
బెంగాల్ ఎన్నికల్లో పెట్టుబడుల అంశమే బీజేపీ ఎన్నికల ప్రసారాస్త్రం..
సింగూర్ వేదికగా టీఎంసీపై దాడికి బీజేపీ వ్యూహం - రేపు ప్రధాని మోదీ భారీ ర్యాలీ..
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరగనున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్(West Bengal)లో రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(CM Mamata Banerjee) అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు తగ్గాయని బీజేపీ(BJP) భావిస్తోంది. ఇదే అంశాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా చేసుకోబోతుంది. టీఎంసీ(TMC)ని దెబ్బకొట్టేందుకు పరిశ్రమలు, ఉద్యోగాలు, విదేశీ పెట్టుబడులు అంశాలను జనం ముందుకు తెస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే ప్రధాని మోదీ(PM Modi) రేపు (జనవరి 18న) సింగూర్(Singur)లో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
సింగూర్ పేరు బెంగాల్ రాజకీయాల్లో ప్రత్యేకమైనది. టాటా నానో కార్ల కర్మాగారం ఏర్పాటు అంశంపై 2011లో జరిగిన ఉద్యమాలే మమతా బెనర్జీ అధికారానికి కట్టబెట్టాయి. 34 ఏళ్లపాటు పాలించిన కమ్యూనిస్టు ప్రభుత్వానికి బ్రేక్ ఇచ్చింది కూడా ఆ ఉద్యమమే. ఆ తర్వాత వారి ఉనికే ప్రశ్నార్థకమైంది.
2008లో టాటా గ్రూప్ నానో ప్రాజెక్టును సింగూర్ నుంచి గుజరాత్‌కు తరలించినప్పుడు.. అప్పటి సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ ఆ పరిశ్రమను స్వాగతించారు. ఇప్పుడు సింగూర్‌లో జరగబోయే ర్యాలీలో అదే అంశాన్ని ప్రధాని మళ్లీ గుర్తు చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. టాటా గ్రూప్ నానో ప్రాజెక్టును గుజరాత్‌లో ఏర్పాటు చేయడం వల్ల అక్కడి రైతులు, యువత పొందిన ప్రయోజనాలపై వీడియో ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.
మోదీ రెండు రోజుల బెంగాల్ పర్యటన..
ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం మాల్డాకు చేరుకోనున్నారు. అనంతరం హౌరా–గౌహతి వందే స్లీపర్ రైలు సేవలను ప్రారంభించనున్నారు. సింగూర్‌లో రూ.830 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్యతో పాటు పార్టీ నేతలు సింగూర్ పరిసర గ్రామాల్లో మోదీ రాక గురించి జోరుగా ప్రచారం చేస్తున్నారు. పారిశ్రామికీకరణ, అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి కల్పనపై పార్టీ ఆలోచనలను ప్రజలతో పంచుకుంటున్నారు.
‘‘టాటా లాంటి సంస్థ పరిశ్రమ పెట్టేందుకు ముందుకు వచ్చినా.. రాజకీయాల కారణంగా తరిమేశారు. మమతా పాలనలో బెంగాల్ పారిశ్రామికంగా పూర్తిగా వెనకబడి పోయింది’’, అని సమిక్ భట్టాచార్య విమర్శించారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే బడా పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు తిరిగి సింగూర్‌కు వస్తారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయని ప్రచారం చేస్తున్నారు.
గతంలో మమతకు బీజేపీ మద్దతు..
అయితే రాజకీయ పరిశీలకులు మరో కోణాన్ని గుర్తు చేస్తున్నారు. బుద్ధదేవ్ భట్టాచార్య హయాంలో భూసేకరణకు వ్యతిరేకంగా మమతా చేసిన ఉద్యమాలకు అప్పట్లో బీజేపీ కూడా మద్దతిచ్చింది. అప్పటి జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ టీఎంసీతో కలిసి ఆందోళనల్లో పాల్గొన్నారు.
