బీహార్ ఎన్నికలు: RLM చీఫ్ ఢిల్లీకి పయనం..కారణమేంటి?
x
ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడుతున్న ఉపేంద్ర కుష్వాహా ..

బీహార్ ఎన్నికలు: RLM చీఫ్ ఢిల్లీకి పయనం..కారణమేంటి?

తన పార్టీకి 6 సీట్లు కేటాయించడం, మహువా సీటును LJP (RV)కి కేటాయించడంపై అసంతృప్తిగా ఉన్న రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహా..


Click the Play button to hear this message in audio format

బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly Polls) నేపథ్యంలో అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) సీట్ల సర్దుబాటు వివరాలు వెల్లడించిన తర్వాత కూటమిలోని పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి.

మొత్తం 243 స్థానాలకు గాను BJP, JD(U) 101 సీట్ల చొప్పున పంచుకున్నాయి. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి 29 సీట్లు కేటాయించారు. ఇక రాష్ట్రీయ లోక్ మోర్చా(RLM), హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM)కు ఆరు సీట్ల చొప్పున ఇచ్చారు.


శాంతించని RLM జాతీయ అధ్యక్షుడు..

తమకు కేవలం 6 సీట్లు కేటాయించడంపై రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM) జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహా అసంతృప్తిగా ఉన్నారు. మహువా నియోజకవర్గాన్ని కూడా కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని మరో NDA భాగస్వామి లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి కేటాయించడంపై ఆగ్రహంగా ఉన్నారు. కుష్వాహాను శాంతింపజేసేందుకు పాట్నాలోని ఆయన ఇంట్లో మంగళవారం రాత్రి బీజేపీ సీనియర్ నాయకులు సామ్రాట్ చౌదరి, నిత్యానంద్ రాయ్, నితిన్ నబిన్ సమావేశమయ్యారు.


షాను కలిసేందుకు..

JD(U)‌తో చర్చలు ఫలించకపోవడంతో నేరుగా తన అభిప్రాయాన్ని హోంమంత్రి అమిత్ షాతో పంచుకునేందుకు బుధవారం (అక్టోబర్ 15) ఢిల్లీకి బయలు దేరారు కుష్వాహా. అంతకుముందు పాట్నాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. “ఎన్డీఏలో ఏదీ బాగా లేదు. నేను ఢిల్లీ వెళ్తున్నా. NDA తీసుకుంటున్న నిర్ణయాలపై కొంత సమాలోచన అవసరం. దానిపై చర్చించేందుకు నేను వెళ్తున్నా. అంతా బాగానే ముగిస్తుందని ఆశిస్తున్నా" అని పేర్కొన్నారు.

ఢిల్లీలో దిగిన వెంటనే కుష్వాహా విలేఖరులతో మాట్లాడుతూ.. కూటమిలో కొన్ని సమస్యలు పరిష్కరించుకోవాల్సి ఉందని, అందుకే తాను అమిత్ షాను కలిసేందుకు వచ్చానని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను కూడా కుష్వాహా కలవనున్నారు. ఆయన వెంట కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు నిత్యానంద్ రాయ్ ఉన్నారు.

మరోవైపు JD(U)‌ ఎంపీ అజయ్ కుమార్ మండల్ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ తనను కలిసేందుకు అనుమతి ఇవ్వలేదని ఆయన గుర్రుగా ఉన్నారు.


‘ఆల్ ఈజ్ వెల్..’

కుష్వాహా ఢిల్లీకి వెళ్లడంపై కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ స్పందించారు. త్వరలో అంతా సర్దుకుంటుందని చెప్పారు. సంజయ్ కుమార్ రాజీనామా చేస్తానని ప్రకటించడంపై కూడా ఆయన మాట్లాడారు. "ఎన్డీఏ కూటమిలో ఎలాంటి చీలికలు లేవు. ఐక్యంగా ఉన్నాం. నితీష్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మా లక్ష్యం. ముఖ్యమంత్రి రేపు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తర్వాత వాతావరణం మారిపోతుంది" అని సమాధానమిచ్చారు.


‘నన్ను క్షమించండి..’

కాగా ఆదివారం (అక్టోబర్ 12) సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కుష్వాహా ఇలా పోస్టు చేశారు. “నేను మీ క్షమాపణ కోరుతున్నా. సీట్ల సంఖ్య మా అంచనాలకు అనుగుణంగా లేదు. మీ నిర్ణయం వేలాది కార్యకర్తలను బాధపెట్టింది.” అని పేర్కొన్నారు.

Read More
Next Story