలిసొచ్చే మరో అంశం ఏమిటంటే.. సీతారామన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. తమిళనాట పార్టీ పుంజుకోవాల్సి అవసరం కూడా ఉంది. ఇటీవలే పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుత అధ్యక్షుడు నడ్డా, ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్‌తో నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు కూడా.

2. వానతి శ్రీనివాసన్ : తమిళనాడుకు చెందిన వానతి శ్రీనివాసన్ (Vanathi Srinivasan) ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. 1993 నుంచి పార్టీలో ఉన్నారు. 2022లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా నియమితులయ్యారు. 2021లో ఆమె కోయంబత్తూరు (సౌత్) అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. మక్కల్ నీది మైయం (MNM) వ్యవస్థాపకుడు నటుడు కమల్ హాసన్‌ను ఓడించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన వానతి.. పార్టీలో రాష్ట్ర కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, తమిళనాడు పార్టీ యూనిట్ ఉపాధ్యక్ష పదవులు కూడా అలంకరించారు.

3. దగ్గుబట్టి పురందేశ్వరి : ఈమె ఉమ్మడి ఏపీలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (TDP) వ్యవస్థాపకుడు NT రామారావు కూతురు. బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షురాలయిన ఈమె..ప్రస్తుతం రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత వివిధ దేశాలను సందర్శించిన వివిధ పార్టీ ప్రతినిధుల బృందంలో ఈమె కూడా ఉన్నారు. ఐదు భాషలు మాట్లాడగల పురందేశ్వరి(D Purandeswari) కూచిపూడి నృత్యకారిణి కూడా.

Read More
Next Story