ఆ సమయంలో టీఎంసీ ఎన్డీఏలో భాగస్వామి. ఆ కూటమి నుంచి గెలిచిన ఏకైక ఎంపీ కూడా మమతానే. తర్వాత రాజకీయ సమీకరణాలు మారి ఇరు పార్టీల మధ్య దూరం పెరిగింది. ఇప్పుడు అదే సింగూర్‌ను బీజేపీ తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తోంది.
మహారాష్ట్ర తర్వాత వెస్ట్ బెంగాలే..
బీజేపీ ఆరోపణలను కొంతమంది ఆర్థికవేత్తలు పూర్తిగా అంగీకరించడం లేదు. సేవల రంగం, రిటైల్, ఎంఎస్ఎంఈలు, పర్యాటకం వంటి రంగాల్లో బెంగాల్ వృద్ధి చూపుతోందని వారు చెబుతున్నారు. 2025–26 నాటికి రాష్ట్ర జీఎస్డీపీ సుమారు రూ.20.31 ట్రిలియన్లుగా అంచనా. ఉపాధిలో సేవల రంగం కీలక పాత్ర పోషిస్తోంది. 2024లో సుమారు 31 లక్షల మంది విదేశీ పర్యాటకులు బెంగాల్‌ను సందర్శించారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 15 శాతం ఎక్కువ. మహారాష్ట్ర తర్వాత ఎక్కువ విదేశీ పర్యాటకులు వచ్చే రెండో రాష్ట్రంగా బెంగాల్ నిలిచింది. ఇంజనీరింగ్ వస్తువులు, రత్నాలు, ఆభరణాలు, తోలు ఉత్పత్తుల ఎగుమతులు కూడా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతులు రూ.97,156 కోట్లకు చేరాయి.
ఎఫ్‌డీఐలలో వెనుకబాటు..
అయితే భారీ పరిశ్రమలు, విదేశీ పెట్టుబడుల విషయంలో టీఎంసీ ప్రభుత్వానికి విమర్శలు తప్పడం లేదు. డీపీఐఐటీ గణాంకాల ప్రకారం 2019 అక్టోబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు బెంగాల్‌కు వచ్చిన ఎఫ్‌డీఐలు కేవలం రూ.13,945 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాలు భారీగా పెట్టుబడులను ఆకర్షించాయి. మహారాష్ట్ర ఒక్కటే రూ.6.9 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం.. దేశంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బెంగాల్, ఎగుమతుల్లో మాత్రం 12వ స్థానంలో ఉంది. తయారీ రంగంలో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ ముందంజలో ఉండగా బెంగాల్ వెనుకబడిందని బీజేపీ విమర్శిస్తోంది.
పెద్ద ప్రాజెక్టులు లేకపోవడమే టీఎంసీకి ఇబ్బందికరం..
బీజేపీ ప్రచారంలో తరచుగా వినిపించే ప్రశ్న ఒక్కటే – మమతా పాలనలో ప్రారంభమైన ఒక్క పెద్ద పరిశ్రమ రిబ్బన్ కటింగ్ ఫొటో చూపించగలరా?
పెద్ద ప్రాజెక్టులు రాష్ట్రానికి రాలేదనే వాదనను బీజేపీ పదే పదే వినిపిస్తోంది. దీనికి ప్రతిగా టీఎంసీ..బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వలస కూలీలపై వేధింపులు జరుగుతున్నాయని ఆరోపిస్తోంది. బీజేపీ మాత్రం జాతీయత, ఉద్యోగాలు, పరిశ్రమల అంశాలను ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
మొత్తంమీద ఉద్యోగాలు లేక యువత వలస వెళ్లడానికి కారణం టీఎంసీనే అని ప్రచారం చేస్తోంది. ‘‘బెంగాల్ యువతకు మంచి భవిష్యత్తు కావాలంటే పరిశ్రమలు రావాలి. అవి రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి..’’ అంటూ కాషాయ పార్టీ నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

