బీహార్ ఎన్నికలు: పనితీరు ఆధారంగా టిక్కెట్లు..
x
ఇటీవల జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నాయకుల సమావేశంలో జేడీ(యూ) నాయకుడు రాజీవ్ రంజన్ సింగ్, బీహార్ ఎన్నికల బీజేపీ ఇన్‌చార్జ్ ధర్మేంద్ర ప్రధాన్, జేడీ(యూ) ఎంపీ సంజయ్ కుమార్ ఝా, బీహార్ బీజేపీ ఇన్‌చార్జ్ వినోద్ తావ్డే, రాష్ట్ర మంత్రి విజయ్ కుమార్ చౌదరి, రాష్ట్ర డిప్యూటీ సిఎం సామ్రాట్ చౌదరి (ఫైల్)

బీహార్ ఎన్నికలు: పనితీరు ఆధారంగా టిక్కెట్లు..

నలుగురు సిట్టింగ్‌లకు నో ఛాన్స్ - 103 స్థానాల్లో అధికార జేడీ(యూ), 102 స్థానాల్లో బీజేపీ?


Click the Play button to hear this message in audio format

బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్(EC) తేదీ ఖరారు కావడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల జాబితా తయారీలో బిజీ అయ్యాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (CM Nitish Kumar) అభ్యర్థుల పూర్తి జాబితాను సిద్ధం చేశారని, నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఈ సారి పక్కన పెడుతున్నామని పార్టీ సీనియర్ లీడర్ ఒకరు తెలిపారు.

బీహార్ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 243. ఇందులో అధికార JD(U) 103 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉందని, త్వరలో ఎన్‌డీఏ(NDA) సీనియర్ నేతలు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని చెప్పారు.


పనితీరు ఆధారంగా సీట్లు..

"నియోజకవర్గాల్లో ఓటర్ల అభిప్రాయం ఆధారంగా మా ముఖ్యమంత్రి సీట్లు కేటాయిస్తున్నారు. పనితీరు సంతృప్తిగా లేని వారిని దూరం పెడుతున్నారు. భాగల్పూర్, నవాడా, బంకా జిల్లాల పరిధిలోని నలుగురు ఎమ్మెల్యేలు ఆ జాబితాలో ఉన్నారు. వారి స్థానాల్లో కొత్తవారు పోటీ చేస్తారు. ఇకపోతే ఖగారియా జిల్లాలోని మా ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ (పర్బట్టా నియోజకర్గం) గత వారం ఆర్జేడీలో చేరారు. దాంతో అక్కడ కొత్త అభ్యర్థిని బరిలోకి దింపుతున్నాం. మా మాజీ ఎమ్మెల్యే బీమా భారతి ప్రతిపక్షంతో చేతులు కలిపింది. ఆమె నియోజకవర్గం రుపౌలిలో కూడా కొత్తవ్యక్తిని పోటీలో ఉంచుతాం.’’ అని చెప్పారు.


ఎవరికి ఎన్ని సీట్లు..

ఎన్‌డీఏ కూటమిలోని ప్రధాన పార్టీ అధికార జేడీ(యూ) 103 సీట్లలో పోటీ చేస్తుండగా.. బీజేపీ(BJP) 102 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. గతంలో 20-22 సీట్లతో సరిపెట్టుకున్న కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్).. ఇప్పుడు మరిన్ని సీట్లు డిమాండ్ చేస్తుంది. మిగతా భాగస్వామ్య పార్టీలయిన హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM), రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM) కూడా ఈ సారి ఎక్కువ సీట్లు కోరే అవకాశం ఉందన్నది రాజకీయ విశ్లేషకులు మాట.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ ఉంటుంది. 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Read More
Next Story