ఎన్‌సీపీ నేత సిద్ధిఖీ హత్యకు పూణేలో కుట్ర జరిగిందా?
x

ఎన్‌సీపీ నేత సిద్ధిఖీ హత్యకు పూణేలో కుట్ర జరిగిందా?

ఎన్‌సీపీ నేత, 66 ఏళ్ల బాబా సిద్ధిఖీ హత్యకు పూణేలో స్కెచ్ గీశారని, ఇద్దరు అన్నదమ్ములు హత్యకు అవసరమైన ఆయుధాలను షూటర్లకు సమకూర్చారని పోలీసులు అనుమానిస్తున్నారు.


ఎన్‌సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధి్ఖీ హత్య కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ముంబయిలోని బాంద్రాలో తన కుమారుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ ఆఫీసులో ఉండగా.. ముగ్గురు దుండగులు బాబా సిద్ధిఖీపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.

66 ఏళ్ల సిద్ధిఖీ హత్య వెనక పూణేకు చెందిన ప్రవీణ్ లోంకర్ అతని సోదరుడు శుభమ్ లోంకర్ పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. షూటర్లు శివకుమార్ గౌతమ్, ధర్మరాజ్ రాజేష్ కశ్యప్‌కు ప్రవీణ్ లోంకర్ రూ. 50 వేలు అడ్వాన్స్‌ ఇవ్వడంతో వారి సిద్దిఖీ హత్యకు బైక్‌పై రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు చెబుతున్నారు.

ముగ్గురి అరెస్టు..

సిద్ధిఖీ హత్య కేసులో పోలీసులు ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశారు. హర్యానాకు చెందిన గుర్‌మైల్ బల్జీత్ సింగ్ (23), ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ రాజేష్ కశ్యప్ (19), (వీరిద్దరూ షూటర్లు), ప్రవీణ్ లోంకర్‌ పోలీసులు అదుపులో ఉన్నారు. సిద్ధిఖీ ఛాతీలో తుపాకీతో కాల్చినట్లు అమమానిస్తున్న మహ్మద్ యాసిన్ అక్తర్, శివకుమార్ గౌతమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మూడు నెలల క్రితం పూణేలో తనతో కలిసి పనిచేయాలని కోరింది కూడా గౌతమేనని పోలీసుల విచారణలో రాజేష్ కశ్యప్‌ చెప్పినట్లు సమాచారం. శివకుమార్ గౌతమ్ సెప్టెంబర్ 2023లో ముంబైలోని కుర్లాలోని వినోబా భావే నగర్ ప్రాంతానికి మకాం మార్చాడు.

శనివారం రాత్రి సిద్ధిఖీని కాల్చి చంపే వరకు ఈ ముగ్గురూ షూటర్లు తమ మొబైల్ ఫోన్‌లో టచ్‌లో ఉన్నారు. సిద్ధిఖీ వెనక ధర్మరాజ్ రాజేష్ కశ్యప్‌, గుర్‌మైల్ బల్జీత్ సింగ్ నిలబడి ఉండగా శివకుమార్ గౌతమ్ ముందు నుంచి కాల్పులు జరిపాడు. ప్రస్తుతం శివకుమార్ గౌతమ్ పరారీలో ఉన్నాడు.

సిద్దీఖీపై దాడికి పాల్పడింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగేనంటూ ప్రవీణ్ లోంకర్ అతని సోదరుడు శుభమ్ లోంకర్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు దాన్ని ఫేస్‌బుక్ నుంచి తొలగించారు. శుభమ్ లోంకర్ గురించి లోతుగా విచారణ జరిపిన పోలీసులకు అసలు షూటర్లకు తుపాకీలు, మందుగుండు సామగ్రిని శుభమ్ లోంకరేనని తెలిసింది. జనవరిలో అకోలా జిల్లాలో నమోదయిన ప్రత్యేక ఆయుధాల కేసులో శుభమ్ లోంకర్‌ జైలు జీవితం గడిపాడు.

పిస్టల్స్, మొబైల్ ఫోన్లు స్వాధీనం..

నిందితుల నుంచి రెండు పిస్టల్స్, 28 లైవ్ రౌండ్లు, నాలుగు మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, కుట్రకోణాన్ని మరింత లోతుగా విచారిస్తున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. లోంకర్ సోదరులు ఎవరెవరితో టచ్‌లో ఉన్నారన్న విషయాలను తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం సబర్మతి జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్‌ను ముంబై పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులు హరియాణాకు చెందిన గుర్‌మైల్ బల్జీత్ సింగ్ , ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ రాజేష్ కశ్యప్ తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవారమని పేర్కొన్నట్లు ఇప్పటికే పోలీసు వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే.

కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ కాల్పులకు పాల్పడింది. గత కొంతకాలంగా సల్మాన్‌ను టార్గెట్‌ చేసిన బిష్ణోయ్‌ గ్యాంగ్‌.. అతడి స్నేహితుడైన బాబా సిద్ధిఖీని హత్య చేయడంతో పలు అనుమానాలకు దారి తీస్తోంది. అయితే.. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సిద్ధిఖీకి ఎటువంటి బెదిరింపులు రాలేదని పోలీసులు పేర్కొన్నారు.

సల్మాన్‌ ఖాన్‌ను ఎందుకు టార్గెట్‌ చేశారు?

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ 1998లో కృష్ణ జింకలను వేటాడారు. దీనిపై కేసు నడుస్తున్నది. కృష్ణ జింకలను బిష్ణోయ్‌ వర్గం పవిత్రంగా భావిస్తారు. ఇదే వర్గానికి చెందిన లారెన్స్‌కు సల్మాన్‌ ఖాన్‌ జింకల వేట నచ్చలేదు. దీంతో 2018 నుంచి సల్మాన్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ ముఠా పని చేస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయన ఇంటిపై కాల్పులు జరిపింది. అంతకు ముందు ఆయన ఫామ్‌ హౌస్‌ వద్ద రెక్కీలు నిర్వహించింది. సుమారు 25 మంది సల్మాన్‌ ఖాన్‌పై దాడికి సిద్ధమవుతున్నారని ఇంటెలిజెన్స్‌ గుర్తించింది.

Read More
Next Story