
రాహుల్ జర్మనీ పర్యటనపై బీజేపీ నేతల సెటైర్లు..
కాషాయ పార్టీ నేతలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన ప్రియాంక ..
పార్లమెంట్(Parliament) లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) జర్మనీ వెళ్తున్నారు. డిసెంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు ఆయన బెర్లిన్‌లో పర్యటించనున్నారు. అక్కడ జర్మన్ అధికారులను కలవనున్నారు. భారతీయ ప్రవాసులతో సమావేశం కానున్నారు.
అయితే రాహుల్ విదేశీ పర్యటనకు బీజేపీ(BJP) నేతలు తప్పుబడుతున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయన బెర్లిన్ వెళ్లడంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
‘‘రాహుల్ ఓ పర్యాటక నాయకుడు..’’
బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవాలా(Shehzad Poonawalla) రాహుల్ గాంధీని "పార్టీ నాయకుడు, పర్యాటక నాయకుడు"గా అభివర్ణించారు. ‘‘రాహుల్ సీరియస్ లెస్ పొలిటీషియన్. ప్రజలు పని చేస్తుంటే ఆయన మాత్రం సెలవుల్లో ఉంటారు. బీహార్ ఎన్నికల సమయంలో రాహుల్ జంగిల్ సఫారీలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన జర్మనీకి ఎందుకు వెళ్తున్నాడో నాకు తెలియదు. బహుశా భారతదేశం గురించి వ్యతిరేక భావాజాలాన్ని వ్యాప్తి చేయడానికి కావచ్చు." అని ఎక్స్‌లో పోస్టు చేశారు.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా రాహుల్‌ను విమర్శించారు. ‘‘పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆయన విదేశానికి వెళ్తున్నారు. ఆ తర్వాత నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆయనే ఫిర్యాదు కూడా చేస్తారు. ఆయన ఓ పార్ట్‌టైమ్ పొలిటీషియన్" అని వ్యాఖ్యానించారు.
ప్రియాంక ఎదురుదాడి..
తన సోదరుడు రాహుల్ గాంధీని బీజేపీ నేతలు ఎగతాళి చేసి మాట్లాడటాన్ని ప్రియాంక(Priyanka) గాంధీ సహించలేకపోయారు. ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ(PM Modi) విదేశీ పర్యటనల గురించి ప్రస్తావించారు. "మోదీ గారు తాను పనిచేయాల్సిన రోజుల్లో దాదాపు సగం రోజులు విదేశాల్లోనే గడుపుతారు. అలాంటప్పుడు ప్రతిపక్ష నాయకుడి పర్యటనను ఎందుకు తప్పుబడుతున్నారు? అని పార్లమెంటు బయట విలేఖరులతో అన్నారు.
‘‘ఎన్నికల అక్రమాలపై రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు బీజేపీ, ప్రధాని వద్ద సమాధానాలు లేదు. అలాంటప్పుడు ఆయన పర్యటన గురించి మాట్లాడాల్సిన హక్కు కూడా వారికి లేదు.’’ అని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఎదురుదాడికి దిగారు.
"రాహుల్ పర్యటన యూరప్ అంతటా ఉన్న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షులను ఒకచోట చేర్చుతుంది. కీలక అంశాలను చర్చించడానికి ఆయనకు వేదికవుతుంది. పార్టీ బలోపేతం చేయడం, ఎన్నారై ఆందోళనలను పరిష్కారం చూపుతుంది" అని IOC( Indian overseas congress) ఎక్స్‌లో పోస్టు చేసింది.

