బీహార్‌లో మహాఘట్‌బంధన్ వ్యూహం ఏమిటి?
x

బీహార్‌లో మహాఘట్‌బంధన్ వ్యూహం ఏమిటి?

ఖర్గే, రాహుల్‌తో తేజస్వి యాదవ్ భేటీ - ‘మహాఘట్‌బంధన్’ రథసారధి ఎవరు? బీహార్‌ ఎన్నికలలో కూటమి అజెండా ఏమిటి?


బీహార్‌ (Bihar) అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. గతంలోలాగే ఈ సారి కూడా కాంగ్రెస్ ఆర్జేడీతో పొత్తుకు సిద్ధమైంది. ఇప్పటికే నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమితో ఉన్న విషయం తెలిసిందే.

ఖర్గే, రాహుల్‌తో తేజస్వి భేటీ..

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge), లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని తేజస్వి యాదవ్ ఇటీవల ఢిల్లీలో కలిశారు. సుదీర్ఘంగా చర్చించారు. 2020లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రెండు పార్టీల నాయకులు చర్చించుకున్నట్లు సమాచారం. ఎన్డీఏ కూటమిని ఓడించడమే లక్ష్యంగా.. తేజశ్వికి కాంగ్రెస్ హైకమాండ్ ఫ్రీహ్యండ్ ఇచ్చినట్లు సమాచారం. అందులో భాగంగా ఈ సారి ఎన్నికలలో 2020 కంటే తక్కువ స్థానాల్లో పోటీచేసేందుకు కూడా కాంగ్రెస్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేసి 19 సీట్లను మాత్రమే గెలుచుకున్న విషయం తెలిసిందే. సీట్ల పంపకాలపై ఎలాంటి డిమాండ్ చేయవద్దని ఇప్పటికే రాహుల్ గాంధీ బీహార్ కాంగ్రెస్ నాయకులకు చెప్పినట్లు సమాచారం. ఎక్కువ స్థానాల్లో పోటీచేసి ఓడిపోవడం కంటే.. తక్కువ స్థానాల్లో పోటీచేసి గెలవడం మంచిదన్న అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.

కూటమి సారథి తేజశ్వినే..

మహాఘట్‌బంధన్ (Mahagathbandhan) కూటమి (గ్రాండ్ ఓల్డ్ పార్టీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ-ఎంఎల్ఎల్, వీఐపీ) సమన్వయ కమిటీకి నాయకత్వం వహించడానికి తేజశ్వి అంగీకరించినట్లు తెలుస్తోంది. "తేజశ్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా మేం అధికారికంగా ప్రకటించవచ్చు లేదా ప్రకటించకపోవచ్చు. కానీ సమన్వయ కమిటీకి ఆయన నాయకత్వం వహించేందుకు అందరూ అంగీకరించారు," అని ఆర్జేడీ సీనియర్ నాయకుడు ది ఫెడరల్‌తో అన్నారు.

అదే మా ఎన్నికల అజెండా..

ఢిల్లీ నుంచి వచ్చాక గురువారం మహాఘట్బంధన్ నాయకులతో తేజస్వి సమావేశమయ్యారు. అది ముగియగానే ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. “ఇది మా మహాఘట్బంధన్ నాయకుల మొదటి సమావేశం. పేదరికం, నిరుద్యోగం, వలసలకు ఎన్నికల ప్రచారంలో లేవనెత్తాలని మేం ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాం. 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వంపై బీహార్ ప్రజలకు చాలా కోపం ఉంది. ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసేందుకు మా కూటమి అంగీకరించింది. ఎన్నికల అజెండాను కూడా ఏకగ్రీవంగా రూపొందిస్తాం,” అని చెప్పారు.

సీట్ షేరింగ్‌పై జరగని చర్చలు..

"అయితే మహాఘట్బంధన్ నాయకుల సమావేశంలో సీట్ల పంపకాలపై ఎలాంటి చర్చలు జరగలేదు" అని కొందరు చెప్పారు. సమన్వయ కమిటీ ఏర్పడిన తర్వాత, రెండు, మూడు మాసాల్లో సీట్ల పంపకాలపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా కాకుండా.. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించడానికి ముందే అన్ని మిత్రపక్షాలు ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలనుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారానికి సంబంధించి సమన్వయ కమిటీ బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.

RLJP కలిసి వస్తుందా?

అధికార JD (U), BJP, లోక్ జనశక్తి పార్టీ - రామ్ విలాస్ (LJP-RV) పోటీచేసే నియోజకవర్గాల్లో మహాఘట్బంధన్‌ గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (RLJP) అధినేత పశుపతి పరాస్‌ను తమ కూటమిలోకి తీసుకోవడం గురించి కూడా గురువారం జరిగిన సమావేశంలో కూటమి సీనియర్ నాయకులు చర్చించారు. ప్రముఖ దళిత నాయకుడు దివంగత రాంవిలాస్ పాశ్వాన్ తమ్ముడు పరాస్‌ను కూటమిలోకి తీసుకోవడం వల్ల దళితుల ఓట్లు, అలాగే పాశ్వాన్ కమ్యూనిటీ ఓటర్లను తమవైపు తిప్పుకోవాలన్న ఆలోచనలో ఉంది మహాఘట్‌బంధన్.

LJP అసలైన వారసుడు చిరాగే..

మొన్నటి వరకు పరాస్ NDAలో భాగంగా ఉన్నాడు. కానీ గత జూన్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయంతో విభేదాలు తలెత్తడంతో ఆయన పాలక సంకీర్ణం నుంచి వైదొలిగారు. దాంతో బీజేపీ పరాస్ కంటే రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుని, లోక్‌సభ ఎన్నికల్లో LJP-RVకి ఐదు సీట్లు ఇచ్చింది. ఆ స్థానాలన్నింటిని LJP-RV క్లీన్ స్వీప్ చేయడంతో తన తండ్రి రాజకీయ వారసత్వానికి నిజమైన వారసుడు చిరాగేనని నిరూపితమైంది.

దళితులను ఆకర్షించగలరా?

బీహార్ ఓటర్లలో దళిత ఓటర్లు 19.5 శాతం ఉన్నారు. పాశ్వాన్ కమ్యూనిటీ ఐదు శాతానికి పైగా ఉంది. ఎల్‌జేపీ-ఆర్‌వీ, జేడీ(యూ), బీజేపీ నుంచి షెడ్యూల్డ్ కులాల ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలన్ని ఆలోచనలో ఉంది మహాఘట్‌బంధన్.

గతంలో యాదవుల నుంచి దళితులు అణచివేతకు గురయ్యారు. ఆ కారణంగానే దళిత ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం లాలూ యాదవ్ పార్టీకి కష్టమని సీనియర్ ఆర్జేడీ నాయకులు అంగీకరించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ బీహార్ యూనిట్ చీఫ్‌గా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కుటుంబ్ ఎమ్మెల్యే రాజేష్ కుమార్‌ను నియమించే ఆలోచనలో హస్తం పార్టీ ఉన్నట్లు సమాచారం.

ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ (సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్) అనుసరించిన వ్యూహాన్ని అనుసరించాలని ఆర్జేడీ కూడా యోచిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. ఎస్పీ మాదిరిగానే..వెనుకబడిన, అత్యంత వెనుకబడిన కులాల అభ్యర్థులను కూటమిలోకి తీసుకుని వారికి స్థానాలు కేటాయించడం ద్వారా ఎన్డీఏ కూటమిని దెబ్బకొట్టే ఆలోచనలో ఉంది మహాఘట్‌బంధన్.

Read More
Next Story