
రాహుల్‌ను కలవాలనుకుంటున్న బెంగాల్ మతువాలు .. కారణమేంటి?
కాంగ్రెస్‌ను వారు మూడో ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారా?
పశ్చిమ బెంగాల్(West Bengal)లో రెండో అతిపెద్ద షెడ్యూల్డ్ కుల (ఎస్సీ) సమూహం మతువాస్ (Matuas).. కాంగ్రెస్ (Congress) వైపు చూస్తున్నట్లు కనిపిస్తుంది. కమ్యూనిటీ ప్రతినిధి బృందం ఈ వారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్ అధిర్ రంజన్ చౌదరిని కలిసింది. వారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని కలువాలనుకుంటున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ ప్రతినిధి చందన్ ఘోష్ చౌదరి ది ఫెడరల్‌కు చెప్పారు. ఇదే విషయాన్ని శుక్రవారం (ఆగస్టు 29) అధిర్ విలేకరులతో పంచుకున్నారు. బీహార్(Bihar)లో 'ఓటర్ అధికార్ యాత్ర'(Voter Adhikar Yatra)లో ఉన్న రాహుల్‌ను కలిసేందుకు మతువా ప్రతినిధులు ఆసక్తిన చూపుతున్నారని చెప్పారు.
'కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్నారు'
"వారు భారీ సంఖ్యలో యాత్రలో పాల్గొని రాహుల్ గాంధీకి మెమోరాండం సమర్పించాలనుకుంటున్నారు. వారు కాంగ్రెస్ పార్టీలో చేరతామంటున్నారు. వారి కోరికను కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లా. బీహార్ లేదా న్యూఢిల్లీలో త్వరలో ఒక సమావేశం ఉండబోతుంది" అని అధిర్ చెప్పారు.
రాజకీయంగా విడిపోయిన మతువా మహాసంఘం..
అధిర్ రంజన్ చౌదరిని కలిసిన వారిలో అఖిల భారత మతువా మహాసంఘంలోని రెండు ప్రధాన వర్గాలతో సహా వివిధ మతువా సంస్థల సభ్యులు ఉన్నారు. వీరికి అత్యున్నత సంస్థగా పనిచేస్తున్న మహాసంఘం.. ప్రస్తుతం రాజకీయంగా విడిపోయింది. ఒక వర్గం TMCతో జతకట్టగా, మరొక వర్గం BJPకి మద్దతు ఇస్తోంది. బీజేపీ మద్దతు ఉన్న వర్గానికి కేంద్ర మంత్రి శంతను ఠాకూర్, ఆయన సోదరుడు ఎమ్మెల్యే సుబ్రతా ఠాకూర్ నాయకత్వం వహిస్తుండగా.. వీరి అత్త, టీఎంసీ రాజ్యసభ సభ్యురాలు మమతా బాల ఠాకూర్ మరో వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు.
ఠాకూర్ కుటుంబంలో అంతర్గత కలహాల కారణంగా మతువా సామాజిక వర్గం అసంతృప్తితో ఉంది. టీఎంసీ, బీజేపీ తమను పట్టించుకోవడం లేదని కమ్యూనిటీ నేతలు చౌదరి వద్ద వాపోయినట్లు సమాచారం.
మతువాలకు పార్టీల హామీ..
పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) త్వరగా అమలు చేయడం ద్వారా సమస్యలను పరిష్కరిస్తామని మతువాలకు బీజేపీ హామీ ఇస్తోంది. 2024 ప్రారంభంలో CAAను నోటిఫై చేసినా.. దాని కింద ఎవరు అర్హులు? ఏ డాక్యుమెంటేషన్ అవసరం.. అర్హత లేని వారి పరిస్థితి ఏమిటన్న దానిపై స్పష్టత లేదు.
మరోవైపు CAAను టీఎంసీ వ్యతిరేకిస్తోంది. పౌరసత్వం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని చెబుతోంది. అందుకు కారణం..మతువాస్ కమ్యూనిటీలో ఎక్కువ మందికి ఇప్పటికే ఓటర్లుగా నమోదై ఉండడం, ఇతర గుర్తింపు పత్రాలు కూడా వారి వద్ద ఉండడం.
మతువాలది నిర్ణయాత్మక పాత్ర..
వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న బెంగాల్‌లో కనీసం 30 అసెంబ్లీ స్థానాల్లో మతువా కమ్యూనిటీ నిర్ణయాత్మక పాత్ర పోషించబోతుంది. మరో 50 స్థానాల్లో ఆ సామాజిక వర్గానికి కొంత పట్టుంది.
భవిష్యత్తులో ఏ ఇబ్బంది లేకుండా ఉండేందుకు CAA కింద పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేందుకు బీజేపీ నిర్వహిస్తున్న అవగాహన శిబిరాలపై ఠాకూర్ కుటుంబంలోని విభేదాలు నీలినీడలు కమ్మేసింది. దీంతో ఈ శిబిరాలకు పెద్ద స్పందన రాలేదు.
ఆగస్టు 24న ఎంపీ శంతను మద్దతుదారులు CAAకు దరఖాస్తు చేసుకునేందుకు ఠాకూర్ నగర్‌లోని నత్మందిర్‌లో శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో తన తమ్ముడు శంతను మహాసంఘంలో " దళాల్ రాజ్ " నడుపుతున్నాడని, నిధులను దుర్వినియోగం చేస్తున్నాడని ఎమ్మెల్యే సుబ్రత ఆరోపించాడు. ప్రతిగా, తన అన్నయ్య టీఎంసీలో చేరడానికి ప్రయత్నిస్తున్నాడని శంతను ఆరోపించాడు. వీరి తల్లి చబిరాణి ఠాకూర్ సుబ్రతాకు మద్దతు ఇవ్వగా.. వారి తండ్రి మంజుల్ కృష్ణ ఠాకూర్ శంతనుకు మద్దతు ఇచ్చారు. యాదృచ్ఛికంగా వీరి అత్త, టీఎంసీకి చెందిన మమతా బాలా ఠాకూర్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు.
ఠాకూర్ కుటుంబంలో చీలికతో ప్రత్యామ్నాయం వైపు..
ఠాకూర్ కుటుంబంలో పెరుగుతున్న విభేదాలు కారణంగా మతువాలు ఇప్పుడు ప్రత్యామ్నాయ పార్టీ వైపు చూస్తున్నారు. ఉత్తర 24-పరగణాస్ జిల్లాలోని హబ్రాలో మతువాల ఆధిపత్యం ఎక్కువ. రాష్ట్రంలో ప్రతిపాదిత ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సరళీకరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 24న ఎస్సీ ఫెడరేషన్ చేపట్టిన ర్యాలీలో ప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సీనియర్ సభ్యుడు రణజిత్ ముఖర్జీ అతిథిగా హాజరయ్యారు. అక్కడే కాంగ్రెస్ వైపు మతువాస్ మొగ్గు చూపేందుకు బీజం పడింది.
‘రాహుల్ మీకు అండగా నిలుస్తారు’
గురువారం (28) ఠాకూర్ నగర్ లోని ఆలయం వద్ద మతువా కమ్యూనిటీనుద్దేశించి ప్రసగించడానికి కాంగ్రెస్ నార్త్ 24-పరగణాస్ (గ్రామీణ) జిల్లా అధ్యక్షురాలు ఇంద్రాణి దత్తా ఛటర్జీ వెళ్ళినప్పుడు.. సుబ్రతా ఠాకూర్ వర్గం నుంచి ప్రతిఘటన ఎదురైంది. "రాహుల్ గాంధీపై నమ్మకం ఉంచండి. ఈ దేశ పౌరులను రక్షణ కోసం ఆయన పోరాటం చేపట్టారు. అందులో మతువా సమాజం కూడా ఉంది. మమ్మల్ని నమ్మండి. మాపై దాడి జరిగినా సరే.. ఈ కలుషిత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాము." అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పీసీసీ కార్యాలయంపై దాడి..
ఇదిలా ఉండగా.. బీహార్‌లో జరుగుతోన్న 'ఓటర్ అధికార్ యాత్ర' సందర్భంగా.. ప్రధాని మోదీపై కాంగ్రెస్ మద్దతుదారుడు చేసిన వ్యాఖ్యలను నిరసనగా పార్టీ నాయకుడు రాకేష్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ మద్దతుదారుల బృందం శుక్రవారం కోల్‌కతాలోని ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంపై దాడి చేసింది.