Postmortem report | బీడ్ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్‌ మృతదేహంపై 56 గాయాలు
x

Postmortem report | బీడ్ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్‌ మృతదేహంపై 56 గాయాలు

ఘటనా స్థలం నుంచి 3.5 అడుగుల గ్యాస్ సిలిండర్ పైపు, కర్రలు, ఇనుప పంచ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


మహారాష్ట్ర(Maharashtra)లోని బీడ్(Beed) సర్పంచ్‌ సంతోష్ దేశ్‌ముఖ్‌(Santosh Deshmukh)ను దారుణంగా హత్య చేశారు. పోస్టుమార్టం నివేదిక (post-mortem report) తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహంపై 56 గాయాల ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదికను పరిశీలించిన ఒక అధికారి మాట్లాడుతూ.. “దేహంపై ఒకే ప్రాంతంలో చాలాసార్లు కొట్టినట్లు అనిపించింది. అందువల్లే రక్తస్రావం జరిగిందని,” పేర్కొన్నారు.

ఘటనా స్థలం నుంచి..

కాగా ఘటనా స్థలం నుంచి 3.5 అడుగుల గ్యాస్ సిలిండర్ పైపు, కర్రలు, ఇనుప పంచ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో దేశ్‌ముఖ్‌ను హింసించి హత్య చేసినట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నిందితుల మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దేశ్‌ముఖ్‌ను దారుణంగా గాయపరుస్తున్న దృశ్యాలను ఒక నిందితుడు రికార్డు చేశారని పోలీసులు వెల్లడించారు. దేశ్‌ముఖ్‌ను కొట్టడానికి ఉపయోగించిన గ్యాస్ సిలిండర్ పైపుపై రక్తపు మరకలు ఉన్నాయని పేర్కొన్నారు. ‘‘ఘటనా స్థలం నుంచి ఇనుప పంచ్, కర్రలతో పాటు వాహనాలకు సంబంధించి ఆరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC)లను, మూడు సెల్ ఫోన్లు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నాం,” అని ఒక పోలీసు అధికారి 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్'కు వెల్లడించారు.

నిందితులపై గతంలో పలు కేసులు..

దేశ్‌ముఖ్‌కు క్రూరంగా హత్యచేసిన నిందితులకు గతంలో నేర చరిత్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. శనివారం అరెస్టు చేసిన ప్రధాన నిందితుడు సుదర్శన్ ఘూలేపై హత్య, హత్యాయత్నం, భూస్వాధీనం, కిడ్నాపింగ్‌కు సంబంధించి 10 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే సహ నిందితులు ప్రతీక్ ఘూలే, కృష్ణ అంధాలే, మహేష్ కేదార్‌లపై హత్యాయత్నం, భూస్వాధీనం, అల్లర్లు, బెదిరింపు, అపహరణ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండేకు సన్నిహితంగా ఉండే వాల్మిక్ కారాడ్‌(Walmik Karad)పై 15 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హత్యాయత్నం, భూస్వాధీనం, మోసం, అల్లర్లకు సంబంధించినవి కూడా ఉన్నాయి. హత్యకు సంబంధించి సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.

దేశ్‌ముఖ్‌ను ఎందుకు హత్యచేశారు?

విండ్‌మిల్ కంపెనీ నుంచి డబ్బు డిమాండ్ చేయడాన్ని వ్యతిరేకించిన సంతోష్ దేశ్‌ముఖ్‌ను డిసెంబర్ 9న కొందరు కిడ్నాప్ చేసి హతమార్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు అనుమానిస్తున్న మహారాష్ట్ర ఎన్‌సీపీ (NCP) మంత్రి ధనంజయ్(Dhananjay) ముండే సన్నిహితుడు వాల్మిక్ కరాద్ మంగళవారం పూణెలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అదే రోజు బీడ్ జిల్లాలోని కేజ్‌లోని కోర్టుకు తీసుకెళ్లి 14 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. దేశ్‌ముఖ్ హత్యను దర్యాప్తు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం 10 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.

Read More
Next Story