‘కేంద్రంలో బీజేపీ 30 ఏళ్లు అధికారంలో ఉంటుంది’
x

‘కేంద్రంలో బీజేపీ 30 ఏళ్లు అధికారంలో ఉంటుంది’

‘‘పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ వలసదారులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటోంది. దానికి కేంద్రం అంగీకరించదు.’’ - అమిత్ షా


కేంద్రంలో భారతీయ జనతా పార్టీ(BJP) 30 ఏళ్లు అధికారంలో ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి టైమ్స్ నౌ సమ్మిట్ 2025లో ఆయన మాట్లాడారు. "నేను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. రాబోయే 30 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉంటుందని చెప్పాను. ఇప్పుడు అందులో పదేళ్లు మాత్రమే గడిచిపోయాయి" అని చెప్పారు.

పార్టీల పనితీరు గురించి మాట్లాడుతూ.. ‘‘పార్టీ మనుగడ ఆ పార్టీ నాయకుల చేసిన పనుల మీద ఆధారపడి ఉంటుంది. బాగా పనిచేస్తే ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారు. వారు మాత్రమే ఎన్నికల్లో గెలుస్తారు. కష్టపడని వారు గెలుపు మీద ఆశలు వదులుకోవాల్సిందే," అని పేర్కొన్నారు.

యూనిఫాం సివిల్ కోడ్(UCC) గురించి అడిగినప్పుడు.. ‘‘ప్రజలకు చెప్పింది చేసి చూపించడం మా పార్టీ విధానం. ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని చెప్పాం. చేసి చూపాం. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తామని చెప్పాం. అలాగే చేశాం. యూసీసీ పార్టీ అజెండాలో కీలకమైన అంశం. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే యుసీసీని అమల్లో పెట్టింది. బీజేపీ పాలిత అన్ని రాష్ట్రాలు త్వరలో దీన్ని అమల్లోకి తెస్తాయి." అని సమాధానమిచ్చారు.

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ(Yashwant Varma) అధికారిక నివాసంలో భారీ మొత్తంలో నగదు దొరికినట్లు ఆరోపణలు రావడంపై అడిగిన ప్రశ్నకు ..‘‘ ఈ విషయంలో ఇప్పటికే సుప్రీం చీఫ్ జస్టిస్ స్పందించారు. విచారణకు ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు’’ అని బదులిచ్చారు.

నక్సలైట్ల సమస్య, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం, ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు.. ఈ మూడు కేంద్ర హోంమంత్రిగా ఉన్న తనకు వారసత్వంగా వచ్చాయని చెబుతూ..వీటి కారణంగా ఆ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందని, శాంతియుత వాతావరణం తీసుకురావడం తన కర్తవ్యమని చెప్పారు.

ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టంపై ప్రభుత్వ వైఖరి గురించి అడిగినప్పుడు..

‘‘అది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశం. తగిన ఉత్తర్వులు జారీ చేస్తుందని భావిస్తున్నాం. కోర్టు ఆదేశాల్ని కచ్చితంగా పాటిస్తాం" అని సమాధానమిచ్చారు.

ఈ చట్టాన్ని సవాలు చేస్తూ ఇప్పటికే దాఖలయిన చాలా పిటిషన్లను సుప్రీం విచారిస్తోంది.

అయితే అఫిడవిట్‌ను ప్రభుత్వం ఎందుకు ఫైల్ చేయలేదని అడిగిన ప్రశ్నకు.. "ఖచ్చితంగా ఫైల్ చేస్తాం," అని బదులిచ్చారు.

పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో అక్రమ వలసల గురించి చెబుతూ.. తృణమూల్ కాంగ్రెస్(TMC) ప్రభుత్వం అక్రమ వలసదారులను తమ పార్టీ ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. అలా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదని బదులిచ్చారు.

Read More
Next Story