బీహార్ ఎన్నికలు: అధిక పోలింగ్ శాతానికి కారణమేంటో చెప్పిన పీకే
x

బీహార్ ఎన్నికలు: అధిక పోలింగ్ శాతానికి కారణమేంటో చెప్పిన పీకే

అధిక పోలింగ్ నమోదుకు వలస కార్మికుల ఓట్లే కారణమన్న జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్..


Click the Play button to hear this message in audio format

బీహార్‌(Bihar)లో తొలిదశ ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ పర్సెంటేజీ 64.66 గా నమోదైంది. బీహార్ రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యధికం పోలింగ్ శాతం. భారీస్థాయిలో పోలింగ్‌ నమోదు కావడంపై జన్ సురాజ్ పార్టీ(Jan Suraaj Party) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) శుక్రవారం తన అభిప్రాయాన్ని విలేఖరులతో పంచుకున్నారు. ఈ సారి ఎన్నికలలో వలస కార్మికులే "ఎక్స్ ఫ్యాక్టర్" అని పేర్కొన్నారు. అధిక శాతం పోలింగ్ రికార్డు కావడం పాలనలో మార్పునకు సంకేతమన్నారు. రాష్ట్రీయ జనతాదళ్ (RJD), జనతాదళ్ (U) రెండింటి నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఓట్ల లెక్కింపు రోజున (నవంబర్ 14న) ఈ విషయం బయటపడుతుందన్నారు.

"నవంబర్ 14న చరిత్రలో నిలిచిపోతుంది. ఈ స్థాయిలో పోలింగ్ జరుగుతుందని ఏ పార్టీ వాళ్లు కాని, ఎవరూ కూడా ఊహించలేదు. 2 కోట్ల 10 లక్షలకు పైగా ప్రజలు ఓటు వేశారు. మార్పు కోసం వలస కార్మికులు పెద్ద సంఖ్యలో ఓటు వేశారు," అని చెప్పారు.

‘‘2011 జనాభా లెక్కల ప్రకారం.. బీహార్‌లో దాదాపు 7.06 లక్షల మంది వలస కార్మికులు ఉన్నారు. వారంతా ఉద్యోగాల కోసం రాష్ట్రం వీడి గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లారు. అక్టోబర్ 25 నుంచి అక్టోబర్ 28 వరకు జరిగిన ఛాత్ పండుగకు వారంతా వచ్చారు. పోలింగ్ రోజు వరకు ఇక్కడే ఉండి ఓటు హక్కు వినియోగించుకున్నారు.’’ అని వివరించారు. రెండో విడత పోలింగ్ నవంబర్ 11న జరుగుతుంది. ఫలితాలు 14న వెలువడతాయి.

Read More
Next Story