
బెడిసికొట్టిన బాబాయ్ - అబ్బాయి వ్యూహం..
పూణే, పింప్రి చించ్వాడ్ మున్సిపాలిటీల్లో ఆధిక్యంలో బీజేపీ..
మహారాష్ట్ర(Maharashtra) మున్సిపల్ ఎన్నికలలో (Municipal Civic polls) అజిత్ పవార్(Ajit Pawar), శరద్ పవార్(Sharad Pawar) వ్యూహాత్మక పొత్తు బెడిసికొట్టింది. పాలక మహాయుతి కూటమిలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న ఎన్‌సీపీ(అజిత్ పవార్)..ఎన్‌సీపీ (ఎస్‌పీ)తో పొత్తు పెట్టుకుని పూణే, పింప్రి చించ్వాడ్ మున్సిపల్ ఎన్నికలలో ఉమ్మడిగా పోటీ చేశారు. అయితే బాబాయ్ - అబ్బాయి ఉమ్మరి పోరు పెద్దగా ప్రభావం చూపలేదు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు.. 165 మంది సభ్యులున్న పూణే మున్సిపాలిటీలో బీజేపీ(BJP) ఆధిక్యంలో ఉంది. 29 వార్డులను గెలుచుకోగా, మరో 43 వార్డులలో ఆధిక్యంలో ఉంది. ఇక ఎన్‌సీపీ ఏడు వార్డుల్లో ఎన్‌సీపీ (ఎస్పీ) ఒక వార్డులో ఆధిక్యంలో ఉన్నాయి.
128 మంది వార్డు సభ్యులున్న పింప్రి-చించ్‌వాడ్‌లో బీజేపీ 81 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్‌సీపీ 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక పూణేలో కాంగ్రెస్ మూడు స్థానాలను గెలుచుకుని తొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన శివసేన (యుబిటి) ఇంకా ఖాతా తెరవలేదు.
2017 నుంచి 2022 వరకు పూణే, పింప్రి-చించ్వాడ్ మున్సిపాలిటీల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలోని కొల్హాపూర్, సతారా, సోలాపూర్, సాంగ్లి మున్సిపాలిటీల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
పూణే, పింప్రి చించ్వాడ్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్, బీజేపీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రెండు మున్సిపాలిటీలలో జరిగిన అవకతవకలపై అజిత్ పవార్ స్థానిక బీజేపీ నాయకత్వంపై కోపం పెంచుకున్నారు. దాంతో బీజేపీతో కాకుండా బాబాయ్ షరత్ పవార్‌తో కలిసి పోటీ చేశారు.
102 మంది సభ్యులున్న షోలాపూర్ మునిసిపల్ కార్పొరేషన్‌లో మధ్యాహ్నం వరకు బీజేపీ 60 వార్డుల్లో ముందంజలో ఉంది. ఇటు 81 మంది సభ్యులున్న కొల్హాపూర్ మున్సిపాలిటీలో మహాయుతి భాగస్వాములు - బీజేపీ, శివసేన, ఎన్‌సిపి - 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి 21 వార్డులలో ఆధిక్యంలో ఉంది.